వంట సోడా తాగితే మేలే!  | Sakshi
Sakshi News home page

వంట సోడా తాగితే మేలే! 

Published Thu, Apr 26 2018 1:37 AM

Are you suffering from rheumatoid arthritis? - Sakshi

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారా? అయితే ఇకపై ఒక పద్ధతి ప్రకారం బేకింగ్‌ సోడాను తీసుకోవడం మొదలుపెట్టండి. ఒక్క రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ అనే కాదు.. టైప్‌–1 మధుమేహంతోపాటు అనేక ఇతర ఆటో ఇమ్యూన్‌ వ్యాధులను ఎదుర్కొనేందుకు బేకింగ్‌ సోడా చక్కగా ఉపయోగపడుతుందని ఆగస్టా యూనివర్సిటీకి చెందిన మెడికల్‌ కాలేజీ ఆఫ్‌ జార్జియా శాస్త్రవేత్తలు అంటున్నారు. వినడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా.. ఇందులో ఉన్న శాస్త్రం ఏమిటో డా.పాల్‌ ఓ కానర్‌ అనే శాస్త్రవేత్త వివరించారు. సోడియం బైకార్బొనేట్‌ అని పిలిచే ఈ బేకింగ్‌ సోడాను ఎలుకలకు ఇచ్చినప్పుడు వాటి కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యాయని తద్వారా ఆ తరువాత తినే ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడతాయన్నారు.

అంతేకాకుండా... రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయాల్సిన అవసరం లేదంటూ క్లోమగ్రంథిపై ఉన్న కొన్ని ప్రత్యేక కణాలు  సందేశాన్ని పంపేలా చేస్తాయి. క్లోమగ్రంథి కూడా రోగ నిరోధక వ్యవస్థలో భాగమన్నది తెలిసిందే. రెండు వారాలపాటు బేకింగ్‌ సోడా ద్రావణాన్ని తాగిన కొంతమందిని పరిశీలించినప్పుడు మాక్రోఫేగస్‌ అనే రోగ నిరోధక కణాలు తమ స్థితిని  మార్చేసుకుని మంట/వాపు తగ్గించేందుకు ఉపయోగపడ్డాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. రోజువారీ బేకింగ్‌ సోడా సేవనం ద్వారా అసిడిటీ తగ్గడంతోపాటు కిడ్నీ సంబంధిత వ్యాధుల సమస్య కూడా మందగిస్తుందని ఇప్పటికే కొన్ని పరిశోధనలు చెబుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. 

Advertisement
Advertisement