జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు తిక్క ఉందిగానీ లెక్క లేదని టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విమర్శించారు.
నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు తిక్క ఉందిగానీ లెక్క లేదని టీఆర్‌ఎస్ లోక్‌సభ అభ్యర్థి కల్వకుం ట్ల కవిత విమర్శించారు.సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరెట్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఉద్యమంలో అన్ని పార్టీలను, వ్యక్తులను కలుపుకుని పోరాటం చేశామని అన్నారు. ప్రస్తుత బీజేపీ లోక్‌సభ్య అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తరపున గత ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించామన్నారు. ఆయితే ఆయన ఎప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొన లేదన్నారు. నిజామాబాద్ నగరాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చిందన్నారు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అధికారంలో ఉండగా ఒరగబెట్టింది ఏమి లేదన్నారు. 2004లో కరీంనగర్ సభలో తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసిన సోనియా బలిదానాలు జరుగుతున్నా పది సంవత్సరాలు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ తూడ్చుకు పెట్టుకుపోయే ప్రమాదం ఉందని గ్రహించి తెలంగాణ ఇచ్చారని పేర్కొన్నారు. తెలంగాణలో 16 మంది ఎంపీలను గెలిపిస్తే చట్టం తీసుకొచ్చి ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకుని ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని కోరారు.