ఏపీ హిస్టరీ | A P History | Sakshi
Sakshi News home page

ఏపీ హిస్టరీ

Nov 11 2013 10:23 PM | Updated on Sep 4 2018 5:07 PM

ఏపీ హిస్టరీ - Sakshi

ఏపీ హిస్టరీ

దక్షిణ భారతదేశ చరిత్ర మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల పతనానంతరం మహమ్మదీయుల తాకిడి నుంచి సుమారు రెండున్నర శతాబ్దాల పాటు హిందూ మత, సంస్కృతులను కాపాడిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి దక్కుతుంది.

విజయనగర సామ్రాజ్యం - విశిష్టత  
 - రాజవంశాలు

 దక్షిణ భారతదేశ చరిత్ర మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల పతనానంతరం మహమ్మదీయుల తాకిడి నుంచి సుమారు రెండున్నర శతాబ్దాల పాటు హిందూ మత, సంస్కృతులను కాపాడిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి దక్కుతుంది. ఈ యుగం హిందూమత పునర్జీవనానికి స్ఫూర్తినిచ్చింది. రెండున్నర శతాబ్దాలపాటు జరిగిన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలు తర్వాత కాలంలో జరిగిన చరిత్రను ప్రభావితం చేయడమే కాకుండా దక్కనులోని మరాఠా ఉద్యమాన్ని కూడా ప్రభావితం చేసింది. విజయనగర రాజులు బహమనీలతో నిరంతర పోరాటాలు చేయడం వల్ల, బహమనీ సుల్తానులు ఉత్తర భారతదేశం వైపు తమ దృష్టిని సారించలేకపోయారు. బహమనీలు ఢిల్లీని ఆక్రమించి ఉంటే భారతదేశ చరిత్రలో మొగలు సామ్రాజ్యం అనుమానాస్పదమై ఉండేదని చరిత్రకారుల భావన. విజయనగర రాజులు దాక్షిణాత్య భాషా సారస్వతాలను, శిల్ప, సంగీత కళలను పోషించి దాక్షిణాత్యులందరికీ ఆదర్శంగా నిలిచారు.
 
 విజయనగర సామ్రాజ్య స్థాపన
 
 విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1336 లో సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు అనే సోదరులు తుంగభద్రా నదీ తీరంలో మాధవ విద్యారణ్యస్వామి సహకారంతో స్థాపించారు. వీరు ప్రారంభంలో కాకతీయ ప్రతాపరుద్రుడి కొలువులో కోశాగార ఉద్యోగులుగా ఉండేవారు. క్రీ.శ. 1323లో కాకతీయ రాజ్యాన్ని మహమ్మద్‌బిన్ తుగ్లక్ ఆక్రమించడంతో హరిహర బుక్కరాయలు కర్ణాటకలో ‘కంపిలి’ రాజ్యానికి వలస వెళ్లారు. బళ్లారి, చితల్‌దుర్‌‌గ, రాయచూరు, ధార్వాడ ప్రాంతాలు కంపి లి రాజ్యంలో ఉండేవి. ఆనెగొంది, కంపిలికి మాలిక్‌నెచి పాలకుడిగా ఉండేవాడు. స్థానికులు అతడిపై తిరుగుబాటు చేయడం వల్ల, మహ్మద్‌బిన్ తుగ్లక్ హరిహర-బుక్కరాయలను తన పాలకులుగా నియమించాడు. కాలక్రమంలో క్రీ.శ. 1336-1340 మధ్య హరిహర-బుక్కరాయలు ఢిల్లీ సుల్తానులను ధిక్కరించి, స్వతంత్ర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ముస్లింలపై విజయ సూచకంగా విజయనగరమని, విద్యల నగరంగా పేరొందడం వల్ల విద్యానగరమని చరిత్రలో ప్రసిద్ధి చెందింది.
 చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు
 
 విజయనగర సామ్రాజ్య స్థాపన విషయంలో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. విజయనగర రాజ్య నిర్మాత హోయసాల రాజు మూడో వీరభల్లాలుడని, ఫెరిస్టా రచన ఆధారంగా రెవరెండ్ ఫాదర్ హెరాస్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయాన్ని కృష్ణస్వామి అయ్యంగారు, హెచ్.కృష్ణశాస్త్రి, పి.బి.దేశాయ్ మొదలైన పండితులు అంగీకరించారు. వీరి సిద్ధాంతం ప్రకారం.. సంగముడికి, హరిహర, బుక్క, కంపన, మారప్ప, ముద్దప్ప ఐదుగురు కుమారులున్నారు. వీరు మూడో భల్లాలుడి కొలువులో ఉండేవారు. మూడో భల్లాలుడి మరణానంతరం హరిహర బుక్కరాయలు స్వతంత్రించారు.

శ్రీనాథుడు మొదలైన తెలుగు కవులు విజయనగరాన్ని ‘కన్నడ రాజ్యలక్ష్మి’ అని, కృష్ణదేవాయల్ని ‘కర్ణాటక్షితిపాల’ అని సంబోధించినందువల్ల విజయనగర స్థాపకులు (సంగములు) కన్నడవారని వారి అభిప్రాయం.
 విజయనగర వైభవాన్ని వెలుగులోకి తెచ్చిన అమెరికా రచయిత ‘రాబర్‌‌ట సూయల్’ తన విస్మృత విజయనగర సామ్రాజ్యం (ధి ఫర్‌గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర్) ప్రకారం.. హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య నిర్మాతలని తెలుస్తోంది. వీరు ‘కురుబ తెగకు చెందినవారని, ఓరుగల్లు ప్రతాపరుద్రుడి కోశాగార ఉద్యోగులని కూడా ఆ గ్రంథం పేర్కొంటోంది. క్రీ.శ. 1323 ఓరుగల్లు పతనంతో ఆనెగొంది రాజులనాశ్రయించి, క్రమేణా స్వతంత్ర రాజ్యం స్థాపించారని రాబర్‌‌ట సూయల్ నిర్ణయించాడు. ఆయన  అభిప్రాయాలతో అత్యధిక చరిత్రకారులు ఏకీభవిస్తున్నారు.
 సంస్కృత, కన్నడ, ఆంధ్రభాషల్లోని స్థానిక చరిత్రలు, బర్ని, ఇసామీ, మహమ్మదీయుల చరిత్రకారుల, న్యూనిజ్ రచనలు, శాసనాలను సమన్వయం చేసి, డాక్టర్ నేలటూరు వెంకటరమణయ్య... హరిహర బుక్కరాయలు ఆంధ్రులేనని నిర్ధారించారు. వీదిద్దరూ, కాకతీయ ప్రతాపరుద్రుడి సేనానులని, మంగళ నిలయవాసి సంగముడి కుమారులని పేర్కొన్నారు. సంగములు నాచన సోమనాథుడు అనే  తెలుగు కవిని పోషించారు. మొదటి బుక్కరాయలి కోడలు గంగాంబ తన మధురావిజయం కావ్యంలో ప్రతాపరుద్రుడి ఆస్థాన కవులైన అగస్త్యుడు, విశ్వనాథుడు, కవిబ్రహ్మ తిక్కనను కూడా ప్రస్తావించింది. ఈ అంశాల ప్రకారం సంగమ వంశస్థులు తెలుగువారని, వారికి ఓరుగల్లుతో సంబంధం ఉందని తెలుస్తోంది.
 రాజకాల నిర్ణయం, శివతత్త్వ రత్నాకరం అనే గ్రంథాలు.. హరిహర బుక్క సోదరులను ప్రతాపరుద్రుడి ఉద్యోగులని వర్ణిస్తున్నాయి. విద్యారణ్య వృత్తాంతం అనే గ్రంథం సంగముడిని మంగళనిలయాధిపతి అని పేర్కొంటోంది. హరిహర-బుక్కరాయ సోదరులు ఆంధ్రులేనని, వెంకట రమణయ్యగారు నిరూపించారు.
 
 కాలజ్ఞాన గ్రంథాలు - సాహిత్యం
 
 ఇవి ఆయా రాజుల కాలాన్ని వివరించాయి. చరిత్ర రచనకు విలువైన సమాచారాన్ని అందించాయి. విద్యారణ్యుడు రాసిన  కాలజ్ఞానంలో విజయనగర రాజుల చరిత్ర వివరాలున్నాయి. విద్యారణ్యుడి వృత్తాంతం అనే గ్రం థం... విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి చెబుతూ కొందరి రాజుల పేర్లు పేర్కొంది.
 సాహిత్యపరంగా ఒకటో రాజనాథ డింఢిముడు రచించిన సాళువాభ్యుదయం, రెండో రాజనాథ డింఢిముడు రచించిన అచ్యుతరామాభ్యుదయం, అరుణ గిరినాధ డింఢిముడు రచించిన సోమవల్లీ యోగానంద ప్రహసనం (ఈ కవినే శ్రీనాథ మహాకవి ఓడించి కనకాభిషేకం పొందాడు), రామభద్రాంబిక రచించిన రఘునాథాభ్యుదయం అనే చారిత్రక గ్రంథం, తెలుగుభాషలో స్థానాపతి రచించిన రాయవాచకం, తిరుమలాంబిక రచించిన వరదాంబిక పరిణయం, సాళువ నరసింహరాయలు రచించిన రామాభ్యుదయం, రెండో దేవరాయలు రచించిన వృత్తి గ్రంథం (బ్రహ్మసూత్ర భాష్యం), గంగాదేవి (గంగాంబ) రచించిన మధురా
 విజయం, రెండో బుక్కరాయల ఆస్థాన వైద్యుడు రాసిన వైద్యరాజ్యవల్లభం అనే ఆయుర్వేద గ్రంథం, లక్ష్మీనారాయణుడు రచించిన సంగీత సూర్యోదయం, కళింగ గజపతి ప్రతాపరుద్రుడు రచించిన సరస్వతీ విలాసం, శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో పంచకావ్యంగా గుర్తింపు పొందిన ఆమూక్తమాల్యద(దీన్నే విష్ణుచిత్తీయం అంటారు), జాంబవతీ కల్యాణం, అల్లసాని పెద్దన మనుచరిత్ర వంటి గ్రంథాలు ఆనాటి రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను వివరిస్తున్నాయి.
 
 రాజ వంశాలు మొదటి హరిహరుడు:
 విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల క్రమం... సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు. సంగమ వంశంలో మొదటి పాలకుడు హరిహరరాయలు-ఐ.
 *    ఇతడు క్రీ.శ.1336 నుంచి క్రీ.శ. 1356 వరకు 20 ఏళ్లు పాలించాడు.
 *     క్రీ.శ. 1339 నాటికి తూర్పు బంగాళాఖాతం నుంచి పశ్చిమంలోని అరేబియా సముద్రం వరకు రాజ్యాన్ని విస్తరించాడు.
 *    రాజ్య విస్తరణలో సోదరుడు బుక్కరాయలు యువరాజుగా ఉండి మొదటి హరిహరరాయలికి సహాయం చేశాడు.
 *    మొదటి హరిహరరాయలకు పూర్వ-పశ్చిమ సముద్రాధీశ్వర అనే బిరుదు ఉంది.
 *    హరిహరరాయల రాజగురువు చంద్రభూషణ క్రియాశకి. అతడి మంత్రి అనంతరుసు.
 *    మొదటి హరిహరరాయల కాలంలోనే క్రీ.శ. 1347లో హసన్‌గంగూ బహమనీ రాజ్యాన్ని గుల్బర్గా వద్ద స్థాపించాడు.
 *    ఇతడి కాలంలోనే దక్కను బహమనీ, విజయనగర రాజుల మధ్య సంఘర్షణ  ప్రారంభమైంది. కృష్ణా-తుంగభద్ర నదుల మధ్య అంతర్వేది ప్రాంతం ఈ సంఘర్షణలకు మూలకారణం. దీన్నే రాయచూర్‌దోబ్ అని అంటారు.
 *    మొదటి హరిహరరాయల కాలంలో.. మొరాకో (ఆఫ్రికా) దేశస్థుడైన ఇబన్ బటూటా... విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు.
 *    హోయసాల రాజ్యం హస్తగతమైన తర్వాత క్రీ.శ. 1346లో శృంగేరిని దర్శించాడు.
 *    ఇతడు కడప ప్రాంతంలో అడవులు నరికి వ్యవసాయ గ్రామాల నిర్మాణాన్ని ప్రోత్సహించాడు.
 *    రాజ్యంలో గ్రామ, స్థల, నాడులు, విభాగాలు ఏర్పాటు చేసి.. ఆయగాండ్రు, స్థలకరణాలు, నాడుగోడల అనే ఉద్యోగులను నియమించాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్ట పర్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement