సీపీఐకి కాంగ్రెస్ రెబెల్స్ బెడద | rebels for cpi | Sakshi
Sakshi News home page

సీపీఐకి కాంగ్రెస్ రెబెల్స్ బెడద

Apr 13 2014 1:35 AM | Updated on Mar 18 2019 9:02 PM

సీపీఐకి కాంగ్రెస్ రెబెల్స్ బెడద - Sakshi

సీపీఐకి కాంగ్రెస్ రెబెల్స్ బెడద

తమ ఎజెండాను పక్కనపెట్టి మరీ పొత్తు పెట్టుకున్న సీపీఐకి కాంగ్రెస్ గట్టి ఝలక్ ఇచ్చింది.

సాక్షి, హైదరాబాద్: తమ ఎజెండాను పక్కనపెట్టి మరీ పొత్తు పెట్టుకున్న సీపీఐకి కాంగ్రెస్ గట్టి ఝలక్ ఇచ్చింది. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన ఏడు స్థానాల్లో మూడుచోట్ల ఆ పార్టీకి కాంగ్రెస్ రెబెల్స్ నుంచి బెడద తప్పలేదు. వారిని ఉపసంహరింపచేయాలని సీపీఐ నాయకత్వం కాంగ్రెస్‌ను కోరినా ఫలితం లేకపోయింది. నిజానికి ఒప్పందం మేరకు తొమ్మిది స్థానాలను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించాలి. కానీ అభ్యర్థుల ప్రకటన వెలువరించేనాటికి రెండు స్థానాలకు కోత విధించింది. తీరా నామినేషన్లు దాఖలు నాటికి మరో స్థానానికి ఎసరు పెట్టింది.
 
 పొత్తులో భాగంగా సీపీఐకి వదిలిన స్థానాల్లో రెబెల్స్ బరిలో దిగకుండా అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ పెద్దలు ఏకంగా మహేశ్వరం నియోజకవర్గానికి తమ పార్టీకి చెందిన మల్‌రెడ్డి రంగారెడ్డికి బీ-ఫారం అందజేసేసరికి కమ్యూనిస్టులు కంగుతిన్నారు. దీనిపై నష్టనివారణ చర్యల కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. రెబెల్స్ నామినేషన్లను ఉపసంహరింపచేయాలని టి-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. మహేశ్వరం విషయంలో కొన్ని షరతులతో బీ-ఫారం అందజేశామని, బరిలో నుంచి మల్‌రెడ్డి తప్పుకునేలా చేస్తామని పొన్నాల ప్రకటించినా ఆ ప్రయత్నం జరగలేదు. మరోవైపు పొత్తులో భాగంగా కేటాయించిన మునుగోడు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ రెబెల్స్ బరిలోనే ఉన్నారు. మునుగోడులోనైతే ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధ్దన్‌రెడ్డి కుమార్తె స్రవంతి బరిలో నిలిచారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ నేత చినుముల శంకర్ పోటీనుంచి తప్పుకోలేదు. వీరిని బరినుంచి తప్పించేందుకు సీపీఐ నేతలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సీపీఐ నాయకత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement