
ఖరీదైన సౌందర్య ఉత్పాదనలే చర్మ సంరక్షణకు వాడాలి అనే నిబంధన ఏమీ లేదు. సాధారణ జాగ్రత్తలతోనే వానాకాలం ఎదురయ్యే ఇబ్బందులకు చెక్ పెట్టవచ్చు.
∙రోజూ ఉదయం సాయంత్రం యాంటీబ్యాక్టీరియల్ లేదా క్లెన్సింగ్ సబ్బు/లోషన్‌ను శరీర శుభ్రతకు ఉపయోగించాలి. వీటి వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే గాక ఈ కాలపు బ్యాక్టీరియా దాడిని అడ్డుకోవచ్చు.
∙ చర్మంపై పొలుసులుగా కనిపించే మృతకణాలను సహజపద్ధతులతో తొలగించుకోవాలి. దీనికి నలుగుపిండి మేలైన ఎంపిక. మృతకణాల తొలగింపునకు నిమ్మరసం, పసుపు కూడా బాగా పనిచేస్తాయి.
∙చర్మంపై మలినాలను తొలిగించడానికి ఆల్కహాల్ లేని టోనర్‌ని ఉపయోగించాలి. దీని వల్ల స్వేదరంధ్రాలు తెరుచుకుంటాయి. ఫలితంగా చర్మం తేమను కోల్పోదు. (క్లెన్సింగ్ ఉత్పత్తులను కోనుగోలు చేసే ముందు ప్రొడక్ట్ వెనకవైపు ఇచ్చే లేబుల్ పరిశీలించాలి)
∙ చల్లగా, మబ్బుగా వాతావరణం ఉంటుంది కదా అని వదిలేయకుండా బయటకు వెళ్లడానికి ముందు సన్‌స్క్రీన్ లోషన్, ఎస్.పి.ఎఫ్ 15 నుంచి 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్‌ను సూర్యకాంతి పడే శరీరభాగాలకు ఉపయోగించాలి. అధిక ఎస్.పి.ఎఫ్ ఉన్న లోషన్‌ని ఉపయోగిస్తే చర్మం మరీ జిడ్డుగా అనిపిస్తుంది. అందుకని తగినంత మోతాదులో రాసుకోవాలి.
∙ క్రీమ్ తరహా కాకుండా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్/సీరమ్ వాడితే చర్మం డీహైడ్రేట్(నిస్తేజం) కాకుండా, కాంతిమంతంగా కనిపిస్తుంది.