చంద్రబాబు..ఓ చెల్లని ఓటు!

చంద్రబాబు..ఓ చెల్లని ఓటు! - Sakshi


తాను బీజేపీకి ఓటేశానని బహిరంగంగా చెప్పిన బాబు

 

ఇలా చెప్పటం నిబంధనలకు విరుద్ధమన్న భన్వర్‌లాల్

బాబు ఓటు చెల్లదని మీడియాలో రావటంతో టీడీపీ మండిపాటు

భన్వర్‌లాల్‌తో వాగ్వాదం; ఆయనకు దురుద్దేశాలు అంటగట్టిన తీరు


 

 , హైదరాబాద్: బుధవారం ఉదయం... జూబ్లీహిల్స్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ పోలింగ్ బూత్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఓటు వేశారు. భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్, కోడలు బ్రహ్మణితో కలిసి ఓటేసి బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడారు. ‘‘పొత్తు ధర్మంలో భాగంగా రెండు ఓట్లూ బీజేపీకే వేశా. కమలం గుర్తుపై వేశా. ఈసారి ఇక్కడ మా సైకిల్ గుర్తు లేకపోవటం కొంత బాధ కలిగించింది. కానీ పొత్తులున్నపుడు ఇలాంటివి సహజమే. తొలిసారిగా సైకిల్‌కు ఓటు వేయలేకపోయా’’ అన్నారు. నిజానికి ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారెవరూ తామెవరికి ఓటేశామనేది చెప్పరు. ఎన్నికల నిబంధనలు కూడా ఓటు గోప్యతను కాపాడాలనే చెబుతున్నాయి. పైగా తాను ఒక గుర్తుకు ఓటేశానని మీడియా ముఖంగా చెప్పటమంటే అది ఇతరులను కూడా ఆ గుర్తుకు ఓటేయమంటూ ప్రేరేపించటమే. ఇలా ప్రచారం చేయటాన్ని ఎన్నికల నిబంధనలు కూడా నిషేధిస్తున్నాయి. మరి ఒక పార్టీకి అధ్యక్షుడు, 1989 నుంచీ కుప్పంలో పోటీచేస్తూ ఎన్నికల రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి ఈ మాత్రం తెలియదా? తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, చాలా అనుభవం ఉందని చెప్పే చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై కనీస అవగాహన లేదనేది మరోసారి బయటపడింది. రామోజీవంటి మీడియా ముసుగు తొడుక్కున్న ఎజెండాకారులే బాబును నడిపిస్తున్నారనేది మరోసారి తేటతెల్లమయింది. బాబు ఈ రకంగా అవగాహన లేకుండా ప్రవర్తించటం టీడీపీ నేతల్ని సైతం ఇబ్బందుల్లో పడేసింది.



 బాబు వ్యాఖ్యలను ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ వద్ద కొందరు మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా... అలా ఎవ్వరూ చేయకూడదని, ఎవరు చేసినా వారి ఓటు చెల్లనిదేనని ఆయన స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ఓటు చెల్లదంటూ టీవీ చానెళ్లలో ప్రసారం కావటంతో టీడీపీ నాయకులు టీడీ జనార్ధన్‌రావు, న్యాయ విభాగం అధ్యక్షుడు రవీందర్‌కుమార్ తదితరులు భన్వర్‌లాల్ దగ్గరకు వెళ్లి ఆయనపై ఒత్తిడి తేవడానికి ప్రయత్నించారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, ఆ విషయం మీడియాకు చెప్పాలని ఒత్తిడి చేశారు. ‘‘మీరు మా పార్టీ నాయకుడికి అప్రతిష్ట తెచ్చేలా మీడియాకు సమాచారమిచ్చారు. మీ కార్యాలయం సమాచారం లీకవుతోంది. మీరు సరిగా వ్యవహరించటం లేదు’’ అంటూ వారు సీఈఓ తోనే వాగ్వాదానికి దిగారు. వీరి తీరుపై భన్వర్‌లాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘నా 34 ఏళ్ల సర్వీసులో మీలాంటి నాయకుల్ని ఎక్కడా చూడలేదు. ఇదేనా మీ పార్టీ ప్రవర్తన? ఇలాగే ఉంటుందా? ఇది నిస్సందేహంగా తప్పుడు సంప్రదాయం. ఓటు రహస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఓటర్లు అందరిపై ఉంది. ఒక పెద్ద మనిషి తానెవరికి ఓటేసిందీ చెప్పటం ఎన్నికల నిబంధనకు వ్యతిరేకం. అలా చేయడం ఓటర్లను ప్రభావితం చేయడమే. 1961 ఎన్నికల నిర్వహణ చట్టంలోని సెక్షన్ 39 ప్రకారం ఓటేసిన వ్యక్తులెవరూ తమ ఓటు రహస్యాన్ని బహిర్గతం చేయడానికి వీల్లేదు. ఒక పెద్ద మనిషి అలా చేయొచ్చా..? అయినా నేను చెప్పినదాంట్లో తప్పేముంది? మీడియాలో వేరుగా వస్తే మీరు ఖండించుకోండి.



నేనెందుకు వివరణివ్వాలి? వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన నాయకులు ప్రవర్తించే విధానం ఇదేనా? మీ పార్టీ ప్రవర్తన ఇదా’’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పారుతోందని తాము ఎన్నికల సంఘానికి చెప్పినా స్పందించలేదని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయగా..‘‘ దేశంలో పట్టుబడిన నగదులో 65 శాతం, 85 శాతం మద్యాన్ని ఇక్కడే పట్టుకున్నాం. అయినా ఎన్నికల సంఘం పనిచేయడం లేదంటే ఎలా? నేను వివక్ష చూపిస్తున్నట్లు మీరు భావిస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకోండి’’ అని చెప్పారు. ఆనక వినతి పత్రం తీసుకుని... పరిశీలిస్తామని చెప్పారు. ఈ సంఘటన అనంతరం టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేస్తూ... భన్వర్‌లాల్ ప్రకటనను ఖండిస్తున్నామన్నారు. తమ నేత పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల అవతలే మాట్లాడారని చెప్పారు. కాగా ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం డి ప్యూటీ కమిషనర్లు వినోద్ జుస్తి, అలోక్ శుక్లా వద్ద విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించగా... ‘‘బయటకు చెప్పకూడదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే దాన్ని చెల్లని ఓటుగా ప్రకటించాలని మాత్రం లేదు. ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నాం’’ అని వివరణ ఇచ్చారు.



 బాబుపై చర్య తీసుకోండి: వైఎస్సార్‌సీపీ



 చంద్రబాబునాయుడును ఎన్నికల్లో అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు భన్వర్‌లాల్‌ను కోరారు. బాబు తీరుపై వైఎస్సార్‌సీపీ నాయకులు శివకుమార్, నాగేశ్వరరావు తదితరులు బుధవారం రాత్రి సీఈఓను కలిపి ఫిర్యాదు చేశారు.

 

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top