కదలే చైతన్యం రైతు పెద్దమ్మ!

consciousness is the farmer's mother! - Sakshi

బలమైన సంకల్పం ఉంటే రైతు కుటుంబంలోని సాధారణ గృహిణి కూడా ఇతరులకూ వెలుగుబాట చూపగలిగేంత ఎత్తుకు ఎదుగుతుందనడానికి రాజ్‌కుమార్‌ దేవి జీవితమే నిలువుటద్దం. బీహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలోని కుగ్రామం ఆనంద్‌పుర్‌ వాస్తవ్యురాలు. వ్యవసాయం గురించి ఏ కాలేజీలోనూ ఆమె చదువుకోలేదు. తన అత్తింటి వారికి ఉన్న ఎకరం పొలంలో 1980లలో ఒక రోజు స్వయంగా పారను చేతబట్టి స్వేదాన్ని చిందించే క్రమంలోనే ఆ నేల స్వభావాన్ని, ఏయే పంటలు సాగు చేస్తే బతుకులు బాగుపడతాయో అధ్యయనం చేసింది.

ఆమె 30 ఏళ్ల క్రితం పొలంలో కాలు మోపే నాటికి వరి, గోధుమ, నాటు పొగాకు తప్ప వేరే పంటలు అక్కడి వారికి తెలియవు. పండించిన నాటు పొగాకును ఊరూరా తిరిగి అమ్మడానికి భర్త బయలుదేరడంతో ఆమె వ్యవసాయంపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. పొగాకు ఒక్కటే పండించడం ఎందుకు? కూరగాయలు, పండ్లు తదితర అనేక పంటలు కలిపి ఎందుకు పండించకూడదని ప్రశ్నించుకుంది. తమ ఎకరం పొలాన్ని మడులుగా విభజించి.. ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల మొక్కలు.. వేర్వేరు పంటలు సాగు చేయడం ప్రారంభించింది.

కొన్నాళ్లు గడిచే సరికి రాజ్‌కుమార్‌ దేవి ఒకటికి నాలుగు పంటలు పండించడంలో ప్రయోజనాలను ఆ ఊళ్లో మహిళా రైతులంతా గమనించారు. ఆమెను అనుసరించారు. వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించి పట్టణాలకు పంపడంపై ఆమె దృష్టి పెట్టింది. ఇందుకోసం పదేసి మంది మహిళలతో స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వారు తయారు చేసిన ఉత్పత్తులను సేకరించి పట్టణాలకు తరలించి విక్రయించేందుకు తానే ఒక సంస్థను ప్రారంభించింది.

ఇంటిపట్టున ఉండి నెలకు రూ. 3 వేల వరకు మహిళలు సంపాయించుకునే దారి చూపింది. తమ గ్రామంతోపాటు ఇరుగుపొరుగు గ్రామాలకు కూడా సైకిల్‌పైనే వెళ్లి మహిళా రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రాజ్‌కుమార్‌ దేవిని ‘రైతు పెద్దమ్మ’ అని ఆప్యాయంగా పిలుస్తున్నారు. బహుళ పంటల సాగుతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విక్రయించడం ద్వారా గ్రామీణ మహిళల జీవితాలలో మార్పు తేవచ్చని లోకానికి చాటిచెబుతున్న ఈ ‘రైతు పెద్దమ్మ’కు ఎవరైనా జేజేలు పలకవలసిందే!

నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top