టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా రైతులను పట్టించుకోలేదని మాజీమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా రైతులను పట్టించుకోలేదని మాజీమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. అతను ఒక దండగమారి బాబు అని, ఆయన చెప్పే కళ్లబొల్లి మాటలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్రజాగర్జన సభలో చంద్రబాబు చేసిన అవాస్తవపూరిత ప్రసంగంపై ధ్వజమెత్తారు. ఆయన ఇచ్చిన హామీలన్నీ అమలకు నోచుకోని విధంగా ఉన్నాయన్నారు. కేవలం అధికారదాహంతో పదవిని అందిపుచ్చుకోవడానికి మోసపూరిత మాటలు చెప్పారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు కేవలం టీడీపీకి చెందిన వారికి మాత్రమే లబ్ధి చేకూరేలా చేశారన్నారు. మనది వ్యవసాయక రాష్ట్రమని, 2001, 02, 03లో వర్షాలు లేక, కరువొచ్చి రైతులు పూర్తిగా నష్టపోతే ఆత్మహత్యలు చేసుకున్నా, ఉళ్లకు ఊళ్లను జనం ఖాళీ చేసి వలస పోయినా వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున ఏఒక్క సంక్షేమ పథకమూ ప్రకటించలేదన్నారు.
రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని బాబు ఇపుడు ఆదుకుంటానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన సీఎంగా ఉన్న హయాంలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదన్నారు. ఆమదాలవలసలో ఉన్న చక్కెర పరిశ్రమను కారుచౌకగా అమ్మేసి అందులో పనిచేస్తున్న 500 కార్మికులను వీధిన పడేశారన్నారు. అలాంటి వ్యక్తి ఇపుడు సీమాంధ్రను సింగపూర్ చేస్తానని హామీలు గుప్పించడం శోచనీయమన్నారు.
‘అప్పనంగా భూములు కేటాయించారు’
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఐఎంజీ సంస్థకు 500 ఎకరాలు ఏ ప్రాతిపదికన కేటాయించారో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. కోట్లాది రూపాయల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. దీనిపై సీబీఐచే దర్యాప్తు చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. మమ్మల్ని అనకొండ అనే హక్కు ఆయకు లేదన్నారు.
ప్రతిపక్ష నేతగా కూడా చంద్రబాబు పూర్తిగా విఫలం చెందారని ధర్మాన అన్నారు. రాష్ట్ర విభజనతో తెలుగు ప్రజలు నష్టపోతారని తెలిసీ కూడా అధికార పక్షంతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. బాబుకు కనీస అవగాహన లేకపోవడం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని, ఇటువంటి వ్యక్తికి పట్టం కడితే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు.
వైఎస్సార్‌సీపీదే అధికారం
ఏ సర్వే చూసినా రాష్ట్రంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని ధర్మాన అన్నారు. నిల్సన్ మార్గ్ సర్వేలో వైఎస్సార్‌సీపీకి సీమాంధ్రలో 135 సీట్లు వస్తాయని వెల్లడైన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సొంతంగా అధికారంలోకి రాలేమని తెలిసే చంద్రబాబు ఇతర పార్టీలతో పొత్తుకు వెంపర్లాడుతున్నారని విమర్శించారు.
అధికారంలోకి వాస్తమని చంద్రబాబుకు నమ్మకం ఉంటే ఇతర పార్టీలతో పొత్తుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు.టీడీపీ బలహీనంగా ఉండబట్టే బీజేపీతోపాటు మరికొన్ని పార్టీలతో పొత్తుకు చంద్రబాబు ఆరాటపడుతున్నారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ స్పష్టమైన ఆధిక్యతతో అధికారంలోకి రావడం, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.