చివరి బస్సు

Family crime story special - Sakshi

చీకటి మడుగు. చీకటి అపాయం. చీకటి పాపం.చీకటి తప్పు.సత్యాన్ని కనుగొనడానికి చివరి బస్సు బయలుదేరింది.చీకటిలో జరిగింది  ‘సూర్యు’ని వెలుగుతో బయటపడింది. 

07– 07– 2017.తారీఖులో చాలా ‘7’లు ఉన్నాయి.అందుకే ఆ రోజుకి ‘ఏడు’పుకి దగ్గర సంబంధం నిర్ణయించినట్టుంది విధి. పగతో రిగలిన ఓ గుండె చీకటి కాగితంపై రక్తసంతకం చేసింది.తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లాలో జరిగిందీ సంఘటన.

రాత్రి పది గంటలు.బెల్ట్‌షాప్‌ అనబడే ఆ మద్యం షాప్‌ దగ్గర జనం పలచబడ్డారు. అడపా దడపా కొనుక్కెళ్లేవారు వస్తున్నారు. తాగి వెళ్లేవారు అక్కడే కూర్చొని తాగుతున్నారు. ఒకరిద్దరు పక్కనే ఉన్న పర్మిట్‌ రూమ్‌లో కూర్చొని తాగి, తిని వెళుతున్నారు. షాప్‌కి కూతవేటు దూరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి తూలుకుంటూ వెళుతూ వెళుతూ కింద పడిపోయాడు.ఇలాంటి ఘటనలు ఆ షాప్‌ దగ్గర మామూలే! తాగి మత్తుతో పడిపోవడం, ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు లేచి ఇళ్లకి వెళ్లిపోవడం తరచూ జరుగుతుంటాయి.రోడ్డుకు ఓ వైపుగా పడి ఉన్న వ్యక్తిని చూసిన జనాలు ‘మందు ఎక్కువై ఉంటుంది’ అనుకుని వెళ్లిపోయారు. బెల్ట్‌ షాప్‌లోని పర్మిట్‌రూమ్‌లో పనిచేసే ఒకామె పడిపోయిన ఆ వ్యక్తిని దూరం నుంచే చూసి ఎక్కడిదక్కడ వదిలేసి పనుందని గబగబ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయింది.

రాత్రి పదిన్నర దాటింది.పోలీస్‌స్టేషన్‌లో ఫోన్‌ మోగింది. ‘సార్, ఇక్కడి బెల్ట్‌ షాప్‌(మద్యంషాప్‌) దగ్గర ఓ మనిషి పడున్నాడు. అతని తల చుట్టూ రక్తం పేరుకుపోయి ఉంది’ అని సమాచారం చేరవేశాడు ఓ వ్యక్తి.
హుటాహుటిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిందపడున్న వ్యక్తిని పరిశీలించారు. తల చుట్టూ రక్తం ఇంకా పచ్చిగానే ఉంది. పక్కనే రాయి ఉంది. బహుశా మద్యం మత్తులో తూలి ఆ రాయిమీద పడుంటాడు తలకు దెబ్బతగిలింది ఆసుపత్రికి చేర్చుదాం.. అనుకున్న పోలీసులకు అచేతనంగా పడి ఉన్న ఆ వ్యక్తి శరీరం ప్రాణం లేదని స్పష్టం చేసింది. అతని వద్ద ఏమైనా ఆధారాలు ఉంటాయేమో అని వెతికారు. కానీ, ఎలాంటి ఆధారం దొరకలేదు. బెల్ట్‌షాప్‌ ఓనర్‌ని అడిగారు. తమకేమీ తెలియదని చెప్పాడు అతను. అక్కడున్న సిబ్బందీ అదే విషయం చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తి ప్రమాద సంఘటనగా కేసుగా నమోదు చేసుకొని పోలీసులు బాడీని పోస్టుమార్టంకి పంపించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ వచ్చింది. అది చూసి పోలీసులు షాక్‌ అయ్యారు.ఎడమ వైపు కణతిలో తుపాకీ గుండు దూసుకెళ్లడం కారణంగా ఆ వ్యక్తి మరణించాడు అని ఉంది రిపోర్ట్‌లో.  పోలీసులు అలర్ట్‌ అయ్యారు.రాయి తగిలి ప్రమాదవశాత్తు మరణించాడని అనుకున్నారు. అలాంటిది పిస్టల్‌తో చంపేటంత ప్రొఫెషనల్స్‌ ఎవరై ఉంటారు? ఇది ఏదైనా ముఠాకు సంబంధించిన ఇష్యూనా? ఇంతకీ చనిపోయిన ఈ వ్యక్తి ఎవరు? ఇతని వద్ద ఫోన్‌ ఆధారం కూడా లేదు. నిద్రాహారాలు లేవు పోలీసులకు.విచారణ ముమ్మరమైంది.
 

బెల్ట్‌షాప్‌ దగ్గర సంఘటన జరిగింది కాబట్టి అక్కడ నుంచే విచారణ మొదలుపెట్టారు పోలీసులు. బెల్ట్‌ షాప్‌ ఓనర్‌ని, అందులో పనిచేసే సిబ్బందినీ పిలిపించారు.అందరిదీ ఒకే మాట.. ‘ఎలా జరిగిందో, ఎవరు చేశారో మాకు తెలియదు’ అన్నారు. బెల్ట్‌షాపు పక్కనే ఉండే పర్మిట్‌ రూమ్‌లో పనిచేసే ఆమె వంతు వచ్చింది. బెరుకుగా చూస్తున్న ఆమెను అనుమానంగా చూశారు పోలీసులు. ‘ఏమైందో నీకు తెలుసు. విషయం చెప్పు’ గద్దించాడు ఎస్సై. ‘నాకేం తెలియదు సార్‌! భోజనం పెట్టమని ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారికి అన్నం పెట్టాను. మాటల్లో వాళ్లు సూర్యాపేటకు వెళ్లడం గురించి మాట్లాడుకోవడం వినిపించింది. అందులో ఒకతని దగ్గర తుపాకీ ఉంది. అన్నం తిని వాళ్లు వెళ్లిపోయారు. రూమ్‌ అంతా శుభ్రం చేసే పనిలో పడిపోయాను. బయట చెత్త వేయడానికి వచ్చినప్పుడు ఏదో పేలిన శబ్దం చిన్నగా వచ్చింది. ఆ శబ్దం వచ్చిన వైపుగా చూస్తే ఆ దారిలో ఓ వ్యక్తి పడిపోయున్నాడు. ఇక్కడి నుంచి వెళ్లిన వాళ్ల దగ్గర తుపాకీ ఉందని గుర్తుకు వచ్చింది. భయమేసింది. పని మానేసి ఇంటికి వెళ్లిపోయాను’ భయపడుతూనే చెప్పింది ఆమె. ‘సార్‌.. ఇ ఇద్దరు ఎవరో.. ఎలా పట్టుకోవడం?’ అన్నారు సిబ్బంది. ఎస్సై క్షణం సేపు ఆగి.. ‘సూర్యాపేట. ఇదే క్లూగా ఈ కేసు చేధించాలి’ దృఢంగా అన్నాడు ఎస్సై. ‘ఎస్‌ సర్‌!’ అన్నారు సిబ్బంది.హత్య జరిగింది లేట్‌నైట్‌. తెలిసిన వివరాల ప్రకారం ఆ వ్యక్తులిద్దరి వద్దా సొంత వాహనం లేదు. వాళ్లు సూర్యాపేటకు ఏదో పద్ధతిలో వెళ్లి ఉంటారు. హత్య చేసిన వాళ్లు ఇక్కడే ఉండరు..’ అంటూ బయల్దేరాడు ఎస్సై. అతనితో పాటూ అతని సిబ్బందీ కదిలారు.  

బస్‌స్టేషన్‌కు వెళ్లారు పోలీసులు.సూర్యాపేటకు వెళ్లే దారిలో ఏయే గ్రామాలు ఉన్నాయి చివరి బస్సు ఎన్ని గంటలకు వెళ్లింది? అనే దిశగా ఎంక్వైరీ మొదలుపెట్టారు. చివరి బస్సు వెళ్లిన టైమ్‌ వివరాలు డిపోలో తీసుకున్నారు. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్‌ని విచారించారు.కండక్టర్‌ వివరాలు చెబుతూ ‘సార్, నిన్న రాత్రి చివరి బస్సుకు పది మందికి మించి జనం లేరు. మీరు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఇద్దరు మగవాళ్లు సూర్యాపేటలో దిగారు. అయితే, వారితో పాటు ఒక ఆడమనిషి కూడా ఉంది. సూర్యాపేటలో దిగేవారికి టికెట్‌ ఆమే తీసుకుంది. రెండు టికెట్లు వాళ్లకిచ్చేసి ఆమె మద్దిరాల స్టేజ్‌మీద దిగిపోయింది’ చెప్పాడు అతను.మహబూబాబాద్‌ నుంచి సూర్యాపేటకు వెళ్లేదారిలో మద్దిరాల అనే గ్రామ స్టేజ్‌ ఉంది. ఆ ఊరు చేరుకోవాలంటే హైవే నుంచి రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లాలి. అంత చీకట్లో ఆ ఊరికి వెళ్లిన ఆడమనిషి ఎవరు? సూర్యాపేటకు వెళ్లినవారికి ఆమె టికెట్‌ ఎందుకు తీసుకుంది?! ఎంక్వైరీ వేగవంతమైంది. 
 

పోలీసులు మద్దిరాల బయల్దేరారు. ఆ ఊరి వాళ్లను కలిసి, చనిపోయిన వ్యక్తి ఫొటోలు చూపించారు. ‘సార్‌.. ఇతనిది ఇక్కడికి దగ్గరలోనే ఉండే దంతాలపల్లి ఊరు. పేరు మల్లయ్య’ చెప్పారు ఒకరిద్దరు గ్రామస్తులు.‘ఇతని గురించి వివరాలు ఇంకేమైనా తెలుసా!’‘ఇతను చేసే పనులైతే ఏమీ లేవు. భార్య ద్వారా వచ్చిన ఆస్తిని అమ్ముకుని  బలాదూర్‌ తిరుగుతుంటాడు. జల్సాలు ఎక్కువ. డబ్బుల కోసం ఒకరిద్దరితో గొడవలు కూడా ఉన్నాయి’ చెప్పాడు ఆ ఊరి పెద్ద. ‘రెండు నెల్ల కిందట ఈ ఊళ్లోనే ఉండే శేషమ్మ(పేరు మార్చాం)తో పెద్ద గొడవ అయ్యింది సార్‌. శేషమ్మ తన బావమరిది యాదగిరిని పెళ్లి చేసుకుందని ఆమెతో గొడవపడ్డాడు’ చెప్పాడు ఆ ఊళ్లో ఉండే ఇంకో అతను. పోలీసుల వరకు రాని ఆ తగాదా గురించి తెలుసుకోవడానికి శేషమ్మ ఇంటి తలుపు తట్టారు పోలీసులు.అయితే,  ఇంట్లో శేషమ్మ లేదు. తాళం వేసి ఉంది. గ్రామస్తులు చెప్పిన వివరాలతో దంతాలపల్లి వెళ్లారు పోలీసులు. ఆ ఊళ్లో యాదగిరి ఇంటి తలుపు తట్టారు.  ‘ఎవరూ..’ అంటూ శేషమ్మ తలుపు తీసింది. పోలీసులను చూసిన శేషమ్మ షాక్‌ అయ్యింది.ఆమె షాక్‌ నుంచి తేరుకునేలోపే శేషమ్మ చేతులకు బేడీలు వేశారు పోలీసులు. విచారణ మొదలయ్యింది. ఒక్కో విషయం వెలుగులోకి వచ్చింది.. పోలీసులు శేషమ్మ చెప్పింది వింటూ వున్నారు. 

మద్దిరాలకు చెందిన శేషమ్మ భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకో కూతురు ఉంది. ఒంటరిగా ఉంటున్న శేషమ్మకు దంతాలపల్లికి చెందిన యాదగిరితో పరిచయం ఏర్పడింది. మల్లయ్య బావమరిదే యాదగిరి. శేషమ్మ, యాదగిరి ఇటీవల గుళ్లో పెళ్లి చేసుకున్నారు. ఆ సమయానికి మల్లయ్య ఊళ్లో లేడు. ఊరికి వచ్చి, విషయం తెలిసిన మల్లయ్య కోపంతో ఊగిపోయాడు. అమాయకుడైన తన బావమరిదిని శేషమ్మ వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నదని, అతని ఆస్తి కొట్టేయడానికే ఈ పన్నాగం పన్నిందని గొడవకు దిగాడు. శేషమ్మకు, మల్లయ్యకు మాటా మాటా పెరిగింది. యాదగిరి వారిస్తున్నా వినకుండా శేషమ్మను జుట్టు పట్టుకొని నడివీధిలోకి ఈడ్చుకొచ్చాడు మల్లయ్య. ఊరి జనం ముందు శేషమ్మను  అరుస్తూ కొట్టాడు. ‘యాదగిరిని వదిలేయకపోతే నిన్నూ, నీ కూతురుని ఇద్దరినీ చంపేస్తా’ హెచ్చరించాడు మల్లయ్య. అవమానంతో బిక్కచచ్చిపోయింది శేషమ్మ. బయటకు ఎక్కడికెళ్లినా దారి కాచి మరీ వార్నింగ్‌లు ఇచ్చేవాడు. బిడ్డను ఒంటరిగా బయటకు పంపించాలన్నా భయంతో వణికిపోయేది శేషమ్మ. ‘మల్లయ్య అసలే మూర్ఖుడు. నన్నూ, నా బిడ్డను చంపడానికి వెనకాడడు. రోజూ ఎప్పుడు ఛస్తానో అని భయపడేకన్నా ముందు నేనే అతన్ని చంపేస్తే..’ అనే ఆలోచనకు వచ్చింది. మల్లయ్యతో పాత కక్షలు ఉన్నవారు ఆ ఊళ్లో నలుగురు ఉన్నారు. అవన్నీ భూ తగాదాలే! వెళ్లి వారిని కలిసింది శేషమ్మ. మల్లయ్య ఎక్కడెక్కడ ఒంటరిగా చిక్కుతాడో వివరాలు సేకరించింది. మల్లయ్యతో శత్రుత్వం ఉన్న ఆ నలుగురు మరో ఇద్దరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. మొత్తం ఏడుగురు మల్లయ్య హత్యకుపథకం వేశారు. మొహబూబాబాద్‌లో పని ఉందని మల్లయ్య వెళ్లిన సంగతి శేషమ్మ తెలుసుకొని, మిగతావారికి సమాచారం అందించింది. తనూ టౌన్‌కి బయల్దేరింది.సాయంత్రం దాకా స్నేహితులతో తిరిగిన మల్లయ్య బెల్ట్‌ షాప్‌ వద్దకు మాత్రం ఒక్కడే వెళ్లాడు. మందు తీసుకొని, అక్కడ కూర్చొని మద్యం సేవించాడు. అతన్ని అనుసరిస్తున్న ‘ఇద్దరు’ వ్యక్తులు మందు తీసుకొని, పర్మిట్‌రూమ్‌లో చేరి, తింటూ మల్లయ్యను గమనిస్తూ ఉన్నారు. ‘పని’ పూర్తి కాగానే ముందే అనుకున్న విధంగా బస్‌స్టాప్‌కు చేరుకున్నారు ఇద్దరు. అక్కడే శేషమ్మతో పాటు మరో నలుగురు కలిశారు. ఏడుగురూ కలిసి రాత్రి చివరి బస్సుకు బయల్దేరారు. ఆ రాత్రి మద్దిరాలలో శేషమ్మ దిగింది. ఆ తర్వాత దంతాలపల్లిలో నలుగురు దిగారు. ఇద్దరు సూర్యాపేటలో దిగారు. నేరం ఏదైనా కావచ్చు. తప్పించుకోవడం సాధ్యం కాదు. జీవితంలో ఎవరైనా ఇబ్బంది పెడితే రక్షించడానికి చట్టం ఉంది. ఆ సంగతి మరిచి సొంత నిర్ణయాలు తీసుకుంటే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. 
– నిర్మలారెడ్డి 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top