కరువు తీర్చే పంట!

Desert Corp For Animal Feeding - Sakshi

దీర్ఘకాలపు పశుగ్రాసపు పంట ‘ముళ్లు లేని బ్రహ్మజెముడు’

తీవ్ర కరువు, అధిక ఎండలను సైతం తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది

ఎకరానికి 700 కాండపు ముక్కలు నాటుకుంటే చాలు.. 50 ఏళ్లపాటు దిగుబడినిస్తుంది

హెక్టారుకు ఏటా 20 టన్నుల పశుగ్రాసం లభ్యం

బ్రహ్మజెముడు కాండపు ముక్కలను కూరగాయగా,  సలాడ్‌గానూ తినొచ్చు.. పండ్లను తినొచ్చు

తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతల మధ్య సాధారణ పంటల సాగుకు పనికిరాని (ఎడారి) భూముల్లో సైతం బతికి ఉండటమే కాకుండా అధిక దిగుబడిని ఇచ్చే పంట ఏమైనా ఉందా?అవును. అలాంటిదే ‘బ్రహ్మజెముడు’!

బ్రహ్మజెముడు మనకు కొత్తదేమీ కాదు. దీని కాండమే ఆకులా ఉంటుంది. సాధారణంగా మనకు తెలిసిన బ్రహ్మజెముడుకు ముళ్లుంటాయి. అయితే, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ‘ముళ్లు లేని బ్రహ్మజెముడు’ పంట గురించి.  వాతావరణ మార్పు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ ప్రతికూల వాతావరణ పరిస్థితులను సునాయాసంగా ఎదుర్కొనగల బ్రహ్మజెముడుకు ప్రపంచవ్యాప్తంగా ఏటేటా గిరాకీ పెరుగుతోంది. గడ్డుకాలంలో సవాలుగా మారే పశుపోషణలో రైతులకు తోడ్పడుతుంది. అంతేకాదు.. గాలి, వానలకు భూమి పైపొర కోతకు గురవకుండా కూడా బ్రహ్మజెముడు తోడ్పడుతుంది. దీని కాండపు ముక్కను ఒకసారి నాటుకుంటే చాలు.. 50 ఏళ్ల పాటు దిగుబడినిస్తుంది. అందుకే ఇది ‘కరువు తీర్చే పంట’. ఏడాది పొడవునా పశుగ్రాసాన్ని అందించే దీర్ఘకాలపు పశుగ్రాసపు పంటగా శాస్త్రవేత్తలు దీన్ని మన రైతులకు పరిచయం చేస్తున్నారు.

ముళ్లులేని బ్రహ్మజెముడు పంటకు పశువులకు, మనుషులకు గడ్డు పరిస్థితుల్లోనూ ఉపయోగపడే ఆహార పంటగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదపడే ఎడారి పంటగా కూడా గుర్తింపు ఉంది. ఇది కాక్టస్‌ (Cactus - Opuntia ficus indica) జాతికి చెందిన మొక్క. మెక్సికో దీని పుట్టిల్లు. నీటిని/వర్షాన్ని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకోవడంలో దీనికి ఇదే సాటి. ప్రపంచవ్యాప్తంగా మెట్ట, తరచూ కరువు బారిన పడే ప్రాంతాలు, ఎడారి ప్రాంతాల్లో సాగుకు ఇది చాలా అనువైన పంట. దీన్ని బ్రెజిల్, మెక్సికో, సౌదీ అరేబియా, ఇటలీ, అమెరికా, ఆఫ్రికా దేశాలలో మొత్తం 24 దేశాల్లో సాగు చేస్తున్నారు. కాండపు ముక్కలను కూరగాయగా, పానీయాలకు ముడి పదార్థంగా, ఔషధంగా 50 రకాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు.

1970 దశకంలో ఈ పంట మన దేశానికి పరిచయమైనా పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు. జోద్‌పూర్‌(రాజస్థాన్‌) లోని కేంద్రీయ మెట్ట ప్రాంత పరిశోధనా సంస్థ, ఝాన్సీ(ఉ.ప్ర.)లోని భారతీయ పశుగ్రాస పరిశోధనా సంస్థ, కేంద్రీయ అగ్రో ఫారెస్ట్రీ పరిశోధనా సంస్థ, కర్నల్‌(హర్యానా)లోని కేంద్రీయ చౌడు భూముల పరిశోధనా సంస్థ, బికనెర్‌(రాజస్థాన్‌)లోని కేంద్రీయ వర్షాధార ఉద్యాన పరిశోధనా సంస్థ, ఫల్తన్‌(మహారాష్ట్ర)లోని నింబికర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(నారి), పుణే జిల్లా ఉరులికాంచన్‌లోని బి.ఎ.ఐ.ఎఫ్‌. డెవలప్‌మెంట్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ తదితర మెట్ట/ఎడారి ప్రాంత వ్యవసాయ పరిశోధనా స్థానాల్లో కొన్ని ఏళ్లుగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. జో«ద్‌పూర్‌లో చేపట్టిన పరిశోధనల్లో పశువుల మేతగా బ్రహ్మజెముడు సమర్థవంతంగా పనికివస్తుందని రుజువైంది. అనంతపురం జిల్లా రేకులకుంటలో ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా ముళ్లు లేని బ్రహ్మజెముడును ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. బ్రహ్మజెముడు అనగానే ముట్టుకుంటే గుచ్చుకునే ముళ్లు్ల గుర్తుకొస్తాయి. కానీ.. ఈ బ్రహ్మజెముడుకు ముళ్లు ఉన్నట్లు కనిపించినా అవి మెత్తగా ఉంటాయి. ముళ్లులేని బ్రహ్మజెముడు కాండపు ముక్కలు పశువుల మేతగా బాగా పనికివస్తాయని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్‌ ఆర్‌.వీరరాఘవయ్య(99896 25222), శాస్త్రవేత్తలు డాక్టర్‌ జి.నారాయణస్వామి(62812 84235), డాక్టర్‌ కె.అరుణ్‌కుమార్‌(83092 30136) అంటున్నారు. 

అతి తక్కువ వర్షపాతం చాలు
వార్షిక వర్షపాతం అత్యల్పంగా(150 నుంచి 200 మి.మీ) నమోదయ్యే ప్రాంతాల్లో కూడా ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగు చేసుకోవచ్చు. బంజరు భూములు, అటవీ ప్రాంతాల్లోనూ దీని కాండం (ఆకు) ముక్కలను నర్సరీలో పెంచి నాటుకోవచ్చు. మొక్క సులువుగా బతుకుతుంది. ఎలాంటి తెగుళ్లు, చీడపీడలు ఆశించవు. పశువులకు రోజువారీ ఇచ్చే పప్పుజాతి/ధాన్యపు జాతి మేతలో దీన్ని 33 శాతం మేరకు కలిపి ఇవ్వవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ముళ్లు లేని ఆకులను రెండు, మూడు భాగాలుగా కత్తిరించి నాటుకోవచ్చు. పశువులకు మేతగా ఇచ్చే సమయంలో మట్టి అంటకుండా చూసుకోవాలి. ఈ పంట వల్ల భూసారం పెరుగుతుందని నిరూపణ అయింది. బంజరు భూములు, అటవీ భూములలో నాటుకోవచ్చు. తోటలు, పొలాల చుట్టూ రక్షణ పంట(జీవకంచె)గా వేసుకొని పశువుల మేతకు వినియోగించుకోవచ్చు. కాయలు లేదా పండ్లను కూడా పశువులు, గొర్రెలు తింటాయి. ఏ వయసు పశువులకైనా మేపవచ్చు.  

ఎకరానికి 667 మొక్కలు నాటాలి
జోద్‌పూర్‌ నుంచి తెచ్చిన బ్రహ్మజెముడు ముక్కలను రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో సాగు చేస్తున్నారు. ఎకరానికి 667 మొక్కలు నాటుకోవాలి. 15–20 రోజుల వ్యవధిలో 10–15 సెం.మీ. పొడవు, 30 గ్రాముల బరువు ఉండే బ్రహ్మజెముడు కాండపు ముక్కల(క్లాడోడ్స్‌) దిగుబడి పొందవచ్చు.  అనంతపురం వంటి తీవ్ర కరువు ప్రాంతాల్లో అయితే.. వరుసల మధ్య 2–3 మీటర్లు, మొక్కల మధ్య 1.5–2 మీటర్ల దూరం ఉండాలి. వర్షపాతం, భూసారం మెరుగ్గా ఉండే ప్రాంతాల్లో అయితే.. వరుసల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 2–2.5 మీటర్ల దూరం పాటించాలి. హెక్టారు భూమిలో సంవత్సరానికి 20 టన్నుల వరకు గ్రాసాన్ని పొందవచ్చు.  50–55 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రతలను సైతం తట్టుకుంటుంది. మట్టి పాళ్లు తక్కువగా ఉండే రాళ్ల/ఇసుక భూములు, కొండ వాలు, బంజరు భూముల్లో  పెంచుకోవచ్చు.   భూతాపం పెరుగుతున్న నేపథ్యంలో ముళ్లు లేని బ్రహ్మజెముడు కరువు కాలపు పంటగా గుర్తెరగడం అవసరం.– గంగుల రామలింగారెడ్డి,సాక్షి, అగ్రికల్చర్, అనంతపురం

రాత్రి పూటేకిరణజన్య సంయోగ క్రియ!
ముళ్లులేని బ్రహ్మజెముడు తీవ్ర ప్రతికూల వాతావరణంలోనూ అతి తక్కువ నీటితోనే మనుగడ సాగిస్తుంది. అదెలా? సాధారణ పంటలు(సి3 రకం), నీటిని తక్కువగా వాడే చిరుధాన్య పంటలు(సి4 రకం) పగటి పూటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. వీటి పత్ర రంధ్రాలు పగటి పూటే తెరుచుకొని నీటి ఆవిరిని వాతావరణంలోకి విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి నీటి అవసరం ఎక్కువ. బ్రహ్మజెముడు మొక్కలు పగలు గమ్మునుండి రాత్రి పూటే ఈ పనిచేస్తాయి. అందువల్ల సి3, సి4 పంటలకన్నా 3–5 రెట్లు తక్కువ నీటినే బతుకుతుందని ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌.ఎ.ఓ.) నిపుణుడు హరిందర్‌ పి.ఎస్‌. మక్కర్‌ అంటున్నారు. కిలో బ్రహ్మజెముడు కాండపు ముక్కల ఉత్పత్తికి 250 లీటర్ల నీరు చాలు. అతి చలిని, అతి వేడిని తట్టుకుంటుంది. సారవంతమైన భూమిలో నీటిపారుదల ఉంటే అత్యధిక దిగుబడినిస్తుంది. నిస్సారమైన భూముల్లో తక్కువ నీటితో కూడా పెరిగి మోస్తరు దిగుబడినిస్తుంది. నీరు నిలిచే, చౌడు భూములు పనికిరావు.

పాల దిగుబడిని పెంచే మేత
ముళ్లులేని బ్రహ్మజెముడును పశువుల మేతగా ఏ మేరకు పనికివస్తుందనే దానిపై డీఆర్‌డీఏ–వెలుగు(సెర్ప్‌) ఆధ్వర్యంలో కొందరు రైతుల చేత ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లాలో సాగు చేయిస్తున్నారు. గుత్తి, నల్లమాడ, ముదిగుబ్బ, తనకల్లు, శింగనమల, ఉరవకొండ మండలాల పరిధిలో స్వల్ప విస్తీర్ణంలో గత జనవరి నుంచి సాగు చేస్తున్నారు.
పూణె సమీపంలోని ఊర్లికాంచంలోని బి.ఎ.ఐ.ఎఫ్‌. బయో రీసెర్చ్‌ స్టేషన్‌ నుంచి 7 వేల కణుపులు తెచ్చి ఎకరాకు 700 కణుపులు నాటించామని అనంతపురం ప్రాంతీయ పశు శిక్షణా కేంద్రం నిపుణులు డాక్టర్‌ శ్రీకాంత్‌(94411 84152) తెలిపారు.
రెండు అడుగుల గుంత తీయించి మొక్కల మధ్య రెండున్నర మీటర్లు, వరుసల మధ్య 3 మీటర్ల ఎడంలో నాటించాం. శిలీంధ్ర సమస్య తలెత్తకుండా 2 గ్రాములు మాంకోజెబ్‌ పురుగుమందులో కణుపులు ముంచి నాటించామన్నారు. నాటిన తర్వాత 10–12 నెలల నుంచి ఆకులు (కాండపు ముక్కలు) చిన్న ముక్కలుగా కోసి పశువులకు మేపుకోవచ్చు.
వర్షాకాలంలో నాటుకుంటే మేలు. ఒక మొక్కకు వారం లేదా పది రోజులకోసారి ఒక లీటర్‌ నీళ్లు చాలు. నాటిన మొదట్లో 10 నుంచి 15 రోజులకో తడి ఇస్తే సరిపోతుంది. సంవత్సరానికి ఎంతలేదన్నా ఎకరాకు 10 టన్నుల మేత అందుబాటులోకి వస్తుంది.
తక్కువ మేతలోనే ఎక్కువ శక్తినిచ్చే పోషకాలు ఉంటాయి.  ఎముక బలం, పాల దిగుబడి పెరుగుతాయి.
ఒక మొక్కకు సంవత్సరానికి 25 నుంచి 37 కణుపులు వస్తాయి. ఒక్కో మొక్క నుంచి ఎంతలేదన్నా సంవత్సరానికి 15 కిలోల వరకు మేత పొందవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top