స్నేహమంత పందిరి

Ambani family has seen everything as special guests - Sakshi

ఫ్రెడ్షిప్‌ డే

అంబానీ తన కూతురి పెళ్లికి ఆకాశం కంటే కూడా పెద్ద పందిరి వేశారు. పిరమల్‌ తన కొడుక్కి కోరుకున్న అమ్మాయిని ఇచ్చాడు. అయితే పిల్లల పెళ్లి కంటే కూడా ఇవాళ పెద్ద సెలబ్రేషన్‌.. ఆ పెద్దల మధ్య ఉన్న స్నేహమే!  

నిన్నంతా కౌంటింగ్‌ కళ. ఇవాళ కంట్రీకే పెళ్లి కళ! భారతదేశం సందడిగా ఉంది. ఎక్కడేం జరిగినా పాపం ప్రజలెప్పుడూ ‘నాకేంటి’ అని అనుకోరు. ఓటుంటే ఓటేసి వస్తారు. పిలుపొస్తే పెళ్లికి వెళ్లొస్తారు. ఓటు లేకపోయినా, ఉండీ వెయ్యలేకపోయినా ఎన్నికల్లో భాగస్వాములౌతారు. మనవి కాని పెద్దింటి పెళ్లిళ్లనూ ఓన్‌ చేసుకుంటారు. కుటుంబం అంతా భోజనానికి కూర్చున్నప్పుడు కేసీఆర్‌కి వచ్చిన సీట్ల గురించి, అంబానీ తన కూతురి పెళ్లికి ఖర్చుపెడుతున్న కోట్ల గురించి ఉత్సాహంగా మాట్లాడుకుంటారు. ఆరోగ్యకరమైన అలవాటే. ‘ఎవరొస్తే ఏముందిలే’ అనుకుంటూ ముద్ద మింగడం అనారోగ్యం. ‘దేశంలో ఇంతమంది నిరుపేదలుంటే పెళ్లికి అంతంత ఖర్చా’ అనుకోవడం మానసిక అస్వస్థత. పేపర్‌లలో అస్తమానం అవే వార్తలు, చానళ్లలో అవే దృశ్యాలు వస్తున్నా విసుగు అనిపించని మాంత్రికత ఏదో ఉంటుంది ఈ ఎన్నికల్లో, పెళ్లిళ్లలో! అనుష్క–విరాట్, రణ్‌వీర్‌–దీపిక, ప్రియాంక–నిక్‌ జోనస్‌.. ఏడాది పొడవునా పెళ్లి పెళ్లి అని ఎంత విసిగించారు! అయినా విసుగొచ్చిందా? అనుష్క, విరాట్‌ల పెళ్లి గత ఏడాది డిసెంబర్‌ 11న జరిగింది. అప్పుడే సంవత్సరం అయిందా అనిపించడం లేదూ! సెలబ్రిటీల పెళ్లిళ్లు పెళ్లింటికే కాదు, దేశంలోని ప్రతి ఇంటికీ కళే. సెలబ్రిటీల పెళ్లి ఫొటోలు వాళ్లింటికే కాదు, ప్రతి ఇంటికీ ఫ్యామిలీ ఆల్బమ్‌లే. మళ్లీ ఇప్పుడొక కొత్త ఆల్బమ్‌ మన చేతికి వస్తోంది. 

ముఖేశ్‌ అంబానీ, నీతా అంబానీల కూతురు ఇషా అంబానీ  పెళ్లి ఇవాళ ముంబైలోని వారి స్వగృహం ‘యాంటిలియా’లో జరుగుతోంది. వరుడు ఆనంద్‌ పిరమల్‌. ఇషా పెళ్లి వేడుకలు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐదు రోజుల పాటు అక్కడి ‘ఒబెరాయ్‌ విలాస్‌’లో జరిగాయి. ఆ ఐదు రోజులకు అంబానీలకు అయిన ఖర్చు 720 కోట్ల రూపాయలు. అంటే వంద మిలియన్‌ డాలర్లు. అంతయిందని వాళ్లూ వీళ్లూ అనుకోవడం కాదు. ‘బ్లూమ్స్‌బర్గ్‌ క్వింట్‌’ అనే బిజినెస్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ న్యూస్‌ ఆర్గనైజేషన్‌ వేసిన అంచనా. ముప్పై ఏడేళ్ల క్రితం ప్రిన్స్‌ చార్ల్స్, ప్రిన్సెస్‌ డయానాల పెళ్లికి అయిన ఖర్చు ఇప్పటి లెక్కల్లో 110 మిలియన్‌ డాలర్లు. ప్రపంచంలోని అతి ఖరీదైన పెళ్లిళ్లలో ప్రిన్స్‌ దంపతులది ఒకటని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు ఇషా పెళ్లి ఖర్చు కూడా అంతే. పది మిలియన్‌ డాలర్లు తక్కువ కదా అనుకోడానికి లేదు. ఇవాళ్టి వెడ్డింగ్‌ ఖర్చులు యాడ్‌ అవాల్సి ఉంది. 

మనిషికి జీవితం బోర్‌ కొట్టకుండా ఉండాలంటే పండుగలుండాలి. పండుగలు బోర్‌ కొట్టకుండా ఉండాలంటే పెద్దవాళ్ల పెళ్లిళ్లు ఉండాలి. పెళ్లి మాత్రమే ఆ పెళ్లిళ్లలో వేడుక కాదు. పెళ్లికి వచ్చేవాళ్లను కళ్ల నిండా చూడ్డమూ వేడుకే. ఇషా ఉదయ్‌పూర్‌ ప్రీ వెడ్డింగ్‌ ఉత్సవాలకు ఇండియా బయటి నుంచి హిల్లరీ క్లింటన్‌ వచ్చారు. ఇంకా, మనకు తెలిసిన వాళ్లలో గాయని బేయాన్స్‌ వచ్చారు. ‘సంగీత్‌’లో ఆమె ధగధగలాడారు. యు.ఎస్‌.లో స్వర దేవత ఆమె. గ్రామీ అవార్డు గ్రహీత కూడా. ఇక మనవాళ్లు ఎటూ ఉంటారు. సల్మాన్‌ఖాన్, షారుఖ్‌ ఖాన్, కరణ్‌ జోహార్, ఐశ్వర్యారాయ్‌.  వీళ్లంతా ఇప్పటికే ఉదయ్‌పూర్‌ నుంచి ముంబై చేరుకున్నారు. అంబానీలు, పిరమల్‌లు ఐదు ఫైవ్‌స్టార్‌ హోటళ్లను అతిథుల కోసం బుక్‌ చేసి ఉంచారు. హోటల్‌ గదులను బుక్‌ చెయ్యడం కాదు. టోటల్‌గా హోటళ్లనే బుక్‌ చేశారు. అంత పెద్ద లిస్ట్‌ ఉంది పెళ్లికొచ్చేవాళ్లది. రాజస్తాన్‌ నచ్చి అక్కడే ఉండిపోతాం అన్నవారికి ఉదయ్‌పూరే విడిదిల్లు. అక్కడి నుంచి ముంబై లోని మహారాణా ఎయిర్‌పోర్ట్‌కు.. వేళల్తో పనిలేని వంద చార్టర్డ్‌ ఫ్లయిట్స్‌ వారం రోజులుగా షట్లింగ్‌ చేస్తున్నాయి. పెళ్లికి ప్రణబ్‌ ముఖర్జీ, మమతాబెనర్జీ వంటి పెద్ద నాయకులు వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఉదయ్‌పూర్‌లో మొదటి నాలుగు రోజులు ‘అన్నసేవ’ జరిగింది. అన్నదానం అంటాం కదా మనం.. అదే అక్కడ అన్నసేవ. 5,100 మంది భోజనం చేశారు. వారిలో ఎక్కువమంది ‘స్పెషల్లీ ఏబుల్డ్‌’. భోజనానికి కూర్చున్న ఆ ‘స్పెషల్లీ ఏబుల్డ్‌’ అందర్నీ ప్రత్యేక అతిథుల్లానే చూసింది అంబానీ ఫ్యామిలీ. 

పెళ్లయ్యాక వధూవరులు ముంబైలోని వర్లీ ఏరియాలో అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉన్న ‘గులిటా’ భవనంలో జీవితాన్ని ప్రారంభిస్తారు. వజ్రాకృతులతో నిర్మించిన ఆ భవంతిని వరుడి తల్లిదండ్రులు అజయ్‌ పిరమల్, స్వాతి పిరమల్‌ తమ కుమారుడికి పెళ్లి కానుకగా ఇచ్చారు. 64 మిలియన్‌ డాలర్ల విలువైన భవంతి అది. అంటే 460 కోట్ల రూపాయలు. రెండు కుటుంబాల వాళ్లూ ఉన్నవాళ్లే. వధువు తండ్రి ముఖేశ్‌ అంబానీ ‘ఆయిల్‌ అండ్‌ టెలికాం’ టైకూన్‌. వరుడి తండ్రి అజయ్‌ పిరమల్‌ బిలియనీర్‌ ఇండస్ట్రియలిస్ట్‌. అందుకని ఉన్నవాళ్లు కాదు. నలభై ఏళ్లుగా వాళ్లు పెంచుకుంటూ వస్తున్న సంపద వేరే ఉంది. స్నేహం! ఫ్యామిలీ ఫ్రెండ్‌షిప్‌. ఒడిదుడుకుల్లోనూ స్నేహం అనే ఆ ఓడ స్థిరంగా పయనించింది. ఇషా (27), ఆనంద్‌ (33) చిన్ననాటి స్నేహితులు. వాళ్ల కంటే ముందు నుంచీ అంబానీ జంట, పిరమల్‌ జంట.. స్నేహితులు. ముఖేష్‌.. నీతాకు మొదట ‘ఐ లవ్యూ’ చెప్పింది పిరమల్‌ ఇంట్లోనే! ఇప్పుడు అంబానీ తన కూతురి పెళ్లికి ఆకాశం కంటే కూడా పెద్ద పందిరి వేశారు. పిరమల్‌ తన కొడుక్కి కోరుకున్న అమ్మాయిని ఇచ్చి చేస్తున్నాడు. అయితే పిల్లల పెళ్లి కంటే కూడా పెద్ద సెలబ్రేషన్‌ ఇవాళ.. ఆ పెద్దల మధ్య ఉన్న స్నేహమే!  
- మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top