పెట్టా... పుంజూ... మా లాంటి ఫ్యామిలీయే! | Families would like ... punju ...! | Sakshi
Sakshi News home page

పెట్టా... పుంజూ... మా లాంటి ఫ్యామిలీయే!

Jun 18 2014 12:10 AM | Updated on Sep 2 2017 8:57 AM

పెట్టా... పుంజూ... మా లాంటి ఫ్యామిలీయే!

పెట్టా... పుంజూ... మా లాంటి ఫ్యామిలీయే!

ఇప్పుడే మా శ్రీవారితో గొడవేసుకొని వచ్చి ఇంటి పెరట్లో నించున్నాను. పొదుపు చేసి ఉంచిన కొద్దిపాటి డబ్బుతో డైనింగ్ టేబుల్ కొందామని నేనన్నాను.

ఉత్త(మ)పురుష
 

ఇప్పుడే మా శ్రీవారితో గొడవేసుకొని వచ్చి ఇంటి పెరట్లో నించున్నాను. పొదుపు చేసి ఉంచిన కొద్దిపాటి డబ్బుతో డైనింగ్ టేబుల్ కొందామని నేనన్నాను. కర్వ్ ఎల్‌ఈడీ అని ఏదో కొత్తగా వచ్చిందట. తిన్నగా ఉండక ఒంపు తిరిగి ఉంటుందట. అచ్చం ఆయన ఆలోచనల్లాగే. ‘ఎలాగూ ఇంట్లో ఏదో టీవీ ఉండనే ఉంది కదా’ అని నేనంటే... ‘మోడ్రన్ టెక్నాలజీని అందిపుచ్చుకునే తెలివితేటలు లేవు. ఎప్పుడూ పాత ఆలోచనలే’ అంటూ వెక్కిరించడంతో  మనసు పాడైంది.

 దాంతో కాసేపు పెరట్లో ఉన్న జీవజాలాన్ని చూస్తూ నిల్చుంటేనైనా ప్రశాంతత ఏర్పడుతుందని అనిపించింది. పెరట్లో మా కోడిపెట్ట చుట్టూ కొన్ని బుజ్జి బుజ్జి కోడిపిల్లలు కీచుకీచుమంటూ తిరుగుతున్నాయి. మా పెట్ట ఏదో  బెదురుగా చూస్తున్నట్లు ఉంటుంది. కళ్లన్నీ పిల్లలపైనే పెట్టుకుని ఉంటుంది. వెళ్తూ వెళ్తూ... ఎక్కడో కెక్కరించి కాస్త తవ్వగానే... పిల్లలన్నీ అక్కడికి చేరి తమ చిన్నారి ముక్కుల్తో పొడుస్తూ పొడుస్తూ ఉంటాయి. తిండి వెతకాలంటే కాళ్లతో ఇలా కెక్కరించాల్రా పిచ్చినాన్నల్లారా అంటున్నట్లుగా పెట్ట తిరుగుతూ ఉంటుందా... పుంజు ఇదేమీ పట్టనట్టు ధీమాగా ఉంటుంది. అదెప్పుడూ పిల్లలనేసుకుని తిరగ్గా నేను చూళ్లేదు. పైగా ఒక కాలూ, ఒక రెక్కా బారజాపి ఒళ్లు విరుచుకోవడం... ఏ పెంటకుప్పనో, ఏ గొడ్ల కొట్టం మీదికో ఎక్కి ఓ కూత కూసేసి... ఇక ఆ రోజుకు తన పనైపోయింది అన్నట్టుగా వ్యవహరించడం పుంజు నైజంలా అనిపించింది.

 దేవుడా... పెరట్లోకి తీసుకొచ్చావు. ఇక్కడా నా ఇంటి దృశ్యాన్నే మళ్లీ పుంజూ-పెట్టల రూపంలో చూపించాలా? మా అత్తగారికీ, మామగారికీ కాళ్లు అంతగా ఒంగవు. వయసైపోతోంది కదా... నేల మీద కూర్చుని తినాలంటే గతంలోలా కుదరడం లేదు. ఎంతో కష్టం మీద కూర్చుని... ఆపైన తినడం పూర్తయ్యాక లేవాలంటే మరెంతగానో కష్టపడుతున్నారు. ఇక మా పిల్లలిద్దరికీ డైనింగ్ టేబుల్ మీద కూర్చోని తినడం సరదా. అందుకే ఉన్న ఆ కాసిన్ని డబ్బుల్నీ డైనింగ్ టేబుల్ అనే లేని ఐటమ్ కోసం వెచ్చిస్తే అందరూ సుఖంగా ఉంటారూ... తింటారు. కానీ కొత్త టీవీ తెచ్చినా పాత దృశ్యమే కదా. అయినా మా ఆయన పిచ్చిగానీ టీవీ మారగానే ప్రోగ్రాములు మారతాయా? చెబితే వినరు కదా.

 పెరట్లోని పుంజుకూ మా ఆయనకూ అట్టే తేడా లేదు. నోటికి ఏదొస్తే అది కూయడమే. పైగా ఆ కూత జాతినంతా ఉత్తేజపరిచే చైతన్య నినాదమని పోజొకటి. పుంజు కూడా బహుశా... ‘పనీ పాటా లేకుండా పెట్ట ఎప్పుడూ కాళ్లతో కెక్కరించి కిందనున్న మట్టిని కెలుకుతూ ఉంటుంది. అదలా మట్టిని కెలకగానే కోడిపిల్లలన్నీ అలాగే చేస్తాయి. నోటితో అవీ ఇవీ పడతాయి. అంతే... పాపం పెట్టదెప్పుడూ డైనింగ్‌టేబుల్ బుద్ధే. ఈ పెట్టలంతా ఇంతే!’అనుకుంటూ పెంటకుప్పనెక్కి కూస్తుంటుందేమో పెట్టను వెక్కిరిస్తూ.
 అందుకే మా శ్రీవారిని ఏమీ అనలేక పుంజును తిట్టుకుంటూ ఓ మాట అనుకున్నా... పెట్ట అంటే పెంపకాలకు... పుంజు అంటే మా ఆయన లాగే చేతలకు ఏ మాత్రం కాదు... అడ్డదిడ్డమైన ఆ పెంటకుప్పలెక్కి గొప్పల కోతలకూ... కారుకూతలకే అని.     - వై!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement