
మా అక్క ప్రెగ్నెన్సీతో ఉన్నపుడే మా బావ చనిపోయారు. తండ్రి లేని పిల్లవాడని చిన్నప్పటినుంచి వాణ్ణి అందరూ బాగా గారాబం చేశారు. ‘నా ఫ్రెండ్స్ అందరూ బీటెక్ కోసం చెన్నై వెళ్తున్నారు, నేనూ వెళ్తాను’ అంటే ఒక డీమ్డ్ యూనివర్సిటీలో మా నాన్న గారు జాయిన్ చేశారు. అక్కడికి వెళ్ళగానే ఐఫోన్, లాప్‌టాప్ కొనిపించుకున్నాడు. ఇంక రోజంతా ఆ ల్యాప్‌టాప్‌లో గేమ్స్ ఆడుతూ కూర్చునేవాడు. ‘నాకు ఇంజినీరింగ్ ఇష్టం లేదు, యానిమేషన్ కోర్సులో జాయిన్ అవుతాను’ అంటే అక్కడి నుండి తీసుకొచ్చి యానిమేషన్ కోర్సులో జాయిన్ చేశాం. కాలేజీకి వెళ్ళడానికి బైకు కావాలి అని చెప్పి ఖరీదైన బైకు కూడా కొనిపించుకున్నాడు. లోకల్ ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువై పోయి రోజూ మందు, సిగిరెట్లు తాగడం స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు గంజాయి, ఇంకా వేరే ఏవో డ్రగ్స్ తీసుకుంటున్నానని తెలిసి మేం డబ్బులు ఇవ్వం అని అంటే– నేను ఇంట్లో నుంచి వెళ్ళి పోతాను, చచ్చిపోతాను అని బెదిరిస్తున్నాడు! మా అక్కేమో, మా అమ్మాయిని తన కొడుక్కు ఇచ్చి పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడంటోంది. మా ఆవిడకు అది ఇష్టం లేదు, అలా చేస్తే చచ్చిపోతానని బెదిరిస్తోంది. వీళ్లందరి మూలంగా నేను కూడా డిప్రెషన్‌కు లోను అవుతున్నాను. దయచేసి నేను ఏం చేయాలో చెప్పండి.– శ్రీనివాస రావు, నెల్లూరు
మీ సమస్య చాలా సంక్లిష్టమైనది, సున్నితమైనది కూడా! ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాకుండా ఒక కుటుంబానికి సంబంధించిన సమస్యగా చూడాల్సి ఉంటుంది. ముందు మీరూ మీ కుటుంబ సభ్యులు అంతా కౌన్సెలింగ్ తీసుకోవల్సి ఉంటుంది. ప్రేమ అంటే అడగ్గానే అవసరం ఉన్నా లేకున్నా, అన్నీ తెచ్చి ఇవ్వడం కాదు. పిల్లలకు ఏది మంచిది. ఏది వాళ్ళను పాడు చేస్తుంది– అనే వివేచనాశక్తి పెద్దలు కలిగి ఉండాలి. నియంత్రణ, బాధ్యత లేని ప్రేమ చాలా ప్రమాదకరం. అది మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుంది. దురదృష్టవశాత్తూ మీ మేనల్లుడి విషయంలో అదే జరిగింది. దీనివల్ల ఆ పిల్లవాడు చిన్న వయసు నుంచి ఒక పద్ధతి, క్రమ శిక్షణ లేకుండా ఒక జలాయిలా పెరిగాడు. దానికి తోడు ఈ మొబైల్ ఫోను, చెడుసావాసాలు, డ్రగ్స్ అతన్ని మరింతగా పాడు చేశాయి. మీ మేనల్లుడికి ఖచ్చితంగా ‘పర్సనాలిటీ డిజార్డర్’ ఏదైనా ఉండొచ్చు. దాన్ని కౌన్సెలింగ్, మందుల ద్వారా కొంతవరకు సరిచేయవచ్చు. అయితే అతను ట్రీట్మెంట్ కు సహకరించక΄ోవచ్చు. అతనికి ఈ సూసైడ్ ఆలోచనలు ఉండడం, విపరీతంగా డ్రగ్స్ తీసుకోవడం అనేది సైకియాట్రిక్ ఎమర్జెన్సీని సూచిస్తాయి.
– అలాంటి సందర్భాల్లో పేషంట్‌కు ఇష్టం లేక΄ోయినా కుటుంబ సభ్యుల సహకారంతో వైద్యం అందించవచ్చు. అవసరమైతే కొంతకాలం అతన్ని రీ హ్యాబిలిటేషన్ సెంటర్లో ఉంచి ఒక క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని తనకి అలవాటు చేయవచ్చు. ఈలోపు మీ అక్క, మీ అమ్మనాన్నలకి పేరెంటింగ్ విషయంలో కౌన్సెలింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ ఏమీ మించిపోయింది లేదు. కాబట్టి ముందు మీరు మీకు దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్‌ని కలవండి. ఈలోగా మీ అమ్మాయిని చదువుకుని తన కాళ్ళ మీద తనను నిలబడమని ప్రోత్సహించండి.
ఈలోపు మీ మేనల్లుడిలో ఎలాంటి మార్పు వస్తుందో మీకు అవగాహన వస్తుంది. అప్పడు పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవచ్చు. అసలు ఇప్పుడే ఆ విషయం గురించి తల బద్దలు కొట్టుకోవడం సరైంది కాదు. సైకియాట్రిస్టులంటే కేవలం పిచ్చి పట్టిన వారికి మాత్రమే కాదు, ఇలాంటి కుటుంబ, వైవాహిక జీవిత సమస్యలున్న వారికి కూడా, తగిన సలహాలు, కొన్సెలింగ్, వైద్య చికిత్స చేసే మనోవైద్య నిపుణులని అందరూ తెల్సుకోవాలి!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన
మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com