ఎప్పుడూ యంగ్‌ గా

As Always Young - Sakshi

మనిషి అన్ని దశల్లోనూ యౌవనం అత్యంత కీలకం. అందరూ కోరుకునే దశ అది. ఎప్పటికీ నిలుపుకోవాలనే స్థితి అది. యౌవనాన్ని సూచించే తక్షణ అంశాలు ప్రధానంగా రెండు. మొదటిది తెల్లబడే జుట్టు. రెండోది వదులైపోతూ ముడుతలు పడే చర్మం. అందునా ఇలాంటి చలికాలంలో చర్మం ముడుతలు రావడం... అవి మరింత ప్రస్ఫుటంగా కనిపించడం ఎక్కువ.

జుట్టుకు రంగేస్తే అది నల్లబడుతుంది. కానీ చర్మానికి పడే ముడతలను అరికట్టడం ఎలా? చర్మం బిగుతుగా, నిగారింపుతో దీర్ఘకాలం ఉండేలా చేయగలిగితే... మన దేహం మీద యౌవనాన్ని చాలాకాలంపాటు  నిలుపుకోవచ్చు. చర్మంపై ముడుతలు నివారించుకొని, చాలాకాలం పాటు యౌవనంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసుకుందాం.

కాలం గడుస్తున్నకొద్దీ చర్మం మీద  పడే ప్రభావాలకు గల కారణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి... దేహం లోపల అంతర్గతంగా వచ్చే మార్పులకు గల కారణాలు(ఇంట్రిన్సిక్‌). రెండోది బాహ్య కారణాలు(ఎక్స్‌ట్రిన్సిక్‌).

అంతర్గత కారణాలు (ఇంట్రిన్సిక్‌): కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం జన్యువుల్లో ఉంటుంది. కొందరు... తమ ముఫ్ఫై, నలభైల్లో ఉన్నా వాళ్ల వయసు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంటారు. తమలోని అంతర్గత కారణాలతో జరిగే వయసు మార్పులను ‘స్వాభావిక వయసు మార్పులు’ (నేచురల్‌ ఏజింగ్‌) అంటారు. ఈ మార్పు 20లలోనే మొదలవుతుంది. మన చర్మం బిగుతుగా ఉండటానికి అందులో ఉండే కొలాజెన్‌ అనే పదార్థమే కారణం. చర్మ కణాలను ఈ కొలాజెన్‌ గట్టిగా పట్టి ఉంచి, బిగుతుగా కనిపించేలా చేస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మనలో కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. దాంతో చర్మంలో ఉండే ఎలాస్టిసిటీ తగ్గి చర్మం వదులైపోతూ ఉంటుంది. అలాగే వయసు పెరుగుతున్నకొద్దీ మృతకణాలు కూడా పెరుగుతుంటాయి.

వయసు పెరగడం వల్ల చర్మంలో వచ్చే స్వాభావిక మార్పులివి...

►తొలుత చాలా సూక్ష్మమైన ముడుతలు స్కార్స్‌ మాత్రమే వస్తుంటాయి.  (సాధారణంగా నుదుటి మీద ప్రస్ఫుటంగా కనిపిస్తాయి).  
►చర్మం క్రమంగా పారదర్శకమవుతూ ఉంటుంది. (పెద్ద వయసు వారికి చర్మం బాగా పారదర్శకమైపోయి లోపలి రక్తనాళాలు స్పష్టంగా కనిపించడం గమనించవచ్చు).
►దేహంలోని ఇతర ప్రదేశాల్లో ఉండే చర్మం కంటే... అరచేతుల వెనక భాగంలోనూ, మెడ దగ్గర చర్మం తొలుత వదులవుతూ ఉంటుం ది. అందుకే మెడ దగ్గర గీతల వద్ద చర్మం వదులవుతూ కనిపిస్తుంటుంది.
►చర్మం కింద ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుండటంతో చెంపల భాగంలో క్రమంగా గుంట పడుతుంటుంది. ఇక కంటి చుట్టుపక్కల ఉన్న చర్మం కింది కొవ్వు కూడా తగ్గుతూంటుంది.
►మెడ దగ్గర, కంటి కింద ఉన్న చర్మం వదులు కావడం వల్ల భూమ్యాకర్షణ శక్తి కారణంగా అక్కడి చర్మం వేలాడుతున్నట్లు కనిపించడం క్రమంగా మొదలవుతుంది.
►కాలక్రమంలో ఎముక కాస్తంత కురచగా మారడంతో ఎముక చుట్టూ ఉండే చర్మం వదులవుతుంది. అందుకే వయసు పెరిగినవారిలో చేతుల చుట్టూ ఉండే చర్మం వేలాడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది.
►గ్రంథుల సంఖ్య తగ్గడం వల్ల పొడిగా ఉండే చర్మం వారికి దురద ఎక్కువగా ఉంటుంది.  
►స్వేదగ్రంథుల సంఖ్య తగ్గడంతో చెమట తగ్గి శరీరాన్ని చల్లబరిచే గుణం క్రమంగా తగ్గుతుంది.
►శరీరంపై ఉండే వెంట్రుకలు క్రమంగా తెల్లబడతాయి. హార్మోనల్‌ మార్పుల వల్ల  తలపై (మాడు భాగంలో) వెంట్రుకలు కూడా క్రమంగా పలచబడతాయి. ఈ మార్పు స్త్రీ, పురుషులిద్దరిలోనూ చోటుచేసుకుంటుంది.
►ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ తగ్గుదల వంటి మార్పుల కారణంగా మహిళల్లో అవాంఛిత రోమాలు ఎక్కువవుతాయి. అందుకే వయసు పెరిగిన మహిళల్లో ముఖం మీద, చుబుకం కింద వెంట్రుకలు పెరిగి కనిపిస్తాయి.
►గోళ్ల చివర అర్థచంద్రాకారంలో ఉండే తెల్లటి భాగం క్రమంగా మాయమైపోతూ ఉంటుంది.  

బయటి కారణాలు (ఎక్స్‌ట్రిన్సిక్‌ ఏజింగ్‌): వయసు పైబడినట్లుగా కనిపించడానికి అనేక బయటి కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి ఇవి...

సూర్యుడికి ఎక్స్‌పోజ్‌ కావడం : సూర్యరశ్మికి ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల వయసు పైబడినట్లుగా మారడాన్ని ‘ఫొటో ఏజింగ్‌’ అంటారు. సూర్యుడి కిరణాల్లోని హానికారక రేడియేషన్‌కు ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల చర్మం కమిలినట్లుగా మారడం, ప్రెకిల్స్‌ (చిన్న చుక్కల్లా కనిపించే గోధుమ రంగు మచ్చలు), ఏజ్‌ స్పాట్స్, చర్మంపై సన్నటి ముడుతలు కనిపిస్తాయి.

సూర్యరశ్మివల్ల కలిగే ఏజింగ్‌ ప్రక్రియ నివారణకు...

►వీలైనంతవరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి.

►సూర్యరశ్మిలోకి వెళ్లినప్పుడు కిరణాలు చర్మాన్ని నేరుగా తాకకుండా, చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు (లాంగ్‌ స్లీవ్‌ అంటే పొడవు చేతుల చొక్కాల వంటివి) ధరించాలి. మహిళలైతే స్కార్ఫ్‌ కట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

►రోజూ బయటికి వచ్చే ముందర సన్‌స్క్రీన్‌ రాసుకోవాలి. ఎస్‌పీఎఫ్‌ (సన్‌ ప్రొటెక్షన్‌ ఫ్యాక్టర్‌) 30 కంటే ఎక్కువ ఉండే సన్‌స్క్రీన్‌ను ఆరుబయటికి రావడానికి 20 నిమిషాల ముందర చర్మంపై రాసుకోవాలి.  ఇలా బయటికి వచ్చాక కూడా ప్రతి మూడు గంటలకు ఒకమారు సన్‌స్క్రీన్‌ను రాసుకుంటూండాలి. స్విమ్మింగ్‌కు వెళ్తున్నప్పుడు లేదా చాలా ఎక్కువగా చెమట పడుతున్నప్పుడు.. తడికి తట్టుకోగల (వాటర్‌ రెసిస్టెంట్‌) సన్‌స్క్రీన్‌ను వాడాలి.

చికిత్స : సూర్యరశ్మికి గురై నష్టపోయిన చర్మానికి లేజర్‌ టోనింగ్, మైక్రో డర్మా  అబ్రేషన్, డర్మారోలర్,  కెమికల్‌ పీలింగ్, లేజర్‌ రీ–సర్ఫేసింగ్‌ వంటి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా, మీసోథెరపీ, ఫైన్‌ థ్రెడ్‌ లిఫ్టింగ్‌ ప్రక్రియల వంటివి అత్యాధునికమైనవి. ఇక ఇలాంటి చికిత్స కోసం చాలా సమయం వెచ్చించలేనివారికి, త్వరితంగా చికిత్స అందించవచ్చు. అందుకు బొటాక్స్, ఫిల్లర్స్‌ అనే ప్రక్రియలు
కూడా ఉన్నాయి. హైఫూ (హై ఇంటెన్సిటీ ఫోకస్‌ అల్ట్రాసౌండ్‌) టెక్నాలజీతో కూడా ఫేస్‌ లిఫ్ట్‌ చికిత్స చేయవచ్చు.

భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ)కి గురికావడం : మనం ప్రతి నిత్యం భూమ్యాకర్షణ శక్తికి గురవుతూనే ఉంటాం. ఈ ప్రభావం వల్ల మన చర్మం లో కనిపించే మార్పులను 50 ఏళ్లకు పైబడిన వారిలో తేలిగ్గా, స్పష్టంగా చూడవచ్చు. వారిలో చర్మం భూమ్యాకర్షణ శక్తికి లోబడి కిందికి వేలాడుతున్నట్లు కనిపిస్తుంది.

నివారణ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పుష్టికరమైన సమతులాహారం తీసుకోవడం వల్ల ముఖంలోని చర్మం ఎలాస్టిసిటీని కోల్పోకుండా ఉంటుంది. ముఖంపై పడే సన్నటి ముడుతలు (రింకిల్స్‌)ను సరిచేయడానికి బొటాక్స్‌ చికిత్స, చెంపల వద్ద గుంటలు పడటాన్ని ఫిల్లర్స్‌ చికిత్సతో సరిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఫేస్‌లిఫ్ట్‌ ప్రక్రియను ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీలతో సాధించవచ్చు.

నిద్రలో ముఖం పొజిషన్‌ వల్ల కనిపించే ఏజింగ్‌ : మనం నిద్రపోతున్నప్పుడు తలగడపై ముఖాన్ని ఎప్పుడూ ఒక పక్కకు ఒరిగి ఉంచి, పడుకుంటుంటాం. ఇందువల్ల ముఖంపై పడే గీతలు పడతాయి. వీటిని ‘స్లీప్‌లైన్స్‌’ అంటారు. ఇవి ముఖం వాలి ఉన్న వైపునకు ఎక్కువగా ఉంటాయి. దాంతో ముఖంపై గీతలన్నీ ఒక సౌష్ఠవంతో (సిమెట్రికల్‌గా) ఉండవు. దీనివల్ల కూడా వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటుంది. దీన్ని నివారించడానికి ఎప్పుడూ ఒకే వైపు పడుకోకుండా జాగ్రత్త పడాలి.

పొగతాగడం వల్ల : ఈ దురలవాటుతో దేహంలోకి ప్రవేశించే విషపదార్థాల కారణంగా శరీరంలో ఎన్నో జీవరసాయన మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లు తాగేవారిలో 10 ఏళ్ల తర్వాత ముఖం మీద రావాల్సిన ఏజింగ్‌ ముడుతలు పదేళ్ల కంటే ముందుగానే వస్తాయని తెలిసింది. పైగా సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ ముడుతల లోతు పెరుగుతూ పోతుంది.

నివారణకు సంక్షిప్త సూచనలు : మనం సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారంలో రంగురంగుల పండ్లు, కూరగాయలు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. క్యారట్, బీట్‌రూట్, కలర్‌డ్‌ కాప్సికమ్, నిమ్మజాతి పండ్లు, స్ట్రాబెర్రీస్, బొప్పాయి పండ్లు, జామ, పుచ్చకాయల్లో ఏజింగ్‌ను తగ్గించే గుణం ఉంటుంది.  

►క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివల్ల చర్మం దీర్ఘకాలం బిగుతుగా ఉంటుంది.

►రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి.

►మరీ ఎక్కువ వేడినీటితోగానీ, మరీ చల్లగా ఉండే నీళ్లతో గానీ ముఖం కడుక్కోవడం, స్నానం చేయడాన్ని నివారించాలి. స్నానానికి, ముఖం కడుక్కోడానికి గోరువెచ్చని నీటిని లేదా చల్లటి నీటినే ఉపయోగించాలి.

►ప్రతిరోజూ మాయిశ్చరైజర్‌ను వాడాలి.

►ముఖానికి పూసుకునే ఓవర్‌ ద కౌంటర్‌ సౌందర్యసాధనాలను డాక్టర్‌ సలహాలతో మాత్రమే వాడాలి.
డాక్టర్‌ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top