ఆంధ్రా ఊటి అరకు

Araku Valley Is A Popular Tourist Spot In Visakhapatnam District - Sakshi

పర్యాటకం అరకు

పచ్చని కొండలు.. నీలి సముద్రం.. మనసుదోచే సహజ సిద్ధమైన అందాలు.. వీటన్నిటి కలబోతే విశాఖ. ప్రకృతి రమణీయతకు స్వర్గధామమైన విశాఖ అందాలను చూసి పర్యాటకులు ఫిదా అవుతుంటారు. ఆంధ్రా ఊటీ అరకు నుంచి ఆంధ్రా కాశ్మీర్‌ లంబసింగి వరకూ ఎటు చూసినా ప్రకృతి పలకరిస్తుంది. మది పులకరిస్తుంది. అందుకే దేశ, విదేశీ సందర్శకులు మళ్లీ మళ్లీ జిల్లాలోని అందాల్ని వీక్షించేందుకు విచ్చేస్తుంటారు.

జలపాతాల హొయలు
మన్యంలో జలపాతాల అందాలు కట్టిపడేస్తుంటాయి. అనంతగిరిలోని కటిక, డుంబ్రిగుడలోని చాపరాయి, దేవరాపల్లిలోని సరయు, పెదబయలులోని పిట్టలబొర్ర, బొంగదారి, ఒడిశా సరిహద్దుల్లోని ముంచంగిపుట్టులోని డుడుమ, చింతపల్లి మండలం దారకొండ, జి మాడుగులలో కొత్తపల్లి... ఇలా ఎన్నో జలపాతాలు సందర్శకుల్ని మైమరపిస్తున్నాయి. కటిక, సరయు, పిట్టలబొర్ర జలపాతాల వద్ద మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా పర్యాటకశాఖ అధికారులు ఫుడ్‌కోర్టులు, వాష్‌రూమ్‌లు, రెస్ట్‌రూమ్‌లు నిర్మిస్తున్నారు.

సున్నా డిగ్రీల లంబసింగి
మన్యంలో అరుకులోయకు పోటీగా పర్యాటకులను ఆకట్టుకోవడానికి లంబసింగి పోటీపడుతోంది. విశాఖ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న లంబసింగి చింతపల్లి మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామం. దీని పంచాయతీ పరిధిలోని 50 తండాల్లోనూ ఈ సీజన్‌లో అతి చల్లని వాతావరణం ఉంటుంది. తూర్పు కనుమల్లో సముద్ర మట్టానికి సుమారు 3 వేల అడుగుల ఎత్తున ఉండటంతో శీతాకాలం ప్రారంభం నుంచే ఇక్కడ చలి మొదలవుతుంది.

నవంబరు నుంచి జనవరి వరకు 0 నుంచి 5 డిగ్రీల సెల్సియస్‌ వరకూ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇక్కడి విశేషం.ఎతై ్తన చెట్లుతో దట్టమైన అటవీ ప్రాంతం, వాటిలో కాఫీ, మిరియాల తోటలు, ఎటు చూసినా పచ్చని మైదానాలు, నోరూరించే స్ట్రాబెర్రీ మొక్కలు... ఇవన్నీ ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తాయి.

సాహసాలకు నెలవు
లంబసింగి సమీపంలో కొండలపై ఇటీవల ట్రెక్కింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు.కనీసంగా 15 మంది సభ్యుల బృందం ముందుగా ఏపీటీడీసీ అధికారులను సంప్రదిస్తే ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుని పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజంగి జలాశయంపై జిప్‌లైన్, ఇరువైపులా ఉన్న కొండల మధ్య రోప్‌ నిర్మిస్తున్నారు.  

లంబసింగిలో టెంటు రూములు
లంబసింగిలో బస చేసేవారికి ఏపీటీడీసీ రిసార్ట్స్‌ నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ఇప్పటివరకూ ఏపీటీడీసీ హరిత హిల్‌రిసార్ట్‌లో జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఏసీ టెంటు రూములు నాలుగు ఉన్నాయి. ఎనిమిది సూట్‌ రూమ్‌లు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. అలాగే ప్రధాన భవనంలో ఆరు గదులతో పాటు 300 సీటింగ్‌ సామర్థ్యంతో సమావేశ మందిరం, దిగువ భాగంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను ఏర్పాటుచేస్తున్నారు. మరోవైపు ఎకో టూరిజం ప్రాజెక్టులో భాగంగా 30 టెంట్‌ రూమ్‌లు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

టూర్‌ ప్యాకేజీలు
అరకు – లంబసింగి– అరకు...
మన్యం ప్యాకేజీగా ఏపీటీడీసీ అందిస్తోంది. పెద్దలకు రూ.999, చిన్నపిల్లలకు రూ.799గా టికెట్‌ ధర. అరకు నుంచి లంబసింగి కూడా సమీపంలోనే ఉండటంతో రెండు పర్యాటక ప్రాంతాలనూ కలుపుతూ మధ్యనున్న చాపరాయి, మత్స్యగుండం, కొత్తపల్లి జలపాతాలతో పాటు ఆపిల్, పైనాపిల్, స్ట్రాబెర్రీ పండ్ల తోటలను చూసొచ్చేలా మరో ప్యాకేజీని అమల్లోకి తెచ్చారు.

ప్రతి రోజూ బస్సు అరకు నుంచి ఉదయం 7 గంటలకు బయల్దేరి ఆయా ప్రాంతాలను చుట్టేసి రాత్రికి తిరిగివస్తుంది. అలాగాకుండా ఒక బృందంగా విశాఖపట్నం నుంచి లంబసింగి వెళ్లాలనుకునేవారు ముందుగా సంప్రదిస్తే కార్లను ఏర్పాటు చేస్తామని ఏపీటీడీసీ అధికారులు తెలిపారు.

రైల్‌ కమ్‌ రోడ్డు ప్యాకేజీ
గతంలో పర్యాటకులకు మంచి మజిలీని అందించిన రైల్‌ కమ్‌ రోడ్‌ ప్యాకేజీని ఇప్పుడు కొద్ది మార్పులతో ఏపీటీడీసీ తిరిగి గత నెల సెప్టెంబర్‌లో పునఃప్రారంభించింది. రూ.1450తో పెద్దలకు, రూ.1160 పిల్లలకు ఈ టికెట్‌ ధర నిర్ణయించారు.  రైల్వేశాఖతో సంబంధం లేకుండా నేరుగా ఐఆర్‌సిటిసి ద్వారా రైల్‌ టికెట్లు బుక్‌ చేసి... ఈ ప్యాకేజీని ఏపీటీడీసీ అందిస్తోంది.

పద్మాపురం బొటానికల్‌ గార్డెన్, ట్రైబల్‌ మ్యూజియం, ట్రైబల్‌ థింసా, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా కేవ్స్, తైడా జంగిల్‌ బెల్‌కు తీసుకువెళతారు. రోడ్డు మార్గాన వెళ్లాలనుకునేవారి కోసం అరకు–బొర్రా రోడ్డు ప్యాకేజీ టూర్‌ ఉంది. రవాణా చార్జి కింద పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.560 చెల్లించాలి.

చిత్రకూట్‌ జలపాతం ప్యాకేజీ
భారత నయాగరా అని పేరొందిన చిత్రకూట్‌ జలపాతం సందర్శించి వచ్చేలా టూరిజం శాఖ ప్యాకేజీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మన్యానికి ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లాలో జగదల్‌పూర్‌కు సమీపంలో ఇంద్రావతి నది ప్రవాహంలో భాగంగా అద్భుత జలరాశి ఉంది.

ఈ సీజన్‌లో 95 అడుగుల ఎత్తు నుంచి కిందికి దుమికే ఈ జలపాత అందాల్ని చూసి తీరాల్సిందే. అలాగే జగదల్‌పూర్‌కు సమీపంలోనే కొండపై నుంచి సున్నితంగా జాలువారే తీరథ్‌గఢ్‌ జలపాతాన్ని చూసి రావచ్చు. ఇందుకోసం ఏపీటీడీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. అరకులో ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు బస్సు బయల్దేరుతుంది. ఇందుకుగాను పెద్దలకు రూ.1,900, పిల్లలకు రూ.1,500గా ప్యాకేజీ ఉంది.

గొప్పగా చెప్పుకుంటాం
అందాల అరకులోయను చూడటానికే ప్రతి ఏటా భారతదేశ పర్యటనకు వస్తుంటాం. ఇక్కడ ప్రకృతి అందాలు, లోయ ప్రాంతాలు, బొర్రాగుహలు ఆహ్లాదకరంగా ఉంటాయి. మా దేశంలో అరకులోయ గురించి గొప్పగా చెప్పుకుంటాం.
– లూయిస్, పవుల దంపతులు, బ్రెజిల్‌

వలిసెపూలు చూసేందుకే..
వలిసెపూల సీజన్‌ అంటే మాకు చాలా ఇష్టం. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండి అరకుతో పాటు మిగిలిన పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తాం. పర్యాటకశాఖ రిసార్ట్‌లలో గతంలో కంటే సౌకర్యాలు మెరుగుపడ్డాయి.
– ఎస్‌.కె.రహమాన్, కలకత్తా, పశ్చిమబెంగాల్‌

సీలేరు ఎలా వెళ్ళాలంటే..
విశాఖ సముద్రమట్టానికి 4900 మీటర్ల ఎత్తులో ఉండే సీలేరు ప్రకృతి అందాలకు నెలవుగా ఉంటుంది. కార్తీక మాసంలో వనభోజనాల కోసం ఇక్కడికి పెద్దసంఖ్యలో తరలివస్తారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు జలపాతాలు, గిరిజనుల ఆరాధ్య దేవతధారాలమ్మ ఆలయం సీలేరుకు వెళ్ళే మార్గంలో కనిపిస్తుంది. సీలేరు పేరు వినగానే  జలవిద్యుత్‌ కేంద్రాలు గుర్తొస్తాయి. 1950లో ఇక్కడ జల విద్యుత్‌ కేంద్రాలను నిర్మించారు.  
– గరికిపాటి ఉమాకాంత్, సాక్షి, విశాఖపట్నం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top