
న్యూయార్క్: చాలా మంది బరువు తగ్గాలనో, పనుల ఒత్తిడిలో పడి బ్రేక్‌ఫాస్ట్‌ను నిర్లక్ష్యం చేస్తారు. అల్పాహారం తీసుకోకుంటే అథెరోస్క్లెరోసిస్ అనే అనారోగ్య సమస్య ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దళసరిగా ఉన్న ధమనులు గుండె నుంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి. అయితే అల్పాహారం తీసుకోకపోవడం వల్ల ధమనుల పనితీరు మందగించడాన్ని గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. సరైన సమయానికి అల్పాహారం తీసుకోకపోయినా, తక్కువ పోషకాలున్న అల్పాహారం తీసుకున్నా ఈ సమస్య తప్పదని హెచ్చరిస్తున్నారు.
రాత్రి భోజనానికి, లంచ్‌కు మధ్య ఉండే గ్యాప్‌ను అల్పాహరంతో పూడ్చడం వల్ల అవసరమైన పోషకాలు శరీరానికి అందడమే కాకుండా ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండవచ్చని చెబుతున్నారు. అదే అల్పాహారాన్ని తీసుకోకుండా ఉంటే శరీర బరువు దెబ్బతినడమే కాకుండా రక్తపోటు, గ్లూకోజ్ స్థాయిలు పెరిగే అవకాశముందని మౌంట్ సినాయ్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో తేలింది. ఉదయం మంచి పోషకాలు కలిగిన అల్పాహారం తీసుకోవడం ద్వారా బీపీ, ఒబెసిటీ, ఇతర జీవక్రియలలో కలిగే సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ వాలంటైన్ ఫాస్టర్ తెలిపారు.