స్వచ్ఛాగ్రహం | government will give paise to build a toilet | Sakshi
Sakshi News home page

స్వచ్ఛాగ్రహం

Jun 12 2019 2:12 AM | Updated on Jun 12 2019 2:12 AM

government will give paise to build a toilet - Sakshi

చుట్టూ ఉన్న వాళ్ల ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంది. మూడు రోజులు బడి మానుకుంది. ఆత్మగౌరవం, ఆరోగ్యమే ముఖ్యమని వాదించింది. పట్టుబట్టి మరుగుదొడ్డి కట్టించింది.

బహిర్గత బహిర్భూమి వల్ల రోగాల బారిన పడతామని, మహిళలకు ఆత్మగౌరవం ముఖ్యమని మరుగుదొడ్డి నిర్మిస్తేనే బడికి వెళ్తానని పట్టుబట్టింది. చివరకు ఆ తల్లితండ్రులు తలొగ్గి మరుగుదొడ్డి నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్‌ మండలంలోని ఆరేపల్లి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న భవాని బహిర్గత మలమూత్ర విసర్జన వలన జరిగే నష్టాల గురించి పాఠశాలలో ఉపాధ్యాయులు వివరించడంతో నిర్ఘాంతపోయింది. గ్రామపంచాయతీ కార్యదర్శి నరేష్‌కుమార్‌ కిశోర బాలికలకు ఈ విషయమై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. పుట్టినప్పటినుండి  తాను, తన తల్లితండ్రులు ఆరుబయటికే ఒంటికి, రెంటికి పోతున్నామని, దీనివల్ల తమతోపాటు తమ చుట్టుపక్కల వాళ్లు కూడా ఎంతో నష్టపోతున్నారని ఆందోళన చెందింది.

స్కూల్‌ నుండి ఇంటికి వచ్చిన భవాని మరుగుదొడ్ల నిర్మాణం కోసం తల్లితండ్రులను ఎలాగైనా ఒప్పించాలని నిర్ణయించుకుంది.  తల్లి పార్వతమ్మ, తండ్రి కృష్ణయ్యలను మరుగుదొడ్డి నిర్మించాలని కోరింది. దీనికి వారు ఆర్థికస్థితిగతులు, తమ పరిస్థితులను చెప్పి తమవల్లకాదని తేల్చి చెప్పారు. ఎలాగైనా ఒప్పించాలనే పంతంతో మూడురోజుల పాటు బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. బడికి  వెళ్లాలంటూ తల్లితండ్రులు ఒత్తిడి చేయడంతో తాను బడిమానుకుంటున్నానని. తనకు మరుగుదొడ్డి నిర్మిస్తేనే చదువుకుంటానని పట్టుబట్టింది.. ‘‘మరుగుదొడ్డి కట్టేందుకు పైసలు లేవమ్మా! పంట చేతికి వచ్చిన తరువాత కట్టుకుందాం లేమ్మా’’ అని తల్లితండ్రులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ప్రభుత్వమే పైసలు ఇస్తుందని, ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం లేదని భవాని వివరించింది. ఇక తప్పేటట్టు లేదని తల్లితండ్రులు నిశ్చయించుకుని మరుగుదొడ్డి నిర్మాణాన్ని ప్రారంభించారు. వారంరోజుల్లో నిర్మాణం పూర్తి కానుంది. దీంతో తన సమస్య పరిష్కారం అయిందని అంతటితో విషయాన్ని వదిలేయకుండా బహిరంగ మలమూత్ర విసర్జనలకు వెళుతున్న మహిళలకు ఇలా బయటికి వెళ్లడం తప్పని చెప్పింది. అందరితోనూ. చివాట్లు తింది. అయినా రోజు ఉదయం అదేపనిగా చెబుతోంది. పాఠశాలలో సైతం తోటివిద్యార్థులకు మరుగుదొడ్ల ప్రాముఖ్యత, ఆత్మగౌరవం, లాభనష్టాల గురించి వివరిస్తోంతది.

కలెక్టర్‌ అభినందనలు...
విద్యార్థిని భవాని పట్టుబట్టి మరుగుదొడ్డిని నిర్మించుకుంటున్న విషయం సాక్షి దినపత్రికలో ప్రచురితం కావడంతో విషయం తెలుసుకున్న వనపర్తి జిల్లా కలెక్టర్‌ శ్వేతామహంతి ఆ విద్యార్థినిని జిల్లా కేంద్రానికి పిలిపించి ప్రత్యేకంగా అభినందించి ఒక సైకిల్, కొత్తబట్టలు, పుస్తకాలు, నోటుపుస్తకాలు, ఇతర వస్తువులను భవానికి బహూకరించారు.
చదువుకుంటున్న విద్యార్థులు భవానిని ఆదర్శంగా తీసుకుని మరుగుదొడ్లు లేని కుటుంబాల వారిని ప్రోత్సహించాలని సూచించారు. అలాగే జిల్లా విద్యాధికారి సుచీందర్‌రావు, డీఆర్‌డీఓ.గణేష్, ఎంపీడీఓ.శ్రీపాద్, ఏపీఓ.సుకన్యలు విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు.
– మహ్మద్‌ రఫి,
సాక్షి, ఆత్మకూర్‌ (వనపర్తిజిల్లా)

ఆత్మగౌరవమే ముఖ్యం
బహిర్గత మలమూత్రవిసర్జనల వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. దీనికితోడు మహిళలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు.  మా ఇంటినుండే ఆత్మగౌరవమే ముఖ్యమనే విషయాన్ని చాటిచెప్పాలనుకున్నాను. బడిమానేసి మరుగుదొడ్డి నిర్మించే విధంగా అమ్మానాన్న లను ఒప్పించాను. ఊర్లో మరుగుదొడ్లు లేని కుటుంబాలకు అవగాహన కల్పిస్తున్నాను. జిల్లా కలెక్టర్‌ నాకు అభినందించి బహుమతులను అందచేయడంతో నాకు భాద్యత మరింత పెరిగింది.
– భవాని, విద్యార్థిని, ఆరేపల్లి గ్రామం, ఆత్మకూర్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement