కుదుంబ బృందం

Built a shopping mall for women to become entrepreneurs - Sakshi

సెల్ఫ్‌హెల్ప్‌

కోళికోద్‌.. ఒకప్పటి కాలికట్‌. అరేబియా తీరం. వాస్కోడిగామా సముద్రమార్గాన ఇండియాకి చేరింది ఇక్కడే. కేరళలోని ఓ జిల్లా కేంద్రం ఇది. ఈ కోళికోద్‌ ఇప్పుడు మళ్లీ ఓ చరిత్రకు శ్రీకారం చుట్టింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఓ షాపింగ్‌ మాల్‌ను కట్టింది కోళికోద్‌ కార్పొరేషన్‌. కుదుంబశ్రీ బజార్‌ ప్రాజెక్ట్‌ పేరుతో అర ఎకరా స్థలంలో పెద్ద షాపింగ్‌ కాంప్లెక్స్‌ను కట్టింది. ఈ ఐదంతస్తుల భవనంలో ఉన్న అన్ని షాపులనూ మహిళలకే అద్దెకిస్తారన్నమాట. అంటే మహిళలు స్థాపించిన పరిశ్రమలు, వ్యాపారాలకే ఈ దుకాణాలు.   ఈ ప్రాజెక్టు ఇచ్చిన భరోసాతో కేరళ మహిళలు కుదుంబశ్రీ (కుటుంబశ్రీ) పేరుతో సంఘటితమయ్యారు. పదిమంది నుంచి పదిహేను మందితో చిన్న చిన్న బృందాలయ్యారు. తమకు ఆసక్తి ఉన్న పనుల్లో నైపుణ్యం సాధించి వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సూపర్‌మార్కెట్, ఫుడ్‌కోర్ట్, కిడ్స్‌ పార్క్, స్పా, బ్యూటీపార్లర్, ఉమెన్స్‌ బ్యాంక్, ఫ్యాన్సీ స్టోర్, టెక్స్‌టైల్స్, రెడీమేడ్స్, బొటిక్, ఫుట్‌వేర్, డ్రై క్లీనింగ్, కార్‌ వాషింగ్, ఆప్టికల్‌ స్టోర్, హ్యాండీ క్రాఫ్ట్స్, బేబీ కేర్, హోమ్‌ అప్లయెన్సెస్, బుక్‌స్టాల్స్‌.. ఇలా అన్నిట్లో అడుగుపెట్టారు. దాదాపుగా అన్నీ చిన్న తరహా వ్యాపారాలే.

తక్కువ పెట్టుబడితో ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటులో భాగం ఇది.
కుదుంబశ్రీ బృందాలు మన దగ్గర ఉన్న సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపుల వంటివి. వీరిలో కొంతమంది వ్యక్తిగతంగా, మరికొందరు బృందంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తమ వ్యాపారాలతోపాటు షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్వహణ బాధ్యత కూడా ఈ మహిళలే చూసుకుంటారు. ఈ మాల్‌ మొత్తం ఉమెన్‌ ఆంట్రప్రెన్యూర్‌ల కోసమే. కుదుంబశ్రీ సభ్యులకు దుకాణాల అద్దె పదిశాతం తగ్గుతుంది, ఈ బృందంలో సభ్యులు కాని మహిళలకు అద్దెలో రాయితీ ఉండదు. ఈ మాల్‌లో కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, ట్రైనింగ్‌ సెంటర్‌లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కేరళ మహిళలు అక్షరాస్యతలో మిగిలిన రాష్ట్రాలకంటే ముందున్నారు, ఉద్యోగాల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా ముందంజలో ఉండడానికి ప్రభుత్వం ఇస్తున్న సహకారమిది.
– మంజీర 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top