విద్యావ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి

Chukka Ramaiah Article On Inter Board Issue - Sakshi

అభిప్రాయం

వ్యవస్థని సజీవంగా ఉంచడంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి ఆరోగ్యం, రెండు విద్య. ఈ రెండింటినీ సేవాదృక్పథంతో చూశారు కనుకనే వైద్యుడినీ, గురువునీ గౌరవించని వారుండరు. కానీ కొర్పొరేట్‌ వ్యవస్థ ఈ రెంటినీ మార్కెట్‌గా మార్చేసింది. పిల్లలకీ కొన్ని ఆశలుంటాయి. వారేం చదవాలో పూర్తిగా వారికి అర్థం కాకపోయినా వారికి ఇష్టం లేనిదేంటో వారికి తెలుస్తుంది. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. అమెరికా అవసరాలకూ, సిలికాన్‌ వ్యాలీ కలలకూఅనుగుణంగా మాత్రమే భారత విద్యావిధానం రూపుదిద్దుకుంది. ఓటమి సైతం జీవితంలో భాగమేనని పిల్లలకు నేర్పించాలి. పిల్లల మానసిక, శారీరక, కుటుంబ సమస్యలతో సహా ఉపాధ్యాయుడికి అర్థం కావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల ఎదుట ఏదీ దాచకుండా అన్నింటినీ మనసువిప్పి చెప్పే సంస్కృతిని అలవాటు చేయాలి. సగం సమస్యలు దీంతో తీరిపోతాయి. విద్యారంగాన్ని 1 నుంచి 12 వరకు ప్రక్షాళన చేయాల్సిన తక్షణావసరం ఉంది.

ముక్కుపచ్చలారని పసిబిడ్డలు. అల్లారు ముద్దుగా పెరిగిన వారు. తల్లిదండ్రులను వీడి ఒక్క క్షణమైన ఉండలేని వాళ్ళు అక్షర నిబద్ధులై కఠోరశ్రమకోర్చి, రేయింబవళ్ళు నిద్రాహా రాలు మాని తపోనిశ్చయంతో చదివి పరీక్షలు రాశారు. తాము పడిన కష్టానికీ, తామూహించిన ఫలితాలకూ సంబంధం లేదు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 26 మంది బలవంతంగా ప్రాణాలు విడిచారు. మార్కుల గారడితో పసిమనసులను ఎప్పుడో ఛిద్రం చేసిందీ కార్పొరేట్‌ విద్యావిధానం. విద్యార్థుల్లో మనోనిబ్బరాన్ని నింపే నికార్సైన విద్యావ్యవస్థ కరువయ్యింది. నిజానికి ఇంటర్‌మీడియట్‌ ఫలితాల్లో గోల్‌మాల్‌ కేవలం ఒక పరీక్షకు సంబంధించిన నిర్లక్ష్యం కారణంగానే కాదు. యావత్‌ విద్యావ్యవస్థలోని లోపాలే ఈ విపరీతానికి దారితీశాయి.  ఈ గందరగోళం కేవలం ఇంటర్‌ ఫలితాల వరకే ఉండకపోవచ్చు. నిరుద్యోగం మరింత తీవ్రమైన పరిణామాలకు కారణం కావచ్చు. కాబట్టి రాష్ట్ర ప్రభు త్వం మొత్తం విద్యావ్యవస్థనే పునర్‌వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రప్రభుత్వం పాఠశాల విద్య, ఇంటర్‌ విద్యను పునర్‌వ్యవస్థీకరించాలి.  

వ్యవస్థని సజీవంగా ఉంచడంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి ఆరోగ్యం, రెండు విద్య. ఈ రెండింటినీ సేవాదృక్పథంతో చూశారు కనుకనే వైద్యుడినీ, గురువునీ గౌరవించని వారుండరు. కానీ కొర్పొరేట్‌ వ్యవస్థ ఈ రెంటినీ మార్కెట్‌గా మార్చేసింది. దాని ఫలితంగా విద్యావ్యాపారం విద్యార్థులను పరిజ్ఞానంతోనో, తెలివితేటలతోనో కొలవడం కాకుండా మార్కులతో తూచడం మొదలయ్యింది. ఈ మార్కుల మాయాజాలం ఆరోగ్యకరమైన విద్యావ్యవస్థని దారి మళ్లించింది. కనీస పరిజ్ఞానం కూడా లేకుండా కోళ్ళ ఫారాల్లో కోళ్లను పెంచినట్టు పిల్లల్ని బాహ్యప్రపంచానికి దూరంగా భ్రమల్లో బతికేలా చేస్తున్నారు. అవే భ్రమల్లో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.  పిల్లలకీ కొన్ని ఆశలుంటాయి. వారేం చదవాలో పూర్తిగా వారికి అర్థం కాకపోయినా వారికి ఇష్టం లేనిదేంటో వారికి తెలుస్తుంది. వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలి. అలా కాకుండా వారికి ఇష్టం లేని, సంబంధంలేని విషయాల్లో వారిని బలవంతంగా తోసి వారిపై ఒత్తిడి తేవడం ఎంత మాత్రం సమంజసం కాదు. అయితే డాక్టరో, లేదా ఇంజనీరింగో అనే సంకుచితార్థంలో విద్య కుంచించుకుపోయింది.

ప్రపంచం అత్యంత విశాలమైనదని మన పిల్లలకు అర్థం చేయించడంలో మనం విఫలం అయ్యాం. దాన్ని సొమ్ము చేసుకోవడంలో విద్యావ్యాపార సంస్థలు సఫలీకృతం అయ్యాయి. అమెరికా అవసరాలకూ, సిలికాన్‌ వ్యాలీ కలలకూ అనుగుణంగా మాత్రమే భారత విద్యావిధానం రూపుదిద్దుకుంది. దాని ఫలితంగా మన దేశ అవసరాలకు తగినట్టుగా కాకుండా విదేశీ కంపెనీలకు ఊడిగం చేసేలా మార్చేశారు. అనారోగ్యకరమైన కృత్రిమ పోటీని సృష్టించి పిల్లల్లో ఓటమి అంటేనే భయపడే స్థితికి చేర్చారు.సమాజంలో అసమానతలు మారనంత కాలం, దళిత, అణగారిన వర్గాలను సమాజం చూసే దృష్టిలో మార్పు రానంత కాలం మార్కుల్లో అంతరాలు కొనసాగుతాయి. సమాజంలో ఆఖరిమెట్టున ఉన్న వాడికి కూడా అందరితో సమానమైన అవకాశాలు అందినప్పుడు వాడి ఆలోచనల్లోనో, పరిజ్ఞానంలోనూ, పోటీపడే తత్వంలోనూ మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఓటమి సైతం జీవితంలో భాగమేనని పిల్లలకు నేర్పించాలి. పిల్లల మానసిక, శారీరక, కుటుంబ సమస్యలతో సహా ఉపాధ్యాయుడికి అర్థం కావాలి. అందుకు తరగతి గదుల్లో మందలు మందలుగా విద్యార్థులను తోలడం కాకుండా, సరిపడా తరగతి గదులూ, అందుకు తగిన ఉపాధ్యాయులూ ఉండాలి. పిల్లల్లో మానసిక ఒత్తిడిని జయించే ఆటలు లేవు. సంగీతం లేదు. నృత్యం లేదు. కళల్లేవు. ఒట్టి కలవరం తప్ప. ఆట ఆడే వాడికే ఓటమి ఉంటుందని అర్థం అవుతుంది. క్రీడాస్ఫూర్తి అంటేనే ఆటలో గెలు పోటములు బొమ్మా బొరుసూలాంటివని నేర్పించడం. ఓటమిని అంగీకరించడం కూడా అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది.  

అన్నింటికన్నా ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రుల ఎదుట ఏదీ దాచకుండా అన్నింటినీ మనసువిప్పి చెప్పే సంస్కృతిని అలవాటు చేయాలి. సగం సమస్యలు దీంతో తీరిపోతాయి. విద్యారంగాన్ని 1 నుంచి 12 వరకు ప్రక్షాళన చేయాల్సిన తక్షణావసరం ఉంది. ఏ తరగతిలో రావాల్సిన నైపుణ్యాలు ఆ తరగతిలో రాకుండా పై తరగతులుకు ప్రమోట్‌చేయడం వల్ల తీవ్ర అయోమయం నెలకొంటుంది. పిల్లల్లో అవగాహనా శక్తి లేకపోతే చెప్పిందంతా వృథాయే. ఆశలకు తగిన ప్రమాణాలు లేక, ఆశించిన ఫలితాలు రాక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. జిల్లాల మధ్య, పాఠశాలల మధ్య పోటీతత్వం ప్రమాణాలను మరింత దిగజారుస్తుంది. తరగతులకు అనుగుణంగా ప్రమాణాలున్నాయో లేదో చూసుకోవాలి. వెనుకబడిన పిల్లలకు ఆ క్లాస్‌లోనే రిపీట్‌ చేయించడం, శాండ్‌విచ్‌ కోర్సులు ప్రవేశపెట్టడం వల్ల పై తరగతులకు అర్హతలను సంపాదించే అవకాశం ఉంటుంది.

రాష్ట్రంలో ప్రభుత్వం వివిధ రంగాల్లో జరిపిన అధ్యయనం అభినందించాల్సిందే. కానీ సమాజానికి ఇంధనంగా ఉన్న విద్య పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ముమ్మాటికీ సరికాదు. తక్షణమే కారణాలను అన్వేషించి శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించాలి.  విద్యావ్యవస్థ ఇలా బీటలు వారడానికి కారణమెవరన్న చర్చ అనవసరం. పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాత్రమే చెప్పగలను. సమస్యని వాయిదా వేయడం ఎప్పటికీ పరిష్కారం కాదు. ఏటా సుమారు పదిలక్షల మంది విద్యార్థులు పది పూర్తిచేసి ఇంటర్‌లోకి వస్తున్నారు. విద్యారంగంలోని ఉన్నతాధికారులు, ఉపా«ధ్యాయులు అంతా కలిసి పిల్లలకు ప్రమాణాలు కల్గిన విద్యను అందించగల్గితే మనం ఆశించిన సామాజిక పరివర్తన సాధ్యమవుతుంది. అలా చేస్తే మీరు చరిత్రలో నిలిచిపోతారు. ప్రమాణాలు గల విద్యను ఇవ్వాలంటే ఒప్పంద అధ్యాపకులతో కుదరని పని. శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగాలను భర్తీ చేసి విద్యార్థుల ప్రమాణాలపై దృష్టి సారించడం తక్షణావసరం.

చుక్కారామయ్య
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top