Sakshi News home page

చంద్రబాబుకు ఇంట్లో ఈగల మోత!

Published Sat, Apr 19 2014 2:13 PM

చంద్రబాబుకు ఇంట్లో ఈగల మోత! - Sakshi

చంద్రబాబు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. ముందు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు మొండి చేయి చూపారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచేశారు. టిక్కెట్ల కేటాయింపులో కార్పొరేట్ లాబీయింగ్‌కే పెద్ద పీట వేశారన్న ఆగ్రహం పెల్లుబుకుతోంది. అందుకే టీడీపీలో ఇప్పుడు అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. దీంతో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

చాలా చోట్ల టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరి రోజున నామినేషన్‌ను దాఖలు చేయడానికి సిద్ధమవుతోండడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. పార్టీ విధేయత, కష్టపడ్డనేతలకు గుర్తింపు  ఇవ్వకుండా డబ్బే అర్హతగా పార్టీ టికెట్లు కేటాయిస్తుండటంతో వారు ఆవేదన చెందుతున్నారు.

లింగారెడ్డికి మొండి చేయి: పార్టీలోకి కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్‌ను  కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం పార్టీ ప్రచార సామగ్రిని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన శనివారం చంద్రబాబును కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి పడాల అరుణ కూడా కన్నీరు పెట్టుకునే స్థితి వచ్చింది.

మంగళగిరి కిరికిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ తమ్ముళ్ళ ఆగ్రహం పతాకస్థాయికి చేరింది. స్థానికేతరుడైన తులసీరాంప్రభుకు టికెట్‌ కేటాయించి ఆ తరువాత స్థానిక నేత గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. ఇదీ నచ్చని పార్టీ కార్యకర్తలు ఆయన్ను రూములో బంధించి, నామినేషన్ వేయనీయకుండా చేసేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసుల సాయంతో ఆయన బయటపడ్డారు.

ముద్దరబొయినకు టికెట్ పై మండిపాటు: టికెట్లు కేటాయింపుల విషయంలో కృష్ణా జిల్లా కైకలూరులో ఓ మహిళ స్వయంగా చంద్రబాబునే నిలదీశారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ శాపనార్థాలు పెట్టారు.  నూజివీడులో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఆ పార్టీ జిల్లా, స్థానిక నాయకత్వాలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వొద్దని కోరినా అధినేత ఆయనకే కట్టబెట్టడంపై ఆ పార్టీశ్రేణులు భగ్గుమంటున్నాయి.


ఇటు బిజెపికి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థుల చేత ముందు నామినేషన్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు వాటిని ఉపసంహరించుకొమ్మని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ లీడర్లు, వారి క్యాడర్లు కూడా మండిపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకి ఇంట్లో ఈగల మోత అన్నట్టుంది.

Advertisement

What’s your opinion

Advertisement