ఏపీ హిస్టరీ

ఏపీ హిస్టరీ - Sakshi


విజయనగర సామ్రాజ్యం-రాజవంశాలు

 సాళువ వంశం (క్రీ.శ. 1486-1505)


 సంగమ వంశంలో రెండో దేవరాయల మరణానంతరం రాజులైన వారు అసమర్థులు కావడంతో విజయనగర శత్రువులైన బహమనీ సుల్తానులు, ఒరిస్సా గజపతులు విజృంభించి, విజయనగర రాజ్యభాగాలను ఆక్రమించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాళువ వంశస్థులు విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్టించారు. వీరు కర్ణాటకలోని కళ్యాణి ప్రాంతానికి చెందినవారు. బహుశా ముస్లింల దండయాత్రల కాలంలో వీరు విజయనగర రాజ్యానికి వలసవచ్చి ఉంటారని అంచనా.


కర్నూలు - చంద్రగిరి ప్రాంతాల్లో వీరి రాజకీయ ప్రాబల్యం ప్రారంభమైంది. ఈ వంశానికి చెందిన మంగిరాజుకు ‘సాళువ’ అనే బిరుదు వుంది. ఇతడి తర్వాత గుండరాజు కళ్యాణి ప్రాంతానికి మొదట రాజప్రతినిధి అయ్యాడు. గుండరాజు కుమారుడు సాళువ నరసింహరాయలు. ఇతడు సంగమ వంశానికి చెందిన విరూపాక్ష రాయల కాలంలో సామంతుడిగా పనిచేశాడు. ఇతడు క్రీ.శ. 1485లో సంగమవంశ చివరి రాజైన ఫ్రౌడరాయల నుంచి విజయనగర రాజ్యాన్ని ఆక్రమించాడు. సాళువ నరసింహారాయల ఆస్థానంలో సాళువాభ్యుదయం అనే గ్రంథాన్ని రాసిన రాజనాథ డింఢిముడు, తెలుగులో శృంగార శాకుంతలం, జైమినీ భారతం రాసిన పిల్లల మర్రి పినవీరభద్రుడు ప్రముఖంగా వెలుగొందాడు. సాళువ నరసింహరాయలకు రాయమహారసు అనే బిరుదు ఉంది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు, పదకీర్తనా, సంకీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమాచార్యుడు ఇతడికి సమకాలికుడే! సాళువ నరసింహరాయలను విజయనగర రాజ్య మొదటి దురాక్రమదారుడిగా కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు.


ఇతడు విజయనగర రాజ్య గౌరవ ప్రతిష్టలను, శాంతి భద్రతలను నెలకొల్పాడని చెప్పొచ్చు. ఇతడి పరిపాలనా కాలం 15 సంవత్సరాలు ఆ ఆశయ సాధనలోనే గడిచిపోయింది. సాళువ నరసింహరాయల తర్వాత తిమ్మరాయడు, ఇమ్మడి నరసింహరాయలు పాలించారు. ఇమ్మడి నరసింహరాయలు రాజైనప్పటికీ అధికారమంతా అతడి సైన్యాధ్యక్షుడైన తుళువ నరస నాయకుడి చేతిలోనే ఉండేది. క్రీ.శ.1503లో తుళువ నరస నాయకుడు మరణించాడు. తర్వాత క్రీ.శ.1505 లో అతడి కుమారుడు వీర నరసింహుడు, తండ్రిని వధించి, సింహాసనం అధిష్టించి తుళువ వంశాన్ని స్థాపించాడు.

 

 తుళువ వంశం (క్రీ.శ. 1505-1576):

 విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడో రాజవంశం తుళువ వంశం. మైసూరులోని తుళువనాడు వీరి జన్మస్థానం. అందుకే తుళువ వంశమని పేరొచ్చింది. దీన్ని వీరనరసింహరాయలు క్రీ.శ.1505లో స్థాపించాడు. క్రీ.శ.1509 వరకు రాజ్యమేలాడు. పాలించిన ఐదేళ్లూ యుద్ధాలతోనే గడిచిపోయింది. వీర నరసింహరాయలు వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజుగా ప్రసిద్ధి పొందాడు. ఉమ్మెత్తూర్ పాలకులను అణచివేసే ప్రయత్నంలో క్రీ.శ.1509లో మరణించాడు. తర్వాత ఆయన సవతి తమ్ముడైన శ్రీకృష్ణదేవరాయలు మంత్రి తిమ్మరుసు సహాయంతో క్రీ.శ. 1509లో సింహాసనాన్ని అధిష్టించాడు.

 

 శ్రీకృష్ణ దేవరాయలు (క్రీ.శ.1509-1529):

 విజయనగరాన్ని పాలించిన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగణ్యుడు. మహావీరుడు, విజేత, పాలనాదక్షుడు, రాజనీతిపరుడు, కావ్యస్రష్ట. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధి గాంచాడు.

 బీజాపూర్ సుల్తాన్ ఆదిల్‌షాను వధించి, కోవిలకొండను జయించాడు. బీదర్‌లో మంత్రి బరీద్ చేతిలో బందీైయెున బహమనీ సుల్తాన్ మహ్మద్ షాను విడిపించి, అతడికి సింహాసనాన్ని అప్పగించాడు. దీంతో యవనరాజ్యస్థాపనాచార్య అనే బిరుదు పొందాడు. ఉమ్మెత్తూర్, శివసముద్రం, పెనుగొండ దుర్గాలను జయించాడు. దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదును పొందాడు. కొండపల్లి, కొండవీడు, రాజమహేంద్రవరం, కళింగలోని ఉదయగిరులను జయించాడు. విశాఖ జిల్లాలోని పొట్నూరు వద్ద విజయస్తంభాన్ని ప్రతిష్టించాడు. కృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో మైత్రి చేసుకొని, శక్తివంతమైన గుర్రాలను దిగుమతి చేసుకున్నాడు. భత్కల్ కోటలు కట్టుకోవడానికి పోర్చుగీసు వారికి రాయలు అనుమతి ఇచ్చాడు. క్రీ.శ. 1509లో పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకొన్నారు.




 ఒరిస్సా గజపతుల ఆక్రమణలో ఉన్న తీరాంధ్ర - తెలంగాణ ప్రాంతాల్లోని అనేక దుర్గాలను శ్రీకృష్ణదేవరాయలు జయించాడు. వాటిలో ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి దుర్గాలు దుర్భేద్యమైనవి. రాయలు కళింగపై చేసిన దండయాత్ర క్రీ.శ.1513లో ప్రారంభమై క్రీ.శ.1519 వరకు కొనసాగింది. ప్రతాపరుద్ర గజపతి (ఒరిస్సా) కుమార్తె అన్నపూర్ణాదేవిని దేవరాయలు వివాహామాడాడు. అమరావతి, శ్రీకాకుళం (ఆంధ్రమహా విష్ణువు కృష్ణాజిల్లా),అహోబిలం, శ్రీశైలం, తిరుపతి, చిదంబరం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించి, తన విజయాలకు కృతజ్ఞతగా దేవతలకు విలువైన ఆభరణాలు, పలు కానుకలను సమర్పించాడు. శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తుడు. తిరుపతి దేవాలయంలో సుమారు 50 శాసనాలు వేయించాడు. క్రీ.శ.1513 నుంచి క్రీ.శ. 1524 మధ్య కాలంలో తన రాణులు తిరుమలదేవి, చిన్నాదేవిలతో కలిసి స్వామిని ఏడుసార్లు దర్శించుకున్నాడు. అనేక వజ్ర వైఢూర్యాలు, వేలాది బంగారు వరహాలను కానుకలుగా సమర్పించాడు.

 

 అష్టదిగ్గజాలు:

 కృష్ణదేవరాయలు ఆంధ్ర సాహిత్యానికి చేసిన మహోన్నత సేవల వల్ల ఆంధ్రభోజుడు అనే బిరుదును పొందాడు. ఈయన సాహిత్య మండపం భువన విజయంగా పేరు పొందింది. సంస్కృత, కన్నడ, తెలుగు కవులను ఆదరించాడు. తెలుగుభాషలో పంచకావ్యంగా పేరొందిన ఆముక్తమాల్యద (విష్ణుచిత్తీయం)ను రచించాడు. సంస్కృత భాషలో జాంబవతీ పరిణ యం, మదాలస చరిత్ర, సత్యవధూప్రమాణం వంటి గ్రంథాలను రచించాడు. కృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి తెలుగులో మారీచి పరిణయం అనే గ్రంథాన్ని రచించింది. ఇతడి ఆస్థాన కవి, ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దన మనుచరిత్రను రచించాడు.


దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. వారిలో నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రచించాడు. పెద్దన, తిమ్మన, అయ్యల రాజరామభద్రుడు, మాధవగారి మల్లన, సూరన, ధూర్జటి, తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి.. వీరంతా అష్టదిగ్గజకవులుగా ప్రఖ్యాతి చెందారు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ పేరుతో నాగలాపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న బండారు లక్ష్మీనారాయణ కవి సంస్కృతంలో సంగీత సూర్యోదయం అనే గ్రంథం రచించా డు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం రచించాడు.

 శ్రీకృష్ణ దేవరాయలు హంపీలో హజరా రామస్వామి, కృష్ణ స్వామి ఆలయాలను నిర్మించాడు. విజయనగర రెండో రాజధానిగా పేరుగాంచిన పెనుగొండలో తిమ్మరాజు బంధిఖానా, తిమ్మరాజు బురుజు, గగన్‌మహల్ (వేసవి విడిది) అనే రాజ ప్రాసాదాన్ని నిర్మించాడు. వీటితోపాటు అనేక ప్రాంతాల్లో రాయగోపురాలు, మండపాలను నిర్మించాడు. అనేక కవులు ఇతడిని సంగీత, సాహిత్య, సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజ, దక్షిణ సముద్రాధీశ్వర, యవన రాజ్య స్థాపనాచార్య, మూరు రాయడగండ అనే విశేష బిరుదులతో సత్కరించారు.

 శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ.1529లో మరణించాడు. తర్వాత అచ్యుత రాయలు, వెంకటపతిరాయలు రాజ్యానికొచ్చారు. వెంకటపతిరాయలు దుర్మార్గుడు కావడంతో ఆయనని తప్పించారు. కృష్ణ దేవరాయలకు అల్లుడైన అళియరామరాయలు, తర్వాత సదాశివరాయలు రాజ్యాన్ని పాలించారు. సదాశివరాయలు పేరుకు మాత్రమే ప్రభువు. సర్వాధికారాలన్నీ అళియరామరాయలే చెలాయించాడు. అళియ రామరాయలు, ఐదుగురికి(పంచ పాదుషాలు) మధ్య క్రీ.శ.1565లో రాక్షస తంగడి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అళియరామ రాయలు మరణించాడు. విజయనగర రాజు సదాశివరాయలు పెనుగొండకు పారిపోయాడు. దీంతో తుళువ వంశం అంతమైంది.

 

 ఆరవీటి వంశం:


 విజయనగర రాజ్యాన్ని పాలించిన చివరి వంశం ఆరవీటి వంశమే. రాక్షస తంగడి యుద్ధానంతరం తిరుమల రాయలు క్రీ.శ.1570లో పట్టాభిషేకం చేసుకొని, పెనుగొండ రాజధానిగా ఆరవీటి వంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో ప్రసిద్ధుడు రెండో వెంకటపతిరాయలు. క్రీ.శ.1585లో రాజ్యానికొచ్చాడు. క్రీ.శ.1614 వరకు పాలించాడు. ఇతడు బీజాపూర్, గోల్కొండ సుల్తానులతో యుద్ధం చేసి, వారు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత సామంతరాజుల తిరుగుబాటు వల్ల రాజధానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చాడు. చివరకు క్రీ.శ.1652లో గోల్కొండ సుల్తానుకు, మూడో రంగరాయలకు వందవాసి దగ్గర జరిగిన యుద్ధంలో రంగరాయల ఓటమితో విజయనగర మహాసామ్రాజ్యం పరిసమాప్తమైంది.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top