పులిపిర్లకు ఉల్లి .. వెల్లుల్లి 

beauty tips:Onion to the Pulpis - Sakshi

బ్యూటిప్స్‌

మెడ, భుజాలు, చంక, కళ్ల ప్రాంతాలలో పులిపుర్లు మొలుస్తూ ఉంటాయి. వీటికి చర్మసమస్యలు, ఊబకాయం, జన్యుకారకాలు.. ఇలా ఎన్నో కారణాలు అవుతుంటాయి. చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే ఈ పులిపిర్లను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలను ఇంటి వద్దే తీసుకోవచ్చు. చర్మ సహజత్వమూ కోల్పోకుండా కాపాడుకోవచ్చు. ఉప్పు, ఉల్లిపాయ:  ఉల్లిపాయలో సల్ఫర్‌ శాతం అధికం. ఇది మొండిగా ఉండే మొటిమలను, పులిపిర్లను నివారించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో ఒక గిన్నె తీసుకొని అందులో అర కప్పు నీళ్లు, టీ స్పూన్‌ ఉప్పు వేసి కలపాలి. దీంట్లో 2–3 ఉల్లిపాయ ముక్కలను కోసి వేసి, మూత పెట్టి ఆ రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ రసాన్ని రోజుకు మూడు సార్లు పులిపిర్ల మీద, పులిపిర్లు వచ్చేఅవకాశం ఉంది అనుకున్న చోట చర్మం మీద రాయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే పులిపిర్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. 

వెల్లుల్లి:  ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ నుంచి కాపాడే ఔషధ గుణాలు వెల్లుల్లిలో సమృద్ధిగా ఉన్నాయి. రెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరాలి. ఈ పేస్ట్‌ని పులిపిర్లు ఉన్న చోట రాసి, గంట సేపు ఉంచాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తూ ఉండాలి. కొన్ని రోజులకు పులిపిరి చర్మం నుంచి విడివడుతుంది. 

అల్లం: యాంటీమైక్రోబయల్‌ లక్షణాలు గల అల్లం చర్మ సమస్యల నివారిస్తుంది. తాజా అల్లంను సన్నని స్లైసులుగా కట్‌ చేయాలి. ఆ ముక్కలతో పులిపిర్ల మీద మృదువుగా రుద్దాలి. రోజుకు 5 నుంచి 6 సార్లు ఇలా చేస్తూ ఉంటే సహజపద్ధతుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి. 

నిమ్మరసం:  దూది ఉండను నిమ్మరసంలో ముంచి దాంతో పులిపిర్లు, యాక్నె ఉన్న చోట అద్దాలి. పది నిమిషాలు ఉంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజులో 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే పులిపిర్లు సహజ పద్ధతిలో వదిలే అవకాశం ఉంది. 

కొబ్బరి నూనె: జుట్టుకు వాడేది కాకుండా సహజమైన కొబ్బరి నూనె ఎన్నో చర్మ సమస్యలను నివారిస్తుంది. పులిపిర్లు ఉన్న చోట కొబ్బరి నూనె రాసి ఓ గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజుకు రెండు సార్లు కొబ్బరి నూనె పులిపిర్లు ఉన్న చోట రాస్తూ ఉంటే కొన్ని వారాలలో వాటి సంఖ్య తగ్గుముఖం పడుతుంది.

వేప నూనె: వేప చెట్టు ఆరోగ్యప్రదాయిని అని మనకు తెలిసిందే! వేప నూనెలో ఓషధ గుణాలు అధికం. పులిపిర్లను నివారించడంలో వేపనూనె మహత్తరంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రోజుకు 3 సార్లు పులిపిర్లకు వేపనూనె రాయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కొన్ని వారాలకు మొలిచిన పులిపిర్లు రాలిపోతాయి.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top