ఊపిరితిత్తిలాంటి గాడ్జెట్‌..  హైడ్రోజన్‌ ఇస్తుంది!

Blood cells Neural Stem cells - Sakshi

ఊపిరితిత్తుల్లోకి నీళ్లు పోతే ప్రమాదం.. కానీ స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఊపిరితిత్తుల్లాంటి పరికరంలోకి ప్రవేశిస్తే మాత్రం భలే ప్రయోజనం. ఏంటంటారా? నీళ్లన్నీ అత్యంత సమర్థమైన ఇంధనం హైడ్రోజన్‌గా మారిపోతుంది. కార్లు మొదలుకొని స్మార్ట్‌ఫోన్ల వరకూ అన్ని రకాల గాడ్జెట్లను నడుపుకునేందుకు ఈ ఇంధనాన్ని వాడుకోవచ్చునని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యీ కూయి. సైంటిఫిక్‌ జర్నల్‌ జౌల్‌ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ గాడ్జెట్‌కు మన ఊపిరితిత్తుల పనితీరుకూ చాలా సారూప్యం ఉంది. మన ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవేశించినప్పుడు అదొక పలుచటి త్వచం గుండా ప్రయాణిస్తుంది. ఈ త్వచం గాల్లోని ఆక్సిజన్‌ను వేరు చేసి రక్తంలోకి పంపుతుంది.

ఊపిరితిత్తుల ప్రత్యేక నిర్మాణం ఫలితంగా ఈ ప్రక్రియ మొత్తం చాలా సమర్థంగా జరిగిపోతూంటుంది. స్టాన్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్‌ పదార్థంతో అచ్చం ఊపిరితిత్తుల్లోని త్వచాన్ని పోలినదాన్ని తయారు చేశారు. బయటివైపు ఉన్న చిన్న రంధ్రాలు నీళ్లను తిప్పికొడితే లోపలిభాగంలో ఉండే బంగారు, ప్లాటినమ్‌ నానో రంధ్రాలు నీటిద్వారా ఏర్పడే గాలి బుడగల నుంచి హైడ్రోజన్‌ను వేరు చేయగలవు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్‌వంద డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతల వరకూ మాత్రమే పనిచేస్తోందని.. అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని యీ కూయి తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top