నేటితో ప్రచారానికి తెర


కొరిటెపాడు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి సోమవారంతో తెరపడనుంది. రాజకీయ పార్టీల మైకుల మోతతో హోరెత్తిన పల్లెలు, పట్టణాలు సోమవారం సాయంత్రం ఐదు గంటలతో మూగబోనున్నాయి. గత నెల 23వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ పూర్తయిన తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. పోటాపోటీగా ర్యాలీలతో హోరెత్తించారు. ఇప్పటి వరకు ఇంటింటికి తిరుగుతూ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్ళి పోస్టర్లు, కరపత్రాలు పంచుతూ తమకు ఓటేయాలని, మీ సమస్యలు తీరుస్తానని హామీలు గుప్పించారు. వాహనాలకు మైకులు అమర్చి, ప్లెక్సీలు ఏర్పాటు చేసి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు ముమ్మర ప్రచారం చేశారు. జిల్లాలో అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రచారం నిర్వహించారు.

 

 వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సోదరి షర్మిల, పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబునాయుడు, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ, ఆ పార్టీ నాయకులు చిరంజీవి, రఘువీరారెడ్డి, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్‌కల్యాణ్, లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్‌నారాయణ, సీపీఎం తరఫున సీతారాం ఏచూరి, బి.వి.రాఘవులు వంటి నాయకులంతా ప్రచారంలో పాలుపంచుకున్నారు. వీరేగాకుండా సినీపరిశ్రమకు చెందిన పలువురు సైతం టీడీపీ, వైఎస్సార్‌సీపీ తరఫున ప్రచారం చేపట్టారు. సోమవారం చివరి రోజు కావటంతో అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులతో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు పర్యటించని ప్రాంతాలను ఎంపిక చేసుకొని ప్రచారం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top