సుడులతో పోరాడి ప్రాణాలను పట్టుకొచ్చారు!

Fisher Men Save To Devipatanam Tourists In Boat Capsizes - Sakshi

అంతటి గోదావరి సుడిలో దిగితే ఏటికి ఎదురీదినట్టే! అక్కడి లోతు 300 అడుగుల పైనే ఉంటుంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎంతటి గజ ఈతగాడికైనా ప్రాణాలు నీట కలిసిపోతాయి.  కానీ ఆ గిరిజనులు గోదావరి సుడిని, లోతును చూసుకోలేదు. కళ్లెదుట మునిగిపోతోన్న బోటు, అందులో ఆర్తనాదాలు చేస్తోన్న పర్యాటకులు మాత్రమే వారికి కనిపించారు. ఆ క్షణాన వారికి వేరే ఏమీ గుర్తుకు రాలేదు. అందరిదీ ఒకటే లక్ష్యం. బోటులో మునిగిపోతున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చడం.  అనుకున్నదే తడువుగా కచ్చులూరు గ్రామానికి చెందిన గిరిజన మత్స్యకారులు మూడు బోట్లలో ఒక్క ఉదుటున గోదావరి వడిని లెక్క చేయకుండా ముందుకు కదిలారు.

మునిగిపోతున్న రాయల్‌ వశిష్ట పున్నమి బోటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే నదిలో పడిపోయి కొట్టుకుపోతోన్న వారిని ఒడిసి పట్టుకుని బోట్లలో వేసుకుని ఒడ్డుకు చేర్చారు. ఒక్కో బోటులో ఆరుగురు వంతున మూడు బోట్లలో వెళ్లిన పద్దెనిమిది మంది గిరిజనులు తమ ప్రాణాలను పణంగా పెట్టి, చేతికి అందినవారిని అందినట్లుగా బయటకు తీసుకువచ్చారు. అలా మొత్తం 24 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడారు.
– సాక్షి ప్రతినిధి బృందం, దేవీపట్నం

తెలిసినా తెగించాం
కచ్చులూరు వద్ద గోదావరి ఒడ్డున ర్యాంపు ఉంది. బోటు ప్రమాదం జరిగే సమయంలో సుమారు ముప్ఫై మందిమి ఒడ్డున కూర్చొని ఉన్నాం. ఆ సమయంలో బోటు ఒక పక్కకు ఒరిగిపోవడం గమనించాం. చూస్తుండగానే కళ్లెదుటే బోటు మునిగిపోతోంది. మునిగిపోతున్న వారిని రక్షించాలని ప్రాణాలు లెక్కచెయ్యకుండా వెళ్లాం. ప్రమాదకరమని తెలిసినా వారి ప్రాణాలు కాపాడాలనే అనుకున్నాం.

– నేసిక లక్ష్మణ్‌రావు

కొందరినే రక్షించగలిగాం
నదిలో తేలుతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. మా ప్రాణాలు ఫణంగా పెట్టయినా వారిని రక్షించాలని అనుకున్నాం. వెంటనే బోట్లు తీసుకుని ప్రమాద స్థలానికి వెళ్లాం. అయితే నీటిపై తేలుతున్న వారిని మాత్రమే రక్షించగలిగాం. బోటు గోదావరిలోకి మునిగిపోయినప్పుడు లైఫ్‌ జాకెట్లు వేసుకోని వాళ్లు నీటిలో మునిగిపోయారు. ఉన్నవారిని రక్షించలేకపోయాం.

– కొణతల బాబూరావు

ఉండలేక లోపలికి వెళ్లాం
బోటు ప్రమాదం జరిగే సమయంలో గోదావరి సుడులు తిరుగుతోంది. ఆ సమయంలో గోదావరిలోకి వెళ్లడం చాలా ప్రమాదకరం. అయినప్పటికీ నదిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించాలనే తపనతో లోపలికి వెళ్లాం. నదిపై తేలుతున్న వారిని కాపాడటానికి చాలా సాహసం చేశాం.

– నెరం కృష్ణ  

చాలా కష్టపడాల్సి వచ్చింది
వారు మాకేమీ రక్తసంబంధీకులు కారు. వారెక్కడి వారో అసలు తెలియనే తెలియదు. ఆ క్షణాన వారి ఆర్తనాదాలే మమ్మల్ని కదిలించాయి. బోటు ప్రమాదం జరిగిన పావుగంటలోనే గోదావరిలోకి బయలుదేరి వెళ్లాం. నది ప్రవాహం ప్రమాదకరంగా ఉంది. అయినా ప్రాణాలకు తెగించాం. కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము వెళ్లిన బోటులో ఆరుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చాం.

– నేసిక చినబాబు

మనసుకు బాధేసింది
మా గ్రామం గోదావరి నది ఒడ్డునే కావడంతో చిన్నప్పటి నుంచి గోదావరిలో ఈత కొట్టడం అలవాటు. ఈత రావడంతో బోటు ప్రమాదం జరిగిన వెంటనే బోటులో వెళ్లి గోదావరిలో కొట్టుకుపోతున్న వారిని రక్షించేందుకు నా వంతు ప్రయత్నించాను. కొందరైతే కళ్లెదుటే కొట్టుకుపోయారు. అప్పుడు మనసుకు బాధేసింది. కానీ ఏమీ చేయలేకపోయాను. నేను లైఫ్‌ జాకెట్లు వేసుకున్న ఇద్దర్ని మాత్రమే ఒడ్డుకు చేర్చాను. నాతో పాటు వచ్చిన వారు కూడా కొట్టుకుపోతున్న వారిని రక్షించడం చూసి మనసు కుదుటపడింది.

– కానెం నాగార్జున

కళ్ల ముందే ఒరిగిపోయింది
మధ్యాహ్నం ఒంటి గంట కావస్తోంది. అప్పుడే భోజనాలు చేసి ఎప్పటి మాదిరిగానే గోదావరి ఒడ్డుకు చేరి కబుర్లు చెప్పుకుంటున్నాం. పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా గోదావరిలో ఏదో బోటు వెళుతుండటం చూస్తున్నాం. ఇంతలోనే బోటులో హాహాకారాలు వినిపించాయి. అప్పటి వరకూ గ్రామంలో కార్యక్రమాల గురించి చెప్పుకుంటున్న మేమంతా ఒక్కసారిగా గోదావరి వెంట పరుగుపెట్టి మెకనైజ్డ్‌ బోట్లు తీసుకుని బయలుదేరాం. చూస్తుండగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి బోటు ఒక పక్కకు ఒరిగిపోయింది. వెంటనే మా వద్ద ఉన్న మూడు ఇంజిన్‌ బోట్లలో గోదావరిలోకి వెళ్లాం. లైఫ్‌ జాకెట్లు వేసుకుని పైకి తేలుతున్న వారందరినీ రక్షించి ఒడ్డుకు చేర్చాం.

– కానెం రామస్వామి

మరిచిపోలేని రోజు
ఎన్నో ఏళ్లుగా ఆ నది గట్టున కూర్చుంటున్నాం. కానీ ఏనాడూ ఇటువంటి సంఘటన చూస్తామని, మా చేతులతో ఇంతమంది ప్రాణాలు కాపాడతామని అనుకోలేదు. కచ్చులూరు మందంలో బోటు ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇక్కడ గోదావరి నది లోతు సుమారు మూడొందల అడుగులు ఉంటుంది. బోటు డ్రైవర్లు ఇక్కడకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటారు. దురదృష్టవశాత్తూ బోటు ప్రమాదం జరిగింది. కొందరినైనా రక్షించగలిగాం. మా జీవితంలో మరిచిపోలేని రోజు అది.

– నేసిక చినలక్ష్మణ్‌రావు

మా ప్రాణాల కంటే ముఖ్యమనుకున్నాం
బోటు ప్రమాదం జరిగిన తరువాత గోదావరి నదిలో మునిగిపోతున్న వారు రక్షించాలంటూ కేకలు వేశారు. ప్రమాద సమయంలో గోదావరిలో నీరు ఉద్ధృతంగా ఉంది. ప్రమాద స్థలంలో నీరు సుడులు తిరుగుతోంది. నదిలో కొట్టుకుపోతున్న వారిని కాపాడాలని తెగించి మూడు బోట్లు తీసుకుని నదిలోకి వెళ్లాం. కొంత మందిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. నదిలో కొట్టుకుపోతున్న ఓ మహిళను చెయ్యి పట్టుకుని కాపాడి బోటులోకి చేర్చాను.

– సంగాని శ్రీనివాస్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top