అదిగో కొండ... ఇదిగో లోయ

Bipolar disorder special - Sakshi

మైండ్‌ యువర్‌ హెల్త్‌

బైపోలార్‌ డిజార్డర్‌

వీళ్లు కెరటం అంత స్ట్రాంగ్‌ అనుకుంటాంగానీ అంతకంటే వీక్‌ అయిపోతుంటారు. ఉవ్వెత్తున లేస్తారు... ఠప్పున పడిపోతారు. ఇంతలోనే ఉత్సాహం... అంతలోనే ఉత్పాతం. రూపాయి నాణేన్ని టేబుల్‌ మీద తిప్పితే ఒకసారి బొమ్మ... ఒకసారి బొరుసు కనిపించినట్టే వీళ్లలో సంతోషం... విచారం కొంత వ్యవధిలో తిరుగాడుతూ ఉంటాయి. ఏ ఉద్వేగమూ కొంతకాలం స్థిరంగా ఉండకపోవడంతో చుట్టూ ఉన్నవాళ్లందరిలోనూ అపరిమితమైన ఒత్తిడి. వాళ్లకే కాదు చుట్టూ ఉన్న మనందరికీ కూడా! అందుకే అందరమూ‘బైపోలార్‌ డిజార్డర్‌’పై అవగాహన పెంచుకోవడం  కోసమే ఈ ప్రత్యేక కథనం. 

సినిమాల్లోనైనా  అందరూ ‘రోలర్‌ కోస్టర్‌’ను చూసే ఉంటారు కదా. దాని మీదికెక్కిన వారు అకస్మాత్తుగా పైపైకి వెళ్తుంటారు. అంతలోనే లోయలోకి దూకినట్టుగా కిందికి వేగంగా దిగిపోతుంటారు. ఒక చోట గిరా గిరా గిరా గిరికీలు కొడతారు. ‘బైపోలార్‌’ వ్యాధిలోనూ అంతే. మెదడులో మన మూడ్స్‌ కాస్తా రోలర్‌ కోస్టర్‌ ఎక్కి... అవి గబగబా మారిపోతే... మనిషి గింగిరాలు తిరుగుతాడు. అలా మూడ్స్‌ మాటిమాటికీ మారిపోతున్నప్పుడు ఆ మనిషి కాసేపు అపరిమితమైన సంతోషాలూ, అంతులేని ఉత్సాహాలూ కనబరుస్తూ... అవి కాస్తా తగ్గిపోయాక తీవ్రమైన నిరాశలో, నిస్పృహలో, అంతులేని కుంగుబాటులో మునిగిపోయే జబ్బే ఈ బైపోలార్‌ డిజార్డర్‌. ఇందులో చాలా ఉత్సాహంగా ఉండే దశను ‘మేనిక్‌’ ఫేజ్‌గా చెబుతారు. అలాగే తీవ్రంగా కుంగిపోయే దశను ‘డిప్రెసివ్‌ స్టేట్‌ లేదా ఎపిసోడ్‌’ అంటారు. 

రమేశ్‌ ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. ఒక ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నాడు. ‘‘ఐఏఎస్‌ సాధించడం పెద్ద కష్టమేమీ కాదురా. కావల్సిందల్లా జస్ట్‌... మంచి కాన్సంట్రేషన్‌. కాస్త హార్డ్‌వర్క్‌. ఇవేమీ కొత్తవి కావు. నేను టెన్త్‌ నుంచి చేస్తున్నవే. కాబట్టి చేసేస్తా. ఒక్క ఏడాది నాది కాదనుకుంటా. చేసేస్తా. నాక్కొన్ని యాంబిషన్స్‌ ఉన్నాయి. నేను డిఫరెంట్‌ అని చూపించాలి. ఆ తర్వాత ఒకరోజు ఆఫీస్‌కు సైకిల్‌ మీద రావాలి. ‘సార్‌ పెద్ద ఆఫీసర్‌ అయినా నిరాడంబరుడు. ఆయనకు ఏమాత్రం గర్వం లేద’ని జనమంతా అనుకోవాలి. మరోరోజు మనమెవరో తెలియకుండా సినిమాహాల్‌కు వెళ్లాలి. ఇంట్రవెల్‌ సమయంలో మెరుపు తనిఖీలు చేసి అందరినీ  అదరగొట్టాలి. అలా మనమేంటో మన తడాఖా ఏమిటో చూపించి జనాలకు మేలు చేయాలి’’ అంటూ అంతులేని ఉత్సాహంతో అడ్డూ అదుపూ లేకుండా మాట్లాడుతూ పోతున్నాడు. చాలా సంతోషంగా ఉన్నాడు. ఏదైనా సాధించడం తనకు పెద్ద కష్టం కాదని చెబుతున్నాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ రమేశ్‌ను చూస్తే... అతడు మునుపటి  రమేశేనా అనుకునేలా ఉన్నాడు. చాలా విచారంగా, చాలా నిరాశగా కనిపించాడు. ‘‘అదేంట్రా మొన్న అంత హుషారుగా ఉన్నావు. ఐఏఎస్‌కు ప్రిపేర్‌ అవుతానన్నావు?’’ అని అడిగితే... అమ్మో... ఏదో అనుకున్నా గానీ... ఆ సిలబస్‌ చూశాక బెంబేలెత్తిపోయారా. అయ్యబాబోయ్‌... అది ఏడాది కాదు కదా... మూడేళ్లైనా పూర్తి కాదేమోరా. కొందరు మూడు అటెంప్ట్స్, నాలుగు అటెంప్ట్స్‌ చేస్తారంటే అందుకేనేమోరా. నేను కనీసం క్లర్క్‌ అయినా అవుతానంటావా’’ అంటూ బేలగా మాట్లాడాడు. ‘‘అసలు జీవితంలో దేనికైనా పనికి వస్తానంటావా’’ అంటూ నిరాశపడ్డాడు. మనిషిని చూస్తే తీవ్రమైన డిప్రెషన్‌లో కనిపించాడు. ఒకరోజు రమేశ్‌ వాళ్లమ్మను పలకరిస్తే... ‘‘ఏమిటో బాబు ఒక్కోసారి చాలా హుషారుగా ఉంటాడు. మళ్లీ కొన్నిసార్లు నిరాశలో మునిగిపోతాడు. ఒక్కోసారి రాత్రిళ్లు ‘ఛీ... ఎందుకు నాకీ బతుకు’ అంటూ ఏడుస్తుంటాడు కూడా’’ అంటూ వాపోయింది ఆ తల్లి. అందరూ కలిసి బుజ్జగించి సైకియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్తే... డాక్టర్‌ కొన్ని పరీక్షలు చేసి ఇలా చెప్పాడు ‘‘అమ్మా... రమేశ్‌ ఒక మానసికవ్యాధితో బాధపడుతున్నాడు. ఆ వ్యాధి పేరు... బైపోలార్‌ డిజార్డర్‌’’.

లక్షణాలు : బైపోలార్‌ డిజార్డర్‌ రోగులు తమ మేనిక్‌ ఫేజ్‌ అయిన  ‘ఉత్సాహ దశ’లో దేన్నీ లెక్క చేయని తెంపరితనంతో ఉంటారు. ∙సాధారణం కంటే ఎక్కువ ఉత్సాహంతో ఉంటారు ∙ఒక్కోసారి సిల్లీగానూ, విచిత్రంగానూ అనిపించే పనులు చేస్తుంటారు ∙ఇతరులకు సహాయం చేయాలనే భావన బలంగా ఉంటుంది. ఒక్కోసారి ఎంతదూరమైనా వెళ్లి మేలు చేస్తారు ∙అంతులేని తెగువ చూపుతూ పోరాటాలకూ దిగే అవకాశం ఉంది ∙ఆలోచనలు పరంపరగా ఎడతెరిపి లేకుండా వస్తుంటాయి ∙ఒక ఉత్సాహపూరిత సంతోష దశలో చాలాసేపు ఉంటారు. దీన్నే ‘యుఫోరియా’ అంటారు. ∙డ్రగ్స్‌ లేదా ఆల్కహాల్‌ తీసుకోవాలన్న కోరిక ఎక్కువ ∙ఎలాంటి జంకూ లేకుండా సాహసాలకు పాల్పడవచ్చు  ∙డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేస్తారు ∙కొందరిలో సెక్స్‌ పట్ల అపరిమితమైన ఆసక్తి పెరుగుతుంది. ఈ హుషారులో సురక్షితం కాని సెక్స్‌ కార్యకలాపాలకూ ఒడిగడతారు. 

డిప్రెసివ్‌ ఎపిసోడ్‌లో:  ∙చాలా విచారంగా, ఏమాత్రం ఉత్సాహం లేకుండా ఉంటారు ∙నిరాశాపూరితంగా మాట్లాడతారు ∙దుర్బలంగా ఉన్నట్లుగా ప్రవర్తిస్తారు ∙నిద్ర పరమైన సమస్యలు. కొందరిలో అస్సలు నిద్రపట్టదు... లేదా మరికొందరు అదేపనిగా నిద్రపోతుంటారు ∙అంతకు ముందు సంతోషాన్నిచ్చిన అనేక కార్యకలాపాల మీద ఉత్సాహాన్ని కనబరచరు ∙దేని మీదా దృష్టి కేంద్రీకరించలేరు
∙చాలా ముఖ్యమైన విషయాలూ మరచిపోతారు ∙తింటే చాలా తక్కువగా తింటారు లేదా చాలా ఎక్కువగా తినేస్తుంటారు ∙ఎప్పుడూ అలసట, నీరసంగా కనిపిస్తుంటారు ∙కొన్నిసార్లు భ్రాంతులకు గురవుతుంటారు ∙తీవ్రమైన అపరాధభావంతో ఉంటారు ∙ మాటిమాటికీ చావులు లేదా ఆత్మహత్యల గురించి ప్రస్తావన తెస్తుంటారు ∙ఈ రోగులు అందరితోనూ సామాజిక సంబంధాలు నెరపలేరు. వీళ్ల ప్రవర్తన కారణంగా సాధారణంగా అవి దెబ్బతింటుంటాయి.

రకాలు / తీవ్రత : బైపోలార్‌ డిజార్డర్‌లో బైపోలార్‌–ఐ, బైపోలార్‌–ఐఐ అన్న ప్రధానమైన రెండురకాలతో పాటు మరికొన్ని రకాలూ ఉంటాయి.  ఇక తీవ్రత విషయానికి వస్తే...  కొందరిలో మేనిక్‌ దశ చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్లను హాస్పిటల్‌లో ఉంచి చికిత్స చేయించాల్సి రావచ్చు. ఇక కొందరిలో మేనిక్‌ దశ అంత తీవ్రంగా ఉండదు. ఆ కండిషన్‌ను ‘హైపోమేనిక్‌’ స్టేజ్‌గా పేర్కొంటారు. వీళ్లకు హాస్పిటల్‌లో ఉంచి చికిత్స చేయించాల్సిన అవసరం లేదు. కానీ... వాళ్ల నిరాశ, నిస్పృహలతో భవిష్యత్తు గురించిన దిగులుతో కుంగుబాటు ఉంటుంది. అందువల్ల చికిత్స చేయించాలి. లేకపోతే... వ్యాధి ముదిరి సమస్మాత్యకంగా మారే అవకాశం ఉంటుంది.

నిర్ధారణ : రోగుల్లో కనిపించే బైపోలార్‌ లక్షణాలను బట్టి ప్రాథమికంగా దీన్ని నిర్ధారణ చేస్తారు. అలాగే వారికి పర్సనాలిటీ డిజార్డర్స్, స్కీజోఫ్రీనియా వంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా అని డాక్టర్లు పరీక్షిస్తారు. ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో  కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై వంటివి కూడా చేయించాల్సి రావచ్చు. చిన్నప్పుడు ఏవైనా తీవ్రమైన మానసిక వేదనకు గానీ అబ్యూజ్‌కు గానీ గురయ్యారా చూస్తారు. కుటుంబ చరిత్రను పరిశీలిస్తారు. నిర్ధారణ (డయాగ్నోజ్‌) ప్రక్రియలో ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 

చికిత్స : చికిత్సలో రకరకాల ప్రక్రియలు అవలంబించినప్పటికీ ప్రధానంగా మందులే ఎక్కువగా పనిచేస్తాయి. ఎందుకంటే ఇది సైకోటిక్‌ డిజార్డర్‌ కిందికి వస్తుంది. కౌన్సెలింగ్‌ ప్రక్రియ సైకోటిక్‌ డిజార్డర్స్‌లో పనిచేయదు. అందుకే ప్రధానంగా మందులే వాడుతారు. దీనికి మూడు రకాల మందులు వాడాల్సి వస్తుంది. అవి... 1) మూడ్‌ను బాగుచేసే మూడ్‌ స్టెబిలైజర్స్, 2) మానసికసమస్యలకు ఇచ్చే యాంటీసైకోటిక్‌ డ్రగ్స్, 3) యాంటీడిప్రెసెంట్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పీరియాడిక్‌ టేబుల్‌లో మూడో ఎలిమెంట్‌ అయిన లిథియమ్‌ మనిషి భావోద్వేగాల హెచ్చుతగ్గులను ఎలా నియంత్రిస్తుందన్నది ఇప్పటికీ ఒక అద్భుతం. ఎందరో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నంత వ్యాధి తీవ్రత ఉన్నవారిలోనూ ఈ లిథియమ్‌ అద్భుతంగా పనిచేసి, ఎన్నో మరణాలను నివారించిందీ... నివారిస్తుంది.  బైపోలార్‌ డిజార్డర్‌లోని మందులన్నింటినీ సమస్య తీవ్రతను బట్టి తగిన మోతాదులో సైకియాట్రిస్ట్‌లు మాత్రమే ఇవ్వాల్సినవి. కాబట్టి ఒకసారి తీసుకున్న వారు సొంతంగా వాడటం ఎంతమాత్రమూ సరికాదు. అలాగే మందులు వాడుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆపేయడమూ మంచిది కాదు. దానివల్ల బైపోలార్‌ డిజార్డర్‌ తిరగబెట్టడంతో పాటు... తర్వాతి దశల్లో అదుపు చేయడం కొంత కష్టమవుతుంది కూడా. కొన్నిసార్లు కరెంట్‌ షాక్‌ ఇచ్చే ఎలక్ట్రోకన్వల్సివ్‌ థెరపీ కూడా అవసరం కావచ్చు. అయితే ఇది ఎంతమాత్రమూ ప్రమాదకరం కాదు. ఇక నిద్రసమస్యలు ఉన్న కొందరురోగుల్లో స్లీప్‌ మెడికేషన్‌ కూడా అవసరం కావచ్చు. 

బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్న సెలబ్రిటీలు
∙ప్రముఖ సింగర్‌ యో యో హనీసింగ్‌ బైపోలార్‌ డిజార్డర్‌తో బాధపడ్డాడు. చికిత్స తీసుకుని ఇప్పుడు పూర్తిగా దాని నుంచి విముక్తయ్యాడు. 
∙ప్రఖ్యాత హాలివుడ్‌ నటి మార్లిన్‌మన్రో కూడా తీవ్రమైన మూడ్‌ స్వింగ్స్‌తో బాధపడుతుండేవారనీ, బైపోలార్‌ జబ్బువల్లనే ఇలా జరిగేదని అంటారు. 
∙హెవీవెయిట్‌ బాక్సర్‌ మైక్‌టైసన్‌లో బైపోలార్‌ డిజార్డర్‌ను డయాగ్నైజ్‌ చేశారు. 
∙ప్రఖ్యాత రచయిత్రి వర్జీనియా వూల్ఫ్‌కు ‘బైపోలార్‌ డిజార్డర్‌’ ఒక మేలు చేసింది. ఆమెలోని ఆ ఉత్సాహం ఆమెను ఆల్‌ టైమ్‌ బెస్ట్‌ రైటర్‌ను చేసింది. డిప్రెషన్‌లోకి కూరుకుపోవడంతో అదే జబ్బు ఆమె ఆత్మహత్యను ప్రేరేపించింది. 
∙రెండుసార్లు అకాడమీ అవార్డుకు నామినేట్‌ అయిన యాక్షన్‌ హీరో మెల్‌ గిబ్సన్‌... తాను ఈ సమస్యతో బాధపడ్డట్లు వెల్లడించారు. అతడి వ్యక్తిగత జీవితం కారణంగా చాలాసార్లు వార్తల్లో నిలిచారు. 2006లో ఒకసారి డ్రంకెన్‌ డ్రైవ్‌లో దొరికిపోయి  పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. 
∙ప్రఖ్యాత రచయిత, నోబెల్‌ బహుమతి గ్రహీత అయిన ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే కూడా తన జీవితకాలంలో మేనిక్‌ డిప్రెసివ్‌ బిహేవియర్‌ చూపేవాడు. ఆయనకు షాక్‌థెరపీ కూడా ఇచ్చారు. అయితే ఎప్పుడూ చావు ఆలోచనలతో బాధపడే హెమ్మింగ్వే 1961లో తుపాకీతో కాల్చుకుని మరణించాడు. 
∙అకాడమీ అవార్డు, గోల్డెన్‌ గ్లోబు అవార్డులు గెలుచుకున్న ప్రముఖ నటి క్యాథరిన్‌ జెటా జోన్స్‌ కూడా ఈ వ్యాధి బారిన పడ్డారు. తన భర్త మైకెల్‌ డగ్లస్‌కు నాలుక క్యాన్సర్‌ రావడంతో ఆమె మొదట తీవ్రమైన డిప్రెషన్‌కు లోనై, ఆ తర్వాత బైపోలార్‌ డిజార్డర్‌ బారిన పడ్డారు. 
∙రెండోప్రపంచయుద్ధ సమయంలో బ్రిటన్‌కు ప్రధానిగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాత రాజకీయవేత్త విన్‌స్టన్‌ చర్చిల్‌ కూడా బైపోలార్‌ డిజార్డర్‌ బాధితుడే. యుద్ధసమయంలో తన సైనికులను తన ఉద్వేగభరిత ప్రసంగాల ద్వారా తీవ్రంగా ఉత్తేజితులను చేసేవాడు. యుద్ధం తర్వాత డిప్రెషన్‌కూ, ఆత్మహత్యాపూరితమైన ఆలోచనలకు, నిద్రలేమికి గురయ్యాడు. 

కారణాలు : ‘బైపోలార్‌ డిజార్డర్‌’కు కారణాలు నిర్దిష్టంగా ఉండవు. ఇవి రోగి నుంచి రోగికి మారుతుంటాయి. వీటిని జన్యుపరమైనవి, వాతావరణపరమైనవి, న్యూరలాజిక్‌గా చెప్పవచ్చు. 

జన్యుపరమైన కారణాలతో: రోగి కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉన్నప్పుడు... ఇతర  కుటుంబ సభ్యుల్లోనూ అవి కనిపించే అవకాశాలు ఎక్కువ. వంశపారంపర్యంగా ‘బైపోలార్‌ డిజార్డర్‌’ను ప్రేరేపించే జన్యువు కారణంగా ఇది కనిపించవచ్చని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే అంతమాత్రాన తల్లిదండ్రుల్లోనో లేదా సోదరుల్లోనో ఉంటే ఇది తప్పక కనిపించాలనేమీ లేదు. 

పర్యావరణ / బాహ్య వాతావరణ పరమైన కారణాలతో : ఇక్కడ వాతావరణం అంటే పూర్తిగా పర్యావరణ కారణాలైన ఏ కాలుష్యమనో, ఇంకేదో అనో కాదు. బాహ్య అంశాలను ‘ఎన్విరాన్‌మెంటల్‌’ కారణాలుగా చెబుతారు. ఉదాహరణకు చిన్నప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురి కావడం ∙ఏదైనా మనోవేదన లేదా ఇతరత్రా వ్యాధితో బాధపడాల్సి రావడం ∙ఏదైనా పెద్ద వినాశం తర్వాత కనిపించే తీవ్రమైన ఒత్తిడి అంటే పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ వంటివి చాలా సుదీర్ఘకాలం పాటు కొనసాగడం... లాంటి బయటి కారణాలన్నింటినీ ‘ఎన్విరాన్‌మెంటల్‌’ కారణాలుగా చెప్పవచ్చు. అయితే వీటి వల్ల నేరుగా జబ్బు రాకపోయినా... ఇలాంటి వారికి జబ్బు వచ్చినప్పుడు తీవ్రత ఎక్కువవుతుంది. 

న్యూరలాజికల్‌ : నాడీపరమైన కారణాలతో కొందిరలో బైపోలార్‌ డిజార్డర్‌ కనిపించవచ్చు. ఉదాహరణకు పక్షవాతం వచ్చిన కొద్దిమందిలో లేదా ఏదైనా ప్రమాదంలో మెదడు దెబ్బతినడం వంటివి సంభవించిప్పుడు, నరాలపై ఉండే మైలీన్‌షీత్‌ అనే పొర దెబ్బతినడం వంటివి సంభవించే మల్టిపుల్‌ స్కి›్లరోసిస్‌ వంటికేసుల్లో, చాలా అరుదుగా మెదడులోని టెంపోరల్‌ లోబ్‌ అనే భాగంలోని లోపాల వల్ల వచ్చే మూర్ఛ (టెంపోరల్‌ లోబ్‌ ఎపిలెప్సీ) వ్యాధి ఉన్నవారిలో ‘బైపోలార్‌ డిజార్డర్‌’ కనిపించే అవకాశాలుంటాయి. ఇక మెదడులోని ప్రధానమైన న్యూరోట్రాన్స్‌మిటర్‌ అయిన డోపమైన్‌ స్రావాలు రోగుల మూడ్స్‌లోని మార్పులకు కారణమవుతాయి. వాళ్ల డిప్రెసివ్‌ దశలో సెరటోనిన్‌ అనే రసాయనం తాలూకు అనుబంధ రసాయనమైన ‘5–హైడ్రాక్సీ ఇండోల్‌ ఎసిటిక్‌ యాసిడ్‌’ పాళ్లు కూడా తగ్గుతాయి. 

బైపోలార్‌ డిజార్డర్‌ – ఇతర వ్యాధులు
కొన్నిసార్లు బైపోలార్‌ డిజార్డర్‌... ఇతర వ్యాధులతో కలిసి కనిపించవచ్చు. ఇది ఉన్నవారిలో యాంగై్జటీ డిజార్డర్, ఈటింగ్‌ డిజార్డర్‌ వంటి మానసిక సమస్యలు ఉండవచ్చు. ఇది ఉన్నవారిలో థైరాయిడ్‌ సమస్యలు, మైగ్రేన్‌ తలనొప్పులు, గుండెజబ్బులు, డయాబెటిస్, ఒబేసిటీ లేదా ఇతరత్రా సమస్యలు కలగలిసి ఉండే అవకాశాలు ఎక్కువ. 

నివారణ
పిల్లలు చిన్నప్పుడు తీవ్రమైన మనోవేదనకు గురయ్యే సందర్భాల్లో, ఆ కారణాన్ని బట్టి వారికి తగినంత మానసిక సాంత్వ ననివ్వడం ద్వారా పెద్దయ్యాక వారిలో బైపోలార్‌ డిజార్డర్‌ రాకుండా నివారించవచ్చు. మంచి మానవసంబంధాలను నెరపడం, అందరితో కలిసి ఉంటూ సామాజిక బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం ద్వారా చాలా సందర్భాల్లో బైపోలార్‌ డిజార్డర్స్‌ నివారితమయ్యే అవకాశాలు ఎక్కువే. 
డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై
ప్రొఫెసర్‌ అండ్‌ హెచ్‌ఓడి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైకియాట్రీ, కాకతీయ మెడికల్‌ కాలేజ్, వరంగల్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top