మంచు లంచ్

మంచు లంచ్


మంచి లంచ్ గురించి వినే ఉంటారు.

మీకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి జమ్ము-కశ్మీర్ నుంచి మంచు లంచ్ తెచ్చాం!

ఈ చలికాలం కశ్మీర్‌ని తలచుకుంటూ... వేడి వేడిగా స్టార్టర్స్‌కి టీ అండ్ స్నాక్..

మెయిన్ కోర్స్‌కి నోరూరించే పలావ్.. డెజర్ట్‌లో డ్రైఫ్రూట్ షుఫ్తా..

ఈ త్రీ-కోర్స్ లంచ్ లాగించండి.


 

 

 కెహ్‌వా (కాశ్మీర్ టీ)


దీనిని ముగిలీ ఛాయ్ అని కూడా అంటారు. ఇది కాశ్మీరీయుల తేనీరు.  అతిథులకు ముందు, సూప్ బదులుగా వేడి వేడి తేనేటిని అందిస్తారు. కావల్సినవి: 4 కప్పుల నీళ్లు, చిటికెడు దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ తాజా తేయాకు (పొడి చేయాలి), 2 ఏలకులు, 3 బాదంపప్పులు (పొడి చేయాలి), పంచదార - రుచికి తగినంత. (ఈ టీ లో పంచదారకు బదులుగా తేనెను కూడా కలుపుకోవచ్చు.)

 తయారీ: పాత్ర లేదా టీ కెటిల్‌లో నీళ్లు పోసి, అందులో తేయాకులను వేసి మరిగించాలి. దీంట్లో తగినంత పంచదార, బాదాం, దాల్చిన చెక్క, ఏలకుల పొడులను వేసి కలిపి పైన మూత పెట్టి మరిగించి కప్పులో పోయాలి. టీ తాగేటప్పుడు తేయాకు రావడం ఇష్టపడని వారు ముందుగా తేయాకును వడకట్టుకొని తర్వాత మిగతా పొడులను వేసి మరిగించాలి. దీనిని వేడి వేడిగా సర్వ్ చేయాలి.

 

 యాజి

ఇది కాశ్మీర్ గ్రామీణ ప్రాంత స్నాక్.కావల్సినవి: కేజీ బియ్యప్పిండి, టేబుల్‌స్పూన్ ఉప్పు, పావు కేజీ వాల్‌నట్స్, టేబుల్‌స్పూన్ జీలకర్ర, వాము పొడి, పావు కప్పు ఆవనూనె లేదా రిఫైండ్ ఆయిల్.తయారి: వాల్‌నట్స్‌ను నీళ్లలో వేసి ఉడికించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు, రెండు కప్పుల నీళ్లు, జీలకర్ర, వాము, బియ్యప్పిండి వేసుకుంటూ బాగా కలపాలి. ఈ మిశ్రమం మృదువుగా అవడానికి తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు. కలిపిన పిండి ముద్దను కొద్దిగా తీసుకొని ‘కప్పు’ షేప్(దీనిని యాజి అంటారు) లో చేతులతోనే మౌల్డ్ చేయాలి. ఇలా చేసుకున్నవాటిని నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. వేడిగానూ, చల్లగానూ, టీ తోనూ వీటిని సర్వ్ చేయవచ్చు. కాశ్మీర్‌లో కొన్ని చోట్ల వీటిని ఆవిరిమీద అరగంటపాటు ఉడికిస్తారు.

 

రిస్తా


కావల్సినవి: కేజీ గొర్రె మాంసం, అరకప్పుడు ఆవ నూనె, అర టీ స్పూన్ చొప్పున సోంపు, అల్లంపొడి, పసుపు, కారం, గరం మసాలా, మిరియాలపొడి, దాల్చిన చెక్కపొడి. 2 టేబుల్‌స్పూన్ల తరిగిన ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, చిటికెడు కుంకుమపువ్వు.

 తయారి: పాత్రలో నూనె పోసి వేడయ్యాక వెల్లుల్లి, జీలకర్ర వేగాక, కారం, పసుపు వేసి దీంట్లో లీటర్ నీళ్లు పోసి అల్లంపొడి వేయాలి. బాగా మరిగాక దీంట్లో విడిగా వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి కలపాలి. ఈ నీళ్లు మరుగుతుండగా మెత్తటి మటన్ బాల్స్ వేసి సన్నని మంటమీద అరగంటపాటు ఉడికించాలి. మాంసం ఉడికి, గ్రేవీ చిక్కగా అయ్యాక అందులో ఏలకులు, దాల్చిన చెక్క పొడి, గరంమసాలా, కుంకుమపువ్వు వేసి స్టౌ సిమ్‌లో ఉంచి మరో ఐదు నిమిషాలు ఉంచాలి. వేడి వేడిగా ఈ రిస్తాను భోజనంలోకి వడ్డించాలి.

 

కాశ్మీరీ పులావ్


కావల్సినవి: 3 కప్పుల బాస్మతీ బియ్యం, ఐదున్నర కప్పుల నీళ్లు, అర కప్పుడు వెన్నతీయని పాలు(హోల్‌మిల్క్), టేబుల్ స్పూన్ నిమ్మరసం, 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి లేదా బటర్, 3 ఏలకులు, 3 లవంగాలు, 2 అంగుళాల దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అర కప్పుడు సన్నగా తరిగిన క్యారట్ ముక్కలు, అరకప్పుడు పచ్చి బఠాణీలు, పావుకప్పు పైనాపిల్ ముక్కలు, పావుకప్పు దానిమ్మ గింజలు, 8 పిస్తాపప్పు, పావుకప్పు కిస్‌మిస్, ఒక కట్ట ఉల్లికాడలు



తయారి: బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి. వెడల్పాటి పెద్ద పాత్ర లేదా నాన్‌స్టిక్ పాన్‌ను మీడియమ్ హీట్‌లో ఉంచి అందులో బటర్ వేసి వేడి చేయాలి. దీంట్లో ఏలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసి కొద్దిగా వేయించాలి. దీంట్లో వడకట్టిన బియ్యం వేసి కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత నీళ్లు, పాలు పోసి కలపాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి కలపాలి. పైన నిమ్మరసం వేసి కలపకుండానే బియ్యాన్ని ఉడికించాలి. పైన మూతపెట్టి మీడియమ్ హీట్ ఉంచి ఉడికించాలి. పూర్తిగా ఉడికిందా లేదా సరిచూసుకొని, మంట తీసేయాలి. క్యారట్ ముక్కలు, పచ్చబఠాణీ, పైనాపిల్, నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉడికిన అన్నంలో వేసి కలపాలి. వేడి వేడిగా వడ్డించే ముందు దానిమ్మ గింజలు, సన్నగాతరిగిన ఉల్లికాడలతో పైన గార్నిష్ చేయాలి. కావాలనుకుంటే వాల్‌నట్స్, బాదంపప్పులు, ఆపిల్ ముక్కలు, ద్రాక్ష పండ్లు గార్నిష్‌గా వాడుకోవచ్చు.

 

 శుఫ్తా డిజర్ట్

 కాశ్మీరీ సంప్రదాయ వంటకాలలో చివరలో తప్పక ఉండే స్వీట్ ఇది. రకరకాల డ్రై ఫ్రూట్స్‌ని కొద్దిగా పంచదార పాకంతో కలిపి తయారుచేస్తారు.కావల్సినవి: ఎండు ఖర్జూరం, ఎండుకొబ్బరి, బాదంపప్పు, పిస్తా, జీడిపప్పు వాల్‌నట్స్... ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అరకప్పు చొప్పున, అరకప్పు నెయ్యి, 2 కప్పుల పంచదార, టీస్పూన్ మిరియాల పొడి, అల్లం తరుము, ఏలకుల పొడి, చిటికెడు కుంకుమ పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ఎండు గులాబీ రేకలు. తయారి: డ్రై ఫ్రూట్స్ అన్నీ తగినన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టాలి. వడకట్టి మరో పాత్రలోకి తీసుకోవాలి. ఖర్జూరాలను సన్నగా తరిగి గింజలు తీసేయాలి. పాన్‌లో నెయ్యి వేసి వేడి చేసి కొబ్బరిని ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలను ప్లేట్‌లోకి తీసుకొని, అదే నెయ్యిలో పనీర్ ముక్కలు వేసి వేయించాలి. దాంట్లో నీళ్లన్నీ ఆరిపోయాక డ్రై ఫ్రూట్స్ వేయాలి. తర్వాత కొబ్బరి ముక్కలు, పంచదార, మిరియాలపొడి, ఏలకుల పొడి, అల్లంపొడి, దాల్చిచెక్క పొడి, కుంకుమపువ్వు, గులాబీ రేకలు వేసి పంచదార అంతా కరిగేవరకు వేడి మీద ఉంచాలి. వెంటనే దించి సర్వ్ చేయాలి.

 

డా.బి.స్వజన్

మినిస్ట్రీ ఆఫ్ టూరిజమ్ (ఐఐటిటిఎమ్)

భువనేశ్వర్

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top