
ఎక్కువ ప్రేమను గానీ, ఎక్కువ ప్రేమల్ని గానీ కోరుకున్నప్పుడే ఆ మనుషుల్లో చోటు సరిపోక ప్రేమ వారిని వదిలిపోతుంది.
లాస్ ఏంజెలిస్‌లో ఒక ఇళయరాజా ఉన్నాడు. నాదబ్రహ్మ. ఆయన శిష్యరికం దొరకడం అదృష్టం. ఏడాదికి ఇద్దరికే అవకాశం. ఆయనే డబ్బులు పెట్టుకుంటాడు. పేరు గిలాడ్.కెనడా నుంచి ఎరిక్ అనే డిగ్రీ చదువుతున్న కుర్రాడు ఆయన శిష్యరికానికి దరఖాస్తు చేసుకున్నాడు. లోకల్ నాదబ్రహ్మ ఆ కుర్రాడు. వచ్చేస్తుందనే స్నేహితులంతా అన్నారు. వచ్చింది. రిజెక్షన్ లెటర్! ఎరిక్ కుమిలిపోయాడు. బాధను అణుచుకుని డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తిచేయడం అతడి కల కాదు. మ్యూజిక్‌లో డిగ్రీ ఎవరైనా చేస్తారు. గిలాడ్ దగ్గర మ్యూజిక్ నేర్చుకోవాలి. అదీ ఒరిజినల్ సర్టిఫికెట్! శిష్యరికం ఎలాగూ పోయింది, సాక్షాత్కారం దక్కినా చాలునని లాస్ ఏంజెలిస్ బయల్దేరి వెళ్లాడు. స్వామివారిని కలిశాడు. జన్మధన్యం అనుకున్నాడు. ‘ఆఫరిస్తే అప్పుడు రాలేదేం?’ అని అడిగాడు గిలాడ్. ఎరిక్ నివ్వెరపోయాడు. ‘రిజెక్ట్ చేశారు కదా గురువుగారూ’ అన్నాడు. ‘నేను రిజెక్ట్ చెయ్యడం ఏంటీ! రమ్మంటే నువ్వే కదా రాలేనని మెయిల్ పంపావు’ అన్నాడు గిలాడ్. ‘లేదు చూడండీ..’ అని తన ఇన్‌బాక్స్ చూపించాడు ఎరిక్. ‘అవునా! ఇదేంటి మరి?’ అని తన ఇన్‌బాక్స్ చూపించాడు గిలాడ్. అప్లికేషన్ రిజక్ట్ అయినట్లు శిష్యుడి బాక్స్‌లో ఉంది. రాలేనని తెలియజేసినట్లు గురువుగారి బాక్సులో ఉంది. అయితే ఆ మెయిల్ ఐడీలు మాత్రం వాళ్లవి కావు! ఈ ‘ఘాతుకానికి’ పాల్పడింది జెన్నిఫర్ అనే అమ్మాయి అని పోలీసు విచారణలో బయటపడింది.
జెన్నిఫర్.. ఎరిక్ క్లాస్‌మేట్. కాలేజీలో అతడిని ప్రేమించిన అమ్మాయి. ఎరిక్ ‘ఇళయరాజా’ దగ్గరికి లాస్ ఏజెలిస్ వెళ్తానంటే నువ్వు లేకుండా ఉండలేనన్న అమ్మాయి. ‘వెళ్తే నామీదొట్టే’ అన్న అమ్మాయి. ఎరిక్ వినలేదు. జెన్నిఫర్ తను చేయాల్సింది తను చేసింది. గిలాడ్ పంపిన ఆఫర్ మెయిల్‌ను ఎరిక్ చూడకుండా డిలీట్ చేసి, అప్లికేషన్‌ని రిజెక్ట్ చేసినట్లు గిలాడ్ పేరు మీద ఎరిక్‌కి మెయిల్ పంపింది. ఇట్నుంచటు కూడా ‘నేను రాలేకపోతున్నాను’ అని ఎరిక్ పేరు మీద గిలాడ్‌కు మెయిల్ పెట్టింది. ఇదంతా తెలిసి ఎరిక్ నిర్ఘాంత పోయాడు. ప్రియురాలిపై కేసు పెట్టాడు. అమ్మాయి అబ్బాయికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల డాలర్ల పరిహారం చెల్లించాలని కోర్టు రెండు రోజుల క్రితమే తీర్పు చెప్పింది.
సంగీతమే తన జీవితం అనుకున్నాడు అతడు. అతడే తన జీవితం అనుకుంది ఆమె. కోరుకున్న దానిని సాధించాలన్న తపన అతడిది. కోరుకున్న వాడిని కోల్పోలేని బలేతనం ఆమెది. గట్టిగా చెయ్యి పట్టేసుకుంది. జీవితంలోని ప్రేమ, ఆపేక్ష ఇలాగే మనిషిని కదలనివ్వకుండా చేస్తాయి. ఆమెది స్వార్థం అనిపిస్తుంది. అతడిని ప్రేమిస్తున్నప్పుడు సంగీతంపై అతడికున్న ప్రేమకు ఆమె అడ్డుపడకూడదు కదా అనిపిస్తుంది. అలాగైతే అతడిదీ స్వార్థమే. ఆమె అంతగా అతడిని ప్రేమిస్తున్నప్పుడు ఆమెను వదిలేసి ఎలా వెళ్లాలనుకుంటాడు? డిగ్రీలో ఉన్నప్పుడే వీళ్లు విడిపోయారు. ఏవో కారణాలు. సంగీతం కాదు. ఈ ఈమెయిళ్లూ అవీ తర్వాత బయట పడినవి. ఎక్కువ ప్రేమను గానీ, ఎక్కువ ప్రేమల్ని గానీ కోరుకున్నప్పుడే ఆ మనుషుల్లో చోటు సరిపోక ప్రేమ వారిని వదిలిపోతుంది. జెన్నిఫర్ అతడి నుంచి ఎక్కువ ప్రేమను కోరుకుంది. ఎరిక్ ఆమె ఒక్క ప్రేమతోనే సరిపెట్టుకోలేకపోయాడు.
– మాధవ్ శింగరాజు