వంచిన తల ఎత్తింది

Bahni Kumari achieved 661 rank in upsc examination - Sakshi

బహ్ని కుమారి తెలంగ...అస్సాం అమ్మాయి. ఈ ఏడాది యు.పి.ఎస్‌.సి. (యూనియన్‌ పబ్లిక్‌  సర్వీస్‌ కమిషన్‌) పరీక్షల్లో 661వ ర్యాంకు సాధించింది. దేశంలో ఎందరో అమ్మాయిలు సివిల్స్‌ రాస్తున్నారు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్‌ తదితర సర్వీస్‌ కమిషన్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. పోనీ ఈశాన్య రాష్ట్రాల అమ్మాయి అని ప్రత్యేకంగా చెప్పుకుంటున్నామా అంటే... ఈ ఒక్క ఏడాదిలోనే ఈశాన్య రాష్ట్రాల నుంచి ఏకంగా పాతిక మంది అమ్మాయిలు ఈ పరీక్షను పూర్తి చేశారు. మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు. అయినప్పటికీ బహ్ని కుమారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఉంది.

దృశ్యం మారింది: అస్సాం రాష్ట్రంలో టీ తోటల్లో పని చేసే కుటుంబాల నుంచి యూపీఎస్‌సీ లో ర్యాంకు సాధించిన తొలి మహిళ బహ్ని. అస్సాం అంటేనే టీ తోటలు గుర్తుకొస్తాయి. వీపుకు వెదురు బుట్ట కట్టుకుని మునివేళ్లతో తేయాకు తెంపుతున్న మహిళలే గుర్తుకు వస్తారు. అస్సాంకు ప్రతీకగా చూపించే దృశ్యం కూడా అదే. అయితే గతంలో ఈ కుటుంబాలలో మహిళల విద్య, ఉద్యోగం వంటివి ఆలోచనకు కూడా అందేవి కాదు.

తేయాకు కోసే గిరిజన తెగల్లో ఆడపిల్ల చేయాల్సిన పని అంటే అక్కడ ఇంటి పనులు చేసుకుని, తోటల్లో టీ కోసే కూలికి వెళ్లడమే. అలాంటి గిరిజన కుటుంబంలో పెరిగిన యువతి ఇప్పుడు తల వంచుకుని తేయాకు తెంపడానికే పరిమితం కాకుండా ఒక పనిని సమర్థంగా ప్రణాళికా బద్ధంగా నిర్వర్తించే పెద్ద ఉద్యోగంలో చేరుతున్నందుకు ఆ తెగ మొత్తం బహ్నిని చూసి సంతోషిస్తోంది.

ఉద్యోగాన్ని వదిలేసింది: అస్సాం రాజధాని గువహటి నగరంలోని సెయింట్‌ మేరీస్‌ స్కూల్, కాటన్‌ కాలేజ్‌లలో చదివింది బహ్ని. దుర్గాపూర్‌ ఎన్‌ఐటీలో మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ చేసింది. తర్వాత విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేసింది. ఉద్యోగం చేస్తూనే రెండుసార్లు యు.పి.ఎస్‌.సి. పరీక్షలు రాసింది. ఆ ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో ఉద్యోగం మానేసి మరీ మూడవసారి తీవ్రంగా ప్రయత్నించింది. ర్యాంకు సాధించింది.

పుత్రికోత్సాహం
‘మా అమ్మాయి సాధించిన ర్యాంకు ఆమె ఉన్నతమైన కెరీర్‌కి చక్కటి సోపానమే. తండ్రిగా గర్వపడుతున్నాను. అయితే ఇది ఆమెకు మాత్రమే కాదు. మా తెగ మొత్తం అందుకున్న ఒక ఘనత. అస్సాంలో తేయాకు కోసే మా తెగ గిరిజనులు కొల్లలు. వారి జీవనస్థితిగతులు అంతంతమాత్రమే.

ఈ తెగలో పుట్టి యు.పి.ఎస్‌.సి. సాధించిన తొలి మహిళ బహ్ని. అయితే ఆమె ఈ రికార్డును కిరీటంగా ఆస్వాదించడం కాదు, రాష్ట్రంలో మా గిరిజన తెగల మహిళల కోసం తన వంతుగా పని చేయాలి కూడా’ అంటున్నారు బహ్ని తండ్రి బర్కి ప్రసాద్‌ తెలంగా. ఆయన మాజీ మంత్రి కూడా. అస్సాంలోని థౌరా నియోజకవర్గం నుంచి 1985లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా గెలిచిన బర్కీ ప్రసాద్‌ అస్సాం గణపరిషత్‌ ప్రభుత్వంలో చేరారు. అస్సాం రాష్ట్రానికి శ్రామిక మంత్రిగా పని చేశారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top