గ్రాండ్‌ లెహంగా!

Grand lehanga! - Sakshi

ఏ చిన్న వేడుక అయినా లెహంగా డ్రెస్‌ తప్పనిసరి అవుతుంది. అమ్మాయి లెహంగా ధరిస్తే ఇంటికి పండగ వచ్చినట్టే! కానీ, ఈ రోజుల్లో డిజైనర్‌ లెహంగాలకు చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చు తగ్గించుకుంటూ లెహంగాకు గ్రాండ్‌ లుక్‌ వచ్చేలా డిజైన్‌ చేయవచ్చు.

సహజంగా లెహంగాలో రెండు రకాలున్నాయి. ఒకటి ప్యానెల్స్‌తో డిజైన్‌ చేస్తాం. రెండవది వృత్తాకారం (సర్కిల్‌) వచ్చేలా కట్‌ చేసుకుంటాం. ఇప్పుడు మనం డిజైన్‌ చేసుకునే లెహంగా సర్కిలర్‌ కట్‌ చేసినది.

ఇలాంటి లెహంగా మీదకు క్రాప్‌టాప్‌ జత చేసి వెస్ట్రన్‌ వేర్‌గానూ ధరించవచ్చు. ఏదైనా వెస్ట్రన్‌ టాప్‌ వేసుకొని బర్త్‌డే, గెట్‌ టు గెదర్‌ వంటి వెస్ట్రన్‌ పార్టీస్‌కు హాజరవ్వచ్చు.
ముందుగా కలర్‌ కాంబినేషన్స్‌ చూసుకోవాలి.
సర్కిలర్‌ లెహంగాకు 4 నుంచి 5 మీటర్ల ఫ్యాబ్రిక్‌ సరిపోతుంది.
లతలు, పువ్వులు, బుటీస్‌ డిజైన్స్‌ ఉన్న రెడీమేడ్‌ నెట్‌ ఫ్యాబ్రిక్‌ మార్కెట్లో లభిస్తుంది. (ఒరిజనల్‌ లెహంగా మీద హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేశారు) ఈ ఫ్యాబ్రిక్‌ మీటర్‌ ధర 300 నుంచి 400 రూపాయల వరకు లభిస్తుంది.  
లెహెంగాకు అంచు ఎంబ్రాయిడరీ చేసినది
వాడాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకని, లెహంగా కలర్‌ సెమీ సిల్క్‌ ప్లెయిన్‌ ఫ్యాబ్రిక్‌ని అంచుగా జత చేయాలి.

లెహంగా మీదకు ఇండోవెస్ట్రన్‌ లుక్‌ వచ్చేలా ఏ టాప్‌ అయినా ధరించవచ్చు. సంప్రదాయపు లుక్‌ కోసం, ఇంకాస్త గ్రాండ్‌ లుక్‌ రావాలని లాంగ్‌ బ్లౌజ్‌ను డిజైన్‌ చేశాం.
లెహంగాలో ఎరుపు, నలుపు రంగుల కాంబినేషన్‌ ఉంది. అందుకని బ్లౌజ్‌ పార్ట్‌లో ఈ రెండు షేడ్స్‌ వచ్చేలా ఎరుపు రంగు నెట్, బంగారు రంగు టిష్యూ ఫ్యాబ్రిక్స్‌ని ఎంపిక చేసుకున్నాం.
బ్లౌజ్‌ నెక్‌కి స్వరోస్కి స్టోన్స్‌ వాడాను. ఖర్చు తగ్గాలంటే వైట్‌ స్టోన్స్‌ని గ్లూతో అతికించవచ్చు.
సెమీ టిష్యూ ఫ్యాబ్రిక్‌ మీటర్‌ ధర 250 రూపాయల నుంచి లభిస్తుంది.

లెహంగా, బ్లౌజ్‌ సిద్ధం చేసుకున్నాక ఇలా కూడా పార్టీలకు హాజరవ్వచ్చు. ఇంకాస్త గ్రాండ్‌గా, సంప్రదాయత ఉట్టిపడేలా రెడీ అవ్వాలంటే ఒక ట్రెడిషనల్‌ దుపట్టా ధరించాలి. అది కూడా లెహంగా, బ్లౌజ్‌కి సెట్‌ అవ్వాలి. అందుకని, ప్లెయిన్‌ కలర్‌ నెట్‌ ఫ్యాబ్రిక్‌ తీసుకొని, బార్డర్‌కి, బుటీస్‌కి హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేయించాను. ఖర్చు తగ్గించుకోవాలంటే రెడీమేడ్‌ థ్రెడ్‌ ఎంబ్రాయిడరీ బార్డర్స్‌ని దుపట్టాకు జత చేసుకోవచ్చు. ఇంకా ఖర్చు తగ్గించుకోవాలంటే లెహంగా ఫ్యాబ్రిక్‌నే దుపట్టాకు బార్డర్‌గా వేసుకోవచ్చు. మిషన్‌ ఎంబ్రాయిడరీ అంచులు మార్కెట్లో లభిస్తాయి. ఇవి మీటర్‌కు 100 రూపాయల నుంచి ధర ఉంటుంది. సెమీ నెట్‌ ఫ్యాబ్రిక్‌ మీటర్‌కి 300 రూపాయల నుంచి ధర ఉంటుంది.

ఆహ్లాదాన్ని కలిగించే పరిమళం
వాతావరణం చల్లగా ఉన్న కాలంలో ఘాటుగా ఉండే పెర్‌ఫ్యూమ్స్‌ వాడినా పర్వాలేదు. కానీ, వేసవిలో మాత్రం చాలా మైల్డ్‌గా అంటే గాఢత తక్కువగా ఉండే సెంట్‌ వాడకం మేలు. ∙పూలు, పుల్లటి పండ్లు నిమ్మ, ఆరెంజ్‌ వాసనలు వేడిమిలోనూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి
నేచరల్‌ ఆయిల్స్‌ గల సెంట్స్‌ రోజంతా తాజాదనాన్ని కలిగిస్తాయి.
గాఢమైన సెంట్‌ వల్ల తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
పెర్‌ఫ్యూమ్‌ని కొనుగోలు చేసే ముందు చెవి వెనకాల, ముంజేతి మీదుగా ఒకసారి స్ప్రే చేసుకొని చెక్‌ చేసుకోవాలి.
రోజూ నేరుగా చర్మానికి కాకుండా ధరించిన దుస్తుల మీద స్ప్రే చేసుకుంటే చర్మ సమస్యలు దరిచేరవు.

సిగలో బంగారం

1. చెవికి చిన్న చిన్న రాళ్ల స్టడ్స్‌ వాడుతుంటాం. వేడుకకు సింపుల్‌గా హాజరవ్వాలంటే నీటుగా కొప్పు వేసి, చెవికి వాడే ఆ చిన్న స్టడ్‌ని హెయిర్‌ పిన్నుకు జత చేసి కొప్పుకు సెట్‌ చేస్తే ఇలా చూడముచ్చటగా ఉంటుంది.
2. అర్ధచంద్రాకారంలో లేయర్లుగా ఉండే చాంద్‌బాల్‌ జుంకాలు పెద్ద పెద్దవి ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిలో ఒక చెవి జుంకా తీసుకొని, కొప్పున సింగారిస్తే.. ముచ్చటైన అందం.
3. కుందన్స్‌తో ఉండే హారాన్ని కొప్పు చుట్టు పెట్టి, పిన్నులతో పువ్వులను ముడిచినట్టు జాగ్రత్తగా సెట్‌ చేయాలి.  ఆ సింగారం చూడ్డానికి రెండు కళ్లు చాలవు.
సంప్రదాయపు దుస్తుల మీద ఈ తరహా సింగారం
చూపుతిప్పుకోనివ్వవు.

విన్నారా!

చెవులున్నవి మాటలు వినడానికేనా అందాన్ని పొందికగ్గా చూపడానికి కూడా అనిపిస్తుంది కదా ఈ జంకాల డిజైన్లు చూస్తుంటే! గుండెను బరువెక్కించే మాటల తూటాల దాడిని తప్పించుకుంటూ ... తేలికగా సౌందర్యానికి చిరునామాగా మారుతున్న జుంకాలను చెవులకు చేర్చేస్తుంది నేటితరం. ధరించే దుస్తులు కాస్త డల్‌గా ఉన్నా సరే బ్రైట్‌గా ఉండే జుంకాలను చెవికి తగిలించి లుక్‌ని స్టైలిష్‌గా మార్చేస్తున్నారు.

చాంద్‌బాల్స్‌కే ఓటు
ఇవి ఎప్పటి నుంచో వాడుకలో ఉన్నప్పటికీ ‘రామ్‌లీలా’ అనే సినిమా వచ్చినప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. వీటిలోనే ఎన్నో మోడల్స్‌. చుట్టూతా అల్లుకుపోతూ చెవినిల్లు కట్టుకున్నాయి. ‘చాంద్‌కి తుక్‌డా’ అంటూ అతివల మదిని దోచుకుంటున్నాయి.

‘బుట్ట’లో పడేస్తున్నాయి
గుండ్రంగా గొడుగును తలపించే బుట్టల డిజైన్లు మరో వైపు కదలనివ్వవు. కుందన్స్, ముత్యాలు, రకరకాల రాళ్లు.. అన్నింటినీ చేర్చుకొని అందంగా మెరిసిపోతున్నాయి. హాఫ్, ఫుల్‌శారీ సంప్రదాయ దుస్తులు ఏవైనా బుట్టల జతలు ఎన్నున్నా మరోటి అని మనసు లాగేస్తుంది. బంగారం, ఇమిటేషన్‌ జువెల్రీలో ఎన్నో డిజైన్లు హల్‌ చల్‌ చేస్తున్నాయి.

‘వరుస’లు కలిపేస్తున్నాయి
పేటల హారాలు మెడను అలంకరించుకోవడమేనా అని తరుణిలు దబాయించారేమో! అందుకే ఆభరణాల నిపుణులు చెవి సింగారాలకు వరసలు కట్టేస్తున్నారు. ప్రతీ డిజైన్‌ని పొందికగా అమర్చుతున్నారు. వీటిలో కాక్‌టెయిల్‌ జుంకాలూ కదం తొక్కుతున్నాయి. ఫ్యాషనబుల్‌ దుస్తులమీద మరింత స్టైల్‌ని క్రియేట్‌ చేస్తున్నాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top