పురం కోటకు బీటలు


సాక్షి, అనంతపురం : అనుకున్నదొక్కటి..అయ్యిందొక్కటైంది నందమూరి బాలయ్య పరిస్థితి. హిందూపురం టీడీపీ కంచుకోటగా భావించి ఇక్కడి నుంచి బరిలోకి దిగిన బాలకృష్ణకు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది.

 

 ఈ సారి గడ్డు పరిస్థితి తప్పదని తెలియడంతో తెగ హైరానా పడిపోతున్నారు. పరువు కాపాడుకోవడం కోసం భారీగా డబ్బు ఎర వేసేందుకు ప్రణాళిక వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఈనెల 19న నామినేషన్ వేసిన బాలకృష్ణ.. రెండ్రోజులు ప్రచారం చేశారు. ఆ తర్వాత సీమాంధ్రలో ప్రచారం చేసేందుకు వెళ్లిపోయారు. షెడ్యూల్ ప్రకారం మే 2న బాలయ్య హిందూపురం రావాల్సి ఉంది. అయితే స్థానిక నేతలు నాలుగు గ్రూపులుగా విడిపోయారు. మూడ్రోజుల క్రితం బాలయ్య తరఫున ప్రచారానికి వచ్చిన తారకరత్న కూడా జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నారు.

 

 ఈ క్రమంలో తనకు గడ్డు పరిస్థితి తప్పదని భావించిన బాలయ్య పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. శుక్రవారం జిల్లాకు వస్తున్న బాలయ్య.. వచ్చీరాగానే హిందూపురంలో ప్రచారంలో పాల్గొంటే ఇతర సంకేతాలు వెళ్తాయన్న భావనతో ముందుగా రాప్తాడు, పుట్టపర్తి, మడకశిర నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహించి రాత్రికి హిందూపురం చేరుకోనున్నారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ మేరకు స్థానిక నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పార్టీలో తిరుగుబాటు అభ్యర్థులతో పాటు నిన్నమొన్నటి వరకు టీడీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ విజయం కోసం కృషి చేస్తామని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఇందులో భాగంగానే పల్లా ఆదిశేషుతో పాటు బీజేపీలో ఉంటూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన గోపాల్, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్లు వెంకటరాముడు, జయప్ప తదితరులు వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతు తెలిపారు.

 

 ఒక్కొక్కరు వైఎస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతుండడంతో నవీన్ నిశ్చల్ విజయావకాశాలు మరింత పెరుగుతున్నాయి. కాగా ఇప్పటికే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు టీడీపీ నేతలు కోస్తా ప్రాంతం నుంచి ఓ బృందాన్ని హిందూపురం పంపి ప్రత్యేకంగా సర్వే చేయించినట్లు తెలిసింది. పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో తేలడంతో బాలయ్య గుండెల్లో గుబులు పట్టుకున్నట్లు సమాచారం. అందుకే హుటాహుటిన హిందూపురం వస్తున్నట్లు తెలిసింది. కాగా ఎన్నికల వేళ భారీగా డబ్బు పంపిణీ చేసేందుకు టీడీపీ నేతలు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బును హైదరాబాద్ నుంచి హిందూపురానికి ఇటీవల ఓ ట్రాన్స్‌పోర్ట్ లారీలో చేరవేసినట్లు సమాచారం.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top