p.joginaidu
-
ఏపీ హిస్టరీ
విజయనగర సామ్రాజ్యం-రాజవంశాలు సాళువ వంశం (క్రీ.శ. 1486-1505) సంగమ వంశంలో రెండో దేవరాయల మరణానంతరం రాజులైన వారు అసమర్థులు కావడంతో విజయనగర శత్రువులైన బహమనీ సుల్తానులు, ఒరిస్సా గజపతులు విజృంభించి, విజయనగర రాజ్యభాగాలను ఆక్రమించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సాళువ వంశస్థులు విజయనగర సామ్రాజ్యాన్ని అధిష్టించారు. వీరు కర్ణాటకలోని కళ్యాణి ప్రాంతానికి చెందినవారు. బహుశా ముస్లింల దండయాత్రల కాలంలో వీరు విజయనగర రాజ్యానికి వలసవచ్చి ఉంటారని అంచనా. కర్నూలు - చంద్రగిరి ప్రాంతాల్లో వీరి రాజకీయ ప్రాబల్యం ప్రారంభమైంది. ఈ వంశానికి చెందిన మంగిరాజుకు ‘సాళువ’ అనే బిరుదు వుంది. ఇతడి తర్వాత గుండరాజు కళ్యాణి ప్రాంతానికి మొదట రాజప్రతినిధి అయ్యాడు. గుండరాజు కుమారుడు సాళువ నరసింహరాయలు. ఇతడు సంగమ వంశానికి చెందిన విరూపాక్ష రాయల కాలంలో సామంతుడిగా పనిచేశాడు. ఇతడు క్రీ.శ. 1485లో సంగమవంశ చివరి రాజైన ఫ్రౌడరాయల నుంచి విజయనగర రాజ్యాన్ని ఆక్రమించాడు. సాళువ నరసింహారాయల ఆస్థానంలో సాళువాభ్యుదయం అనే గ్రంథాన్ని రాసిన రాజనాథ డింఢిముడు, తెలుగులో శృంగార శాకుంతలం, జైమినీ భారతం రాసిన పిల్లల మర్రి పినవీరభద్రుడు ప్రముఖంగా వెలుగొందాడు. సాళువ నరసింహరాయలకు రాయమహారసు అనే బిరుదు ఉంది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు, పదకీర్తనా, సంకీర్తనాచార్యుడైన తాళ్లపాక అన్నమాచార్యుడు ఇతడికి సమకాలికుడే! సాళువ నరసింహరాయలను విజయనగర రాజ్య మొదటి దురాక్రమదారుడిగా కొందరు చరిత్రకారులు పేర్కొన్నారు. ఇతడు విజయనగర రాజ్య గౌరవ ప్రతిష్టలను, శాంతి భద్రతలను నెలకొల్పాడని చెప్పొచ్చు. ఇతడి పరిపాలనా కాలం 15 సంవత్సరాలు ఆ ఆశయ సాధనలోనే గడిచిపోయింది. సాళువ నరసింహరాయల తర్వాత తిమ్మరాయడు, ఇమ్మడి నరసింహరాయలు పాలించారు. ఇమ్మడి నరసింహరాయలు రాజైనప్పటికీ అధికారమంతా అతడి సైన్యాధ్యక్షుడైన తుళువ నరస నాయకుడి చేతిలోనే ఉండేది. క్రీ.శ.1503లో తుళువ నరస నాయకుడు మరణించాడు. తర్వాత క్రీ.శ.1505 లో అతడి కుమారుడు వీర నరసింహుడు, తండ్రిని వధించి, సింహాసనం అధిష్టించి తుళువ వంశాన్ని స్థాపించాడు. తుళువ వంశం (క్రీ.శ. 1505-1576): విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన మూడో రాజవంశం తుళువ వంశం. మైసూరులోని తుళువనాడు వీరి జన్మస్థానం. అందుకే తుళువ వంశమని పేరొచ్చింది. దీన్ని వీరనరసింహరాయలు క్రీ.శ.1505లో స్థాపించాడు. క్రీ.శ.1509 వరకు రాజ్యమేలాడు. పాలించిన ఐదేళ్లూ యుద్ధాలతోనే గడిచిపోయింది. వీర నరసింహరాయలు వివాహ పన్నును రద్దు చేసిన తొలి విజయనగర రాజుగా ప్రసిద్ధి పొందాడు. ఉమ్మెత్తూర్ పాలకులను అణచివేసే ప్రయత్నంలో క్రీ.శ.1509లో మరణించాడు. తర్వాత ఆయన సవతి తమ్ముడైన శ్రీకృష్ణదేవరాయలు మంత్రి తిమ్మరుసు సహాయంతో క్రీ.శ. 1509లో సింహాసనాన్ని అధిష్టించాడు. శ్రీకృష్ణ దేవరాయలు (క్రీ.శ.1509-1529): విజయనగరాన్ని పాలించిన రాజుల్లో శ్రీకృష్ణదేవరాయలు అగ్రగణ్యుడు. మహావీరుడు, విజేత, పాలనాదక్షుడు, రాజనీతిపరుడు, కావ్యస్రష్ట. సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడిగా ప్రసిద్ధి గాంచాడు. బీజాపూర్ సుల్తాన్ ఆదిల్షాను వధించి, కోవిలకొండను జయించాడు. బీదర్‌లో మంత్రి బరీద్ చేతిలో బందీైయెున బహమనీ సుల్తాన్ మహ్మద్ షాను విడిపించి, అతడికి సింహాసనాన్ని అప్పగించాడు. దీంతో యవనరాజ్యస్థాపనాచార్య అనే బిరుదు పొందాడు. ఉమ్మెత్తూర్, శివసముద్రం, పెనుగొండ దుర్గాలను జయించాడు. దక్షిణ సముద్రాధీశ్వర అనే బిరుదును పొందాడు. కొండపల్లి, కొండవీడు, రాజమహేంద్రవరం, కళింగలోని ఉదయగిరులను జయించాడు. విశాఖ జిల్లాలోని పొట్నూరు వద్ద విజయస్తంభాన్ని ప్రతిష్టించాడు. కృష్ణదేవరాయలు పోర్చుగీసు వారితో మైత్రి చేసుకొని, శక్తివంతమైన గుర్రాలను దిగుమతి చేసుకున్నాడు. భత్కల్ కోటలు కట్టుకోవడానికి పోర్చుగీసు వారికి రాయలు అనుమతి ఇచ్చాడు. క్రీ.శ. 1509లో పోర్చుగీసు వారు గోవాను ఆక్రమించుకొన్నారు. ఒరిస్సా గజపతుల ఆక్రమణలో ఉన్న తీరాంధ్ర - తెలంగాణ ప్రాంతాల్లోని అనేక దుర్గాలను శ్రీకృష్ణదేవరాయలు జయించాడు. వాటిలో ఉదయగిరి, కొండవీడు, కొండపల్లి దుర్గాలు దుర్భేద్యమైనవి. రాయలు కళింగపై చేసిన దండయాత్ర క్రీ.శ.1513లో ప్రారంభమై క్రీ.శ.1519 వరకు కొనసాగింది. ప్రతాపరుద్ర గజపతి (ఒరిస్సా) కుమార్తె అన్నపూర్ణాదేవిని దేవరాయలు వివాహామాడాడు. అమరావతి, శ్రీకాకుళం (ఆంధ్రమహా విష్ణువు కృష్ణాజిల్లా),అహోబిలం, శ్రీశైలం, తిరుపతి, చిదంబరం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించి, తన విజయాలకు కృతజ్ఞతగా దేవతలకు విలువైన ఆభరణాలు, పలు కానుకలను సమర్పించాడు. శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతి వేంకటేశ్వర స్వామి భక్తుడు. తిరుపతి దేవాలయంలో సుమారు 50 శాసనాలు వేయించాడు. క్రీ.శ.1513 నుంచి క్రీ.శ. 1524 మధ్య కాలంలో తన రాణులు తిరుమలదేవి, చిన్నాదేవిలతో కలిసి స్వామిని ఏడుసార్లు దర్శించుకున్నాడు. అనేక వజ్ర వైఢూర్యాలు, వేలాది బంగారు వరహాలను కానుకలుగా సమర్పించాడు. అష్టదిగ్గజాలు: కృష్ణదేవరాయలు ఆంధ్ర సాహిత్యానికి చేసిన మహోన్నత సేవల వల్ల ఆంధ్రభోజుడు అనే బిరుదును పొందాడు. ఈయన సాహిత్య మండపం భువన విజయంగా పేరు పొందింది. సంస్కృత, కన్నడ, తెలుగు కవులను ఆదరించాడు. తెలుగుభాషలో పంచకావ్యంగా పేరొందిన ఆముక్తమాల్యద (విష్ణుచిత్తీయం)ను రచించాడు. సంస్కృత భాషలో జాంబవతీ పరిణ యం, మదాలస చరిత్ర, సత్యవధూప్రమాణం వంటి గ్రంథాలను రచించాడు. కృష్ణదేవరాయల కుమార్తె మోహనాంగి తెలుగులో మారీచి పరిణయం అనే గ్రంథాన్ని రచించింది. ఇతడి ఆస్థాన కవి, ఆంధ్ర కవితా పితామహుడైన అల్లసాని పెద్దన మనుచరిత్రను రచించాడు. దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు. వారిలో నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రచించాడు. పెద్దన, తిమ్మన, అయ్యల రాజరామభద్రుడు, మాధవగారి మల్లన, సూరన, ధూర్జటి, తెనాలి రామకృష్ణ, భట్టుమూర్తి.. వీరంతా అష్టదిగ్గజకవులుగా ప్రఖ్యాతి చెందారు. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాంబ పేరుతో నాగలాపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇతడి ఆస్థానంలో ఉన్న బండారు లక్ష్మీనారాయణ కవి సంస్కృతంలో సంగీత సూర్యోదయం అనే గ్రంథం రచించా డు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం రచించాడు. శ్రీకృష్ణ దేవరాయలు హంపీలో హజరా రామస్వామి, కృష్ణ స్వామి ఆలయాలను నిర్మించాడు. విజయనగర రెండో రాజధానిగా పేరుగాంచిన పెనుగొండలో తిమ్మరాజు బంధిఖానా, తిమ్మరాజు బురుజు, గగన్‌మహల్ (వేసవి విడిది) అనే రాజ ప్రాసాదాన్ని నిర్మించాడు. వీటితోపాటు అనేక ప్రాంతాల్లో రాయగోపురాలు, మండపాలను నిర్మించాడు. అనేక కవులు ఇతడిని సంగీత, సాహిత్య, సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజ, దక్షిణ సముద్రాధీశ్వర, యవన రాజ్య స్థాపనాచార్య, మూరు రాయడగండ అనే విశేష బిరుదులతో సత్కరించారు. శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ.1529లో మరణించాడు. తర్వాత అచ్యుత రాయలు, వెంకటపతిరాయలు రాజ్యానికొచ్చారు. వెంకటపతిరాయలు దుర్మార్గుడు కావడంతో ఆయనని తప్పించారు. కృష్ణ దేవరాయలకు అల్లుడైన అళియరామరాయలు, తర్వాత సదాశివరాయలు రాజ్యాన్ని పాలించారు. సదాశివరాయలు పేరుకు మాత్రమే ప్రభువు. సర్వాధికారాలన్నీ అళియరామరాయలే చెలాయించాడు. అళియ రామరాయలు, ఐదుగురికి(పంచ పాదుషాలు) మధ్య క్రీ.శ.1565లో రాక్షస తంగడి యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో అళియరామ రాయలు మరణించాడు. విజయనగర రాజు సదాశివరాయలు పెనుగొండకు పారిపోయాడు. దీంతో తుళువ వంశం అంతమైంది. ఆరవీటి వంశం: విజయనగర రాజ్యాన్ని పాలించిన చివరి వంశం ఆరవీటి వంశమే. రాక్షస తంగడి యుద్ధానంతరం తిరుమల రాయలు క్రీ.శ.1570లో పట్టాభిషేకం చేసుకొని, పెనుగొండ రాజధానిగా ఆరవీటి వంశాన్ని స్థాపించాడు. ఈ వంశంలో ప్రసిద్ధుడు రెండో వెంకటపతిరాయలు. క్రీ.శ.1585లో రాజ్యానికొచ్చాడు. క్రీ.శ.1614 వరకు పాలించాడు. ఇతడు బీజాపూర్, గోల్కొండ సుల్తానులతో యుద్ధం చేసి, వారు ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. తర్వాత సామంతరాజుల తిరుగుబాటు వల్ల రాజధానిని పెనుగొండ నుంచి చంద్రగిరికి మార్చాడు. చివరకు క్రీ.శ.1652లో గోల్కొండ సుల్తానుకు, మూడో రంగరాయలకు వందవాసి దగ్గర జరిగిన యుద్ధంలో రంగరాయల ఓటమితో విజయనగర మహాసామ్రాజ్యం పరిసమాప్తమైంది. -
ఏపీ హిస్టరీ
ఫిరంగి దళాన్ని ఉపయోగించిన తొలియుద్ధం? విజయనగర సామ్రాజ్యం-విశిష్టత రాజవంశాలు మొదటి బుక్కరాయలు (క్రీ.శ. 1356-1377): హరిహరుడి తర్వాత మొదటి బుక్కరాయలు రాజ్యానికి వచ్చాడు. ఇతడు 20 సంవత్సరాలు పాలించాడు. ఇతడి కుమారుడు కంపరాయలు (కుమార కంపన) తమిళనాడులోని మధురను జయించి, విజయనగర రాజ్యంలో విలీనం చేశాడు. క్రీ.శ. 1325లో ఢిల్లీ సామంతులుగా మధురను పాలించిన ముస్లింలు మధుర రాజ్యాన్ని స్థాపించారు. వీరికాలంలో రామేశ్వరం, మధుర, శ్రీరంగం మొదలైన పుణ్యక్షేత్రాల్లో ప్రజలు అనేక బాధలను అనుభవించారు. కుమార కంపన భార్య గంగాంబ (లేదా) గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని క్రీ.శ. 1371లో రచించింది. ఇందులో కంపన దిగ్విజయాన్ని, బుక్కరాయల పాలనా విశేషాలను గంగాదేవి వర్ణించింది. అప్పటికే తిరుపతిలో దాచిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని శ్రీరంగంలో కంపన పునఃప్రతిష్టించాడు. మొదటి బుక్కరాయలు క్రీ.శ. 1374లో చైనా దేశానికి రాయబారిని పంపినట్లు మింగ్ వంశ చరిత్ర ద్వారా తెలుస్తోంది. మొదటి బుక్కరాయలకు, బహమనీ సుల్తాన్ ‘మహ్మద్షాకు’ మధ్య జరిగిన ముద్గల్ కోట యుద్ధంలో మొదటిసారిగా ఫిరంగి దళాన్ని ఉపయోగించారు. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన తొలియుద్ధం ఇదే. మొదటి బుక్కరాయలు... రెడ్డిరాజైన అనవోతారెడ్డిని ఓడించి, ఉదయగిరి, వినుకొండ, అహోబిలం దుర్గాలను జయించాడు. క్రీ.శ. 1366లో రేవతీ ద్వీపాన్ని(గోవా) బుక్కరాయల మంత్రి మాధవ మంత్రి ఆక్రమించాడు. శ్రీరంగపట్టణంలో జైనులకు - వైష్ణవులకు మధ్య వివాదాల్ని మొదటి బుక్కరాయలు పరిష్కరించాడు. ఇతడు వైదిక ధర్మాన్ని ప్రోత్సహించాడు. ధర్మపాలనలో బుక్కరాయలు మనువువంటి వాడని గంగాదేవి తన మధురా విజయంలో వర్ణిం చింది. వేద భాష్యకారుడైన శాయణాచార్యుడు, ఉపనిషత్ ప్రవర్తకుడైన మాధవుడు ఇతడి మంత్రులుగా పనిచేశారు. మొదటి బుక్కరాయలకు వైదిక మార్గ ప్రవర్తక, వేదమార్గ ప్రతిష్టాప క అనే బిరుదులు ఉన్నాయి. తెలుగు కవి నాచన సోమనాథుడిని బుక్కరాయలు ఆదరించాడు. రెండో హరిహర రాయలు (క్రీ.శ. 1377 - 1404): మొదటి బుక్కరాయల తర్వాత రెండో హరిహర రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించాడు. రాజ్యాన్ని ఇతడే ఎక్కువ కాలం పరిపాలించాడు. ఇతడు కొండవీటి రెడ్లు, రేచర్ల పద్మనాయకులతో యుద్ధాలు చేశాడు. పానగల్లును ఆక్రమించాడు. సింహళ దేశంపై దాడిచేసిన మొదటి విజయనగర రాజు రెండో హరిహర బుక్కరాయలే! రెండో హరిహరుడు తన హయాంలో రాజ్యపాలనలో అనేక మార్పులు చేశాడు. ఇతడి కంటే ముందు రాజ్యపాలనలో దాయాదులు ప్రధాన పాత్ర వహించేవారు. రెండో హరిహరుడు వారిని తొలగించి, తన కుమారులను నియమించాడు. ఉదాహరణకు ఉదయగిరిలో దేవరాయలు, మధురలో విరూపాక్షుడు, ముల్భాగల్లో యువరాజైన రెండో బుక్కరాయలను నియమించాడు. విధేయులైన వారికే ప్రాధాన్యతనిచ్చి కేంద్రాధికారాన్ని అప్పగిం చాడు. రెండో హరిహరుడికి మహామండలేశ్వర, రాజాధిరాజ, రాజపరమేశ్వర అనే బిరుదులు ఉన్నాయి. ఇతడి కాలంలో వర్షాభావం వల్ల దక్షిణాధిలో తీవ్ర కరవు సంభవించింది. దీంతో మహారాష్ర్ట, తెలంగాణ తీవ్ర నష్టానికి గురయ్యాయి. మహారాష్ర్టలో దీన్ని దుర్గాదేవి కరువు అని వ్యవహరించేవారు. దీని ప్రభావం 12 సంవత్సరాలు (క్రీ.శ. 1391-1403) వరకు ఉందని అప్పటి రచనల్లో పేర్కొన్నారు. బహమనీ సుల్తాన్ రెండో మహ్మద్‌షా కరవు నివారణకు కృషిచేసినట్లు తెలుస్తోంది. రెండో హరిహరుడి మరణానంతరం (1404) విజయనగర చరిత్రలో మొదటిసారిగా వారసత్వ కలహాలు జరిగాయి. యువరాజుగా ఉన్న బుక్కరాయలను కాదని విరూపాక్షుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. రెండో బుక్కరాయల్ని తొలగించి, క్రీ.శ. 1406లో మొదటి దేవరాయలు పట్టాభిషేకం జరుపుకున్నాడు. మొదటి దేవరాయలు (క్రీ.శ. 1406-1422): మొదటి దేవరాయల కాలం యుద్ధాలతో గడిచిపోయింది. రెండో బుక్కరాయల్ని ఓడించి, క్రీ.శ. 1406లో మొదటి దేవరాయలు రాజ్యానికొచ్చాడు. ఇతడు బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా చేతిలో ఓడిపోయి, తన కుమార్తెను ఫిరోజ్షాకిచ్చి వివాహం చేసినట్లు, బంకపూర్ అనే ప్రాంతాన్ని కట్నంగా ఇచ్చినట్లు ఫెరిష్టా రచనల ద్వారా తెలుస్తోంది. మొదటి దేవరాయలు రాజమహేంద్రవరం యుద్ధంలో పెదకోమటివేమారెడ్డిని ఓడించాడు. విజయనగర ప్రాకారాలను పటిష్టపరచి అనేక బురుజులను నిర్మించాడు. తుంగభద్రానదికి ఆనకట్ట వేయించి, 15 మైళ్ల కొండ ప్రాంతాన్ని తొలిపించి, కాలువల ద్వారా విజయనగరానికి నీటి సౌకర్యం కల్పించాడు. తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించిన తొలి పాలకుడిగా దేవరాయలు పేరు పొందాడు. ఇతని కాలంలోనే ఇటలీ యాత్రికుడు నికోలో - డి- కాంటే విజయనగర రాజ్య వైభవాన్ని వర్ణించాడు. దేవరాయల తర్వాత అతడి కుమారులైన రామచంద్రరాయలు, విజయరాయలు స్వల్ప కాలం రాజ్యమేలారు. రెండో దేవరాయలు (క్రీ.శ. 1426-1446): రెండో దేవరాయలు సంగమ వంశంలో సుప్రసిద్ధుడు. ఇతడిని ప్రౌఢ దేవరాయలు అని కూడా పిలుస్తారు. ఇతడికి గజబేంతకార (ఏనుగుల వేటలో నేర్పరి) అనే బిరుదు ఉంది. ఇతడి కాలంలో విజయ నగర రాజ్యం గొప్పగా విస్తరించింది. క్రీ.శ. 1428 నాటికి తీరాంధ్ర ప్రాంతాలైన కొండవీడు, సింహాచలం వరకు విస్తరించిన రెడ్డిరాజ్యాన్ని జయించి, సామంత రాజ్యంగా చేసుకున్నాడు. ఇతడి కాలంలోనే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైంది. రెండో దేవరాయలు తన సైన్యాన్ని పటిష్టం చేసేందుకు మొదటిసారిగా అధిక సంఖ్యలో మహమ్మదీయులను సైన్యంలో చేర్చుకున్నాడు. అహమ్మద్ షా బహమనీ, అతని కుమారుడు రెండో అల్లాఉద్దీన్ బహమనీషాలతో రెండుసార్లు యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధాల్లో దేవరాయలు పరాజయం పొంది బహమనీలకు నష్టపరిహారం చెల్లించి సంధి చేసుకున్నాడు. రెండో దేవరాయలు తన రాజ్యాన్ని ఉత్తరాన గుల్బర్గా నుంచి దక్షిణాన సింహళం వరకు, తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన మలబార్ వరకు విస్తరించాడు. పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ ఇతడి ఆస్థానాన్ని సందర్శించాడు. అబ్దుల్ రజాక్‌ను పారశీక రాజు ఖుస్రూ పంపాడు. రెండో దేవరాయలు శైవమతాభిమాని అయినప్పటికీ, ముస్లింలకు మతస్వేచ్ఛనిచ్చాడు. తురక వాడలు నిర్మించాడు. కన్యాశుల్కాన్ని నిరుత్సాహపర్చి, కన్యాదాన సంప్రదాయాన్ని పాటించాడు. రెండో దేవరాయలు స్వయంగా కవి, పండితుడు. సంస్కృత భాషలో మహానాటక సుధానిధి, భాష్యాలపై వృత్తి అనే వ్యాఖ్యానం రాశాడు. సంస్కృత కవి అరుణగిరినాథ డిండిముడు ఇతడి ఆస్థాన కవిగా ఉన్నాడు. ఇతడినే శ్రీనాథుడు పండిత గోష్టిలో ఓడించి దేవరాయలతో కనకాభిషేకం చేయించుకున్నాడు. వీరశైవుడైన కన్నడ రచయిత చామరసు.. రెండో దేవరాయల పోషణలో ప్రభులింగలీల అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడి మంత్రి ప్రోలుగంటి తిప్పన.. విఠలస్వామి దేవాలయానికి భోగమండపం నిర్మించాడు. జైనమతస్థులు, దేవరాయల అనుమతితో పాన్‌సుపారీ బజార్లో జైనాలయం నిర్మించారు. రెండో దేవరాయలు ముత్యాలశాల పేరుతో సాహిత్య సమావేశాలను నిర్వహించేవాడు. దేవరాయల తర్వాత అతని కుమారుడు రెండో విజయరాయలు, అతడి కుమారుడు మల్లికార్జునుడు క్రీ.శ. 1447 వరకు పాలించారు. ఈ కాలంలో విజయనగర శత్రురాజులైన బహమనీలు, ఒరిస్సా గజపతులు విజయనగరంపై దాడులు ప్రారంభించారు. చివరకు క్రీ.శ. 1485లో విరూపాక్షరాయల కాలంలో సంగమవంశం అంతమైంది. -
ఏపీ హిస్టరీ
విజయనగర సామ్రాజ్యం - విశిష్టత - రాజవంశాలు దక్షిణ భారతదేశ చరిత్ర మధ్యయుగంలో విజయనగర సామ్రాజ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాకతీయుల పతనానంతరం మహమ్మదీయుల తాకిడి నుంచి సుమారు రెండున్నర శతాబ్దాల పాటు హిందూ మత, సంస్కృతులను కాపాడిన ఘనత విజయనగర సామ్రాజ్యానికి దక్కుతుంది. ఈ యుగం హిందూమత పునర్జీవనానికి స్ఫూర్తినిచ్చింది. రెండున్నర శతాబ్దాలపాటు జరిగిన రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలు తర్వాత కాలంలో జరిగిన చరిత్రను ప్రభావితం చేయడమే కాకుండా దక్కనులోని మరాఠా ఉద్యమాన్ని కూడా ప్రభావితం చేసింది. విజయనగర రాజులు బహమనీలతో నిరంతర పోరాటాలు చేయడం వల్ల, బహమనీ సుల్తానులు ఉత్తర భారతదేశం వైపు తమ దృష్టిని సారించలేకపోయారు. బహమనీలు ఢిల్లీని ఆక్రమించి ఉంటే భారతదేశ చరిత్రలో మొగలు సామ్రాజ్యం అనుమానాస్పదమై ఉండేదని చరిత్రకారుల భావన. విజయనగర రాజులు దాక్షిణాత్య భాషా సారస్వతాలను, శిల్ప, సంగీత కళలను పోషించి దాక్షిణాత్యులందరికీ ఆదర్శంగా నిలిచారు. విజయనగర సామ్రాజ్య స్థాపన విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1336 లో సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు అనే సోదరులు తుంగభద్రా నదీ తీరంలో మాధవ విద్యారణ్యస్వామి సహకారంతో స్థాపించారు. వీరు ప్రారంభంలో కాకతీయ ప్రతాపరుద్రుడి కొలువులో కోశాగార ఉద్యోగులుగా ఉండేవారు. క్రీ.శ. 1323లో కాకతీయ రాజ్యాన్ని మహమ్మద్‌బిన్ తుగ్లక్ ఆక్రమించడంతో హరిహర బుక్కరాయలు కర్ణాటకలో ‘కంపిలి’ రాజ్యానికి వలస వెళ్లారు. బళ్లారి, చితల్దుర్గ, రాయచూరు, ధార్వాడ ప్రాంతాలు కంపి లి రాజ్యంలో ఉండేవి. ఆనెగొంది, కంపిలికి మాలిక్నెచి పాలకుడిగా ఉండేవాడు. స్థానికులు అతడిపై తిరుగుబాటు చేయడం వల్ల, మహ్మద్‌బిన్ తుగ్లక్ హరిహర-బుక్కరాయలను తన పాలకులుగా నియమించాడు. కాలక్రమంలో క్రీ.శ. 1336-1340 మధ్య హరిహర-బుక్కరాయలు ఢిల్లీ సుల్తానులను ధిక్కరించి, స్వతంత్ర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ముస్లింలపై విజయ సూచకంగా విజయనగరమని, విద్యల నగరంగా పేరొందడం వల్ల విద్యానగరమని చరిత్రలో ప్రసిద్ధి చెందింది. చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు విజయనగర సామ్రాజ్య స్థాపన విషయంలో చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. విజయనగర రాజ్య నిర్మాత హోయసాల రాజు మూడో వీరభల్లాలుడని, ఫెరిస్టా రచన ఆధారంగా రెవరెండ్ ఫాదర్ హెరాస్ పేర్కొన్నాడు. ఈ నిర్ణయాన్ని కృష్ణస్వామి అయ్యంగారు, హెచ్.కృష్ణశాస్త్రి, పి.బి.దేశాయ్ మొదలైన పండితులు అంగీకరించారు. వీరి సిద్ధాంతం ప్రకారం.. సంగముడికి, హరిహర, బుక్క, కంపన, మారప్ప, ముద్దప్ప ఐదుగురు కుమారులున్నారు. వీరు మూడో భల్లాలుడి కొలువులో ఉండేవారు. మూడో భల్లాలుడి మరణానంతరం హరిహర బుక్కరాయలు స్వతంత్రించారు. శ్రీనాథుడు మొదలైన తెలుగు కవులు విజయనగరాన్ని ‘కన్నడ రాజ్యలక్ష్మి’ అని, కృష్ణదేవాయల్ని ‘కర్ణాటక్షితిపాల’ అని సంబోధించినందువల్ల విజయనగర స్థాపకులు (సంగములు) కన్నడవారని వారి అభిప్రాయం. విజయనగర వైభవాన్ని వెలుగులోకి తెచ్చిన అమెరికా రచయిత ‘రాబర్ట సూయల్’ తన విస్మృత విజయనగర సామ్రాజ్యం (ధి ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర్) ప్రకారం.. హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్య నిర్మాతలని తెలుస్తోంది. వీరు ‘కురుబ తెగకు చెందినవారని, ఓరుగల్లు ప్రతాపరుద్రుడి కోశాగార ఉద్యోగులని కూడా ఆ గ్రంథం పేర్కొంటోంది. క్రీ.శ. 1323 ఓరుగల్లు పతనంతో ఆనెగొంది రాజులనాశ్రయించి, క్రమేణా స్వతంత్ర రాజ్యం స్థాపించారని రాబర్ట సూయల్ నిర్ణయించాడు. ఆయన అభిప్రాయాలతో అత్యధిక చరిత్రకారులు ఏకీభవిస్తున్నారు. సంస్కృత, కన్నడ, ఆంధ్రభాషల్లోని స్థానిక చరిత్రలు, బర్ని, ఇసామీ, మహమ్మదీయుల చరిత్రకారుల, న్యూనిజ్ రచనలు, శాసనాలను సమన్వయం చేసి, డాక్టర్ నేలటూరు వెంకటరమణయ్య... హరిహర బుక్కరాయలు ఆంధ్రులేనని నిర్ధారించారు. వీదిద్దరూ, కాకతీయ ప్రతాపరుద్రుడి సేనానులని, మంగళ నిలయవాసి సంగముడి కుమారులని పేర్కొన్నారు. సంగములు నాచన సోమనాథుడు అనే తెలుగు కవిని పోషించారు. మొదటి బుక్కరాయలి కోడలు గంగాంబ తన మధురావిజయం కావ్యంలో ప్రతాపరుద్రుడి ఆస్థాన కవులైన అగస్త్యుడు, విశ్వనాథుడు, కవిబ్రహ్మ తిక్కనను కూడా ప్రస్తావించింది. ఈ అంశాల ప్రకారం సంగమ వంశస్థులు తెలుగువారని, వారికి ఓరుగల్లుతో సంబంధం ఉందని తెలుస్తోంది. రాజకాల నిర్ణయం, శివతత్త్వ రత్నాకరం అనే గ్రంథాలు.. హరిహర బుక్క సోదరులను ప్రతాపరుద్రుడి ఉద్యోగులని వర్ణిస్తున్నాయి. విద్యారణ్య వృత్తాంతం అనే గ్రంథం సంగముడిని మంగళనిలయాధిపతి అని పేర్కొంటోంది. హరిహర-బుక్కరాయ సోదరులు ఆంధ్రులేనని, వెంకట రమణయ్యగారు నిరూపించారు. కాలజ్ఞాన గ్రంథాలు - సాహిత్యం ఇవి ఆయా రాజుల కాలాన్ని వివరించాయి. చరిత్ర రచనకు విలువైన సమాచారాన్ని అందించాయి. విద్యారణ్యుడు రాసిన కాలజ్ఞానంలో విజయనగర రాజుల చరిత్ర వివరాలున్నాయి. విద్యారణ్యుడి వృత్తాంతం అనే గ్రం థం... విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి చెబుతూ కొందరి రాజుల పేర్లు పేర్కొంది. సాహిత్యపరంగా ఒకటో రాజనాథ డింఢిముడు రచించిన సాళువాభ్యుదయం, రెండో రాజనాథ డింఢిముడు రచించిన అచ్యుతరామాభ్యుదయం, అరుణ గిరినాధ డింఢిముడు రచించిన సోమవల్లీ యోగానంద ప్రహసనం (ఈ కవినే శ్రీనాథ మహాకవి ఓడించి కనకాభిషేకం పొందాడు), రామభద్రాంబిక రచించిన రఘునాథాభ్యుదయం అనే చారిత్రక గ్రంథం, తెలుగుభాషలో స్థానాపతి రచించిన రాయవాచకం, తిరుమలాంబిక రచించిన వరదాంబిక పరిణయం, సాళువ నరసింహరాయలు రచించిన రామాభ్యుదయం, రెండో దేవరాయలు రచించిన వృత్తి గ్రంథం (బ్రహ్మసూత్ర భాష్యం), గంగాదేవి (గంగాంబ) రచించిన మధురా విజయం, రెండో బుక్కరాయల ఆస్థాన వైద్యుడు రాసిన వైద్యరాజ్యవల్లభం అనే ఆయుర్వేద గ్రంథం, లక్ష్మీనారాయణుడు రచించిన సంగీత సూర్యోదయం, కళింగ గజపతి ప్రతాపరుద్రుడు రచించిన సరస్వతీ విలాసం, శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో పంచకావ్యంగా గుర్తింపు పొందిన ఆమూక్తమాల్యద(దీన్నే విష్ణుచిత్తీయం అంటారు), జాంబవతీ కల్యాణం, అల్లసాని పెద్దన మనుచరిత్ర వంటి గ్రంథాలు ఆనాటి రాజకీయ, మత, సాంఘిక పరిస్థితులను వివరిస్తున్నాయి. రాజ వంశాలు మొదటి హరిహరుడు: విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాజవంశాల క్రమం... సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు. సంగమ వంశంలో మొదటి పాలకుడు హరిహరరాయలు-ఐ. * ఇతడు క్రీ.శ.1336 నుంచి క్రీ.శ. 1356 వరకు 20 ఏళ్లు పాలించాడు. * క్రీ.శ. 1339 నాటికి తూర్పు బంగాళాఖాతం నుంచి పశ్చిమంలోని అరేబియా సముద్రం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. * రాజ్య విస్తరణలో సోదరుడు బుక్కరాయలు యువరాజుగా ఉండి మొదటి హరిహరరాయలికి సహాయం చేశాడు. * మొదటి హరిహరరాయలకు పూర్వ-పశ్చిమ సముద్రాధీశ్వర అనే బిరుదు ఉంది. * హరిహరరాయల రాజగురువు చంద్రభూషణ క్రియాశకి. అతడి మంత్రి అనంతరుసు. * మొదటి హరిహరరాయల కాలంలోనే క్రీ.శ. 1347లో హసన్‌గంగూ బహమనీ రాజ్యాన్ని గుల్బర్గా వద్ద స్థాపించాడు. * ఇతడి కాలంలోనే దక్కను బహమనీ, విజయనగర రాజుల మధ్య సంఘర్షణ ప్రారంభమైంది. కృష్ణా-తుంగభద్ర నదుల మధ్య అంతర్వేది ప్రాంతం ఈ సంఘర్షణలకు మూలకారణం. దీన్నే రాయచూర్దోబ్ అని అంటారు. * మొదటి హరిహరరాయల కాలంలో.. మొరాకో (ఆఫ్రికా) దేశస్థుడైన ఇబన్ బటూటా... విజయనగర రాజ్యాన్ని సందర్శించాడు. * హోయసాల రాజ్యం హస్తగతమైన తర్వాత క్రీ.శ. 1346లో శృంగేరిని దర్శించాడు. * ఇతడు కడప ప్రాంతంలో అడవులు నరికి వ్యవసాయ గ్రామాల నిర్మాణాన్ని ప్రోత్సహించాడు. * రాజ్యంలో గ్రామ, స్థల, నాడులు, విభాగాలు ఏర్పాటు చేసి.. ఆయగాండ్రు, స్థలకరణాలు, నాడుగోడల అనే ఉద్యోగులను నియమించాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్ట పర్చాడు. -
ఏపీ హిస్టరీ
రేచర్ల పద్మనాయక -రెడ్డి రాజుల కాలం నాటి విశేషాలు ఆర్థిక పరిస్థితులు - వ్యవసాయం: రెడ్డిరాజుల కాలంలో వ్యవసాయం ముఖ్యవృత్తి. భూమిశిస్తు ప్రధాన ఆధారం. పండిన పంటలో ఆరోవంతు భాగాన్ని శిస్తుగా వసూలు చేసేవారు. పంట పొలాలు మూడు రకాలు. అవి.. వెలిపొలం, నీరు నేల, తోటభూమి. భూమిని గడలతో కొలిచేవారు. ఈ సాధనాన్ని ‘కేసరపాటిగడ’ అని పిలిచేవారు. ‘వృత్తికట్నాలు’ పేరుతో పన్నులు చెల్లించేవారు. ఎగుమతి, దిగుమతులపై సుంకాలుండేవి. పెద్ద చెరువులు తవ్వించి, మోట, ఏతాముల ద్వారా నీటిని అందించేవారు. చెరువులు, బావులు నీటి పారుదల సౌకర్యాలు. రెడ్డిరాజులు సంతాన సాగరం అనే చెరువు, జగనొబ్బగండ కాలువలు నిర్మించారు. రేచర్ల పద్మనాయకులు... అనపోతు సముద్రం, రాయసముద్రం, నాగసముద్రం వంటి తటాకాలను నిర్మించారు. కాకతీయులు, పద్మ-రెడ్డిరాజుల కాలంలోని పెద్ద చెరువులను శాసనాల్లో సముద్రాలని పేర్కొన్నారు. కొబ్బరి, పనస, పోక పంటలు పండించేవారు. రెడ్డిరాజుల కాలంలో కోనసీమ, అంగరసీమ, కొఠాంసీమలు పంటలకు ప్రసిద్ధి. తూముడు, పుట్టెడు పొలం అంటూ ఉండేవారు. భూమిని మూర లు, బారలు, గడలు, కుంటలుగా కూడా కొలిచేవారు. పల్నాడు, వినుకొండ సీమలు, కామవరం, సూరవరం సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి. కరకంచు, బొమ్మంచు పేర్లతో చీరలు నేసేవారు. నీలి, మంజిష్ట, లక్క, పసుపు, చిలక పచ్చరంగులు వాడేవారు. ఈ సీమల్లో పత్తిపంట అధికం. ప్రతి ఇంటిలో రాట్నం ఉండేది. ‘కదురాడిన కవ్వమాడిన’ ఇంటికి దారిద్య్రం అనేది ఉండదని పెద్దలనేవారు. పల్నాడులో ‘రంభైయెున ఏకులు వడకున్’ అని శ్రీనాథుని చాటువు. పెనుగొండ, కొండవీడు, ద్రాక్షారామం, నెల్లూరు, రాజమండ్రి ఆనాటి వర్తక కేంద్రాలు. గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, దున్నపోతులను సరుకు రవాణాలో వినియోగించేవారు. వాగులు, వంకలు, నదులు దాటడానికి పుట్టీలు (పడవలు) వినియోగించేవారు. ఆనాటి సాహిత్యంలో అనేక పరిశ్రమల ప్రసక్తి కనిపిస్తుంది. గ్రామాల్లో దీప స్తంభాలు, జేగంటలు, జయస్తంభాలను పంచలోహాలతో తయారు చేసేవారు. పెంబర్తి ఇత్తడి వస్తువు లకు, నిర్మల్ ఉక్కు కత్తులు, పల్నాడు వస్త్ర ఉత్పత్తులకు దేశ విదేశాల్లో గిరాకీ ఉండేది. కుమారగిరిరెడ్డి రాజు కొలువులో అవచితిప్పయశెట్టి ‘సుగంధ భాండారికుడుగా’ పనిచేస్తూ పంజారా నుంచి కర్పూరం, సింహళం నుంచి సుగంధ ద్రవ్యాలు, చైనా నుంచి పట్టువస్త్రాలు, భూటాన్ నుంచి కస్తూరి, హర్ముంజ్ (పారశీకదేశం) నుంచి బానిన స్త్రీలను దిగుమతి చేసేవాడు. ఆనాటి విదేశీ-దేశీయ వర్తకుల సంరక్షణార్థం క్రీ.శ.1358లో అనవోతారెడ్డి మోటుపల్లిరేవు అభయ శాసనాన్ని సంస్కరించాడు. వ్యాపారంలో కోమట్లు, బలిజలు ప్రధాన పాత్ర వహించారు. ఆ కాలంలో ప్రత్యేక నూనె సంతలు ఉండేవి. నిరంతరం యుద్ధాలు జరగడం వల్ల విస్తారంగా ఆయుధ పరిశ్రమ వర్థిల్లింది. నిర్మల్ ప్రాంతంలో తయారయ్యే ఉక్కు కత్తులు.. డెమాస్కస్ నగరానికి ఎగుమతి అయ్యేవి. నాణేలు: రేచర్ల పద్మనాయకులు-రెడ్డిరాజుల కాలం ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. దేశ-విదేశాలతో వర్తక వ్యాపారాలు నడిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ కాలం నాటి నాణేలు లభించినట్లు ఆధారాలు లేవు. పద్మనాయకుల కాలంలోని కొన్ని పద్మటంకాలనే నాణేలు (బంగారం) లభించినా, రెడ్డిరాజుల కాలం నాటివి ఎక్కడా లభించలేదు. కాబట్టి వ్యాపారం అంతా వస్తుమార్పిడి ద్వారానే జరిగినట్లు విశదమవుతోంది. విద్యలు - సారస్వతం: రేచర్ల పద్మనాయకులు- రెడ్డిరాజులు పాండిత్యం, సాహిత్య పోషణలో పోటీపడ్డారు. వేదాంగాలు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలంకార శాస్త్రాలు, రాజనీతి-ధర్మ శాస్త్రాలు, అశ్వశాస్త్రం, సంగీత-కామశాస్త్రాలను ప్రభువులు అభ్యసించినట్లు తెలుస్తోంది. రేచర్ల సింగభూపాలుడు, పెదకోమటి వేమారెడ్డిలు ‘సర్వజ్ఞ’ అనే బిరుదులను పొందారు. ‘విలసతామ్ర శాసనం’ ప్రకారం బ్రాహ్మణులు, జ్యోతిష్యం, షడ్దర్శనాలు, శబ్ద మీమాంస శాస్త్రాలు, సంగీత నాట్య సాహిత్యాలు, ఆయుర్వేదం, ధర్మశాస్త్రాలు మొదలైన విద్యల్లో నిష్ణాతులని తెలుస్తోంది. ఆనాటి రాజ భాష సంస్కృతం. తెలుగు భాష కూడా అభివృద్ధి చెందింది. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసినట్లు ‘ఫిరంగిపురం’ శాసనం తెలుపుతోంది. శ్రీనాథుడు వెలమ-రెడ్డి రాజ్యాల మధ్య దౌత్యం జరిపాడు. రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుడి మర్యాదలందుకున్నాడు. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ‘గౌడడిండిమ భట్టు’ గొప్ప సంస్కృత పండితుడిని ఓడించి ‘కవి సార్వభౌమ’ బిరుదు పొందాడు. అనవోతారెడ్డి ఆస్థానంలో బాలసరస్వతి, అనవేమారెడ్డి ఆస్థానంలో త్రిలోచనాచార్యుడు ఆస్థాన కవులుగా ఉండేవారు. శ్రీనాథుడు ‘మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, పండితారాధ్య చరిత్ర, భీమేశ్వర పురాణం, కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్యం, ధనుంజయ విలాసం, పల్నాటి వీరచరిత్ర’ వంటి గ్రంథాలను తెలుగు-సంస్కృత భాషలో రచించాడు. కుమార గిరిరెడ్డి సంస్కృతంలో వసంతరాజీయమనే నాట్యశాస్త్రాన్ని రచించాడు. కాళిదాసు రచించిన మూడు సంస్కృత నాటకాలకు ‘కుమారగిరి రాజీయం’ పేరుతో కాటయ వేమారెడ్డి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశాడు. పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి అనే గ్రంథాలు సంస్కృతంలో రచించాడు. ఇతడి ఆస్థాన కవి వామన భట్టభాణుడు. ఇతడు వేమ భూపాల చరితం (వీరనారాయణ చరితం) అనే చారిత్రక గ్రంథాన్ని, శృంగార భూషణ బాణం అనే నాటక గ్రంథాన్ని, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం అనే సంస్కృత కావ్యాలను, శబ్దరత్నాకరం, శబ్దచంద్రిక అనే నిఘంటువులను రాశాడు. ఈయనకు సాహిత్య చూడామణి, సాహిత్య- సామ్రాజ్య దురంధర, కవిసార్వభౌమ అనే బిరుదులుండేవి. ఇతడు పద్య, గద్య, నాటక రచనల్లో ప్రావీణ్యుడు. కనకలేఖా కల్యాణం, ఉషా పరిణయం, పార్వతీ పరిణయం అనే నాటకాలు రచించాడు. కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రెగడ తెలుగులో నృసింహ పురాణం, హరివంశాలను రచించాడు. ఇతడికి ‘శంభుదాసుడు, ప్రపంచ పరమేశ్వరుడు’ అనే బిరుదులున్నాయి. ఇతడు తన ఉత్తర హరివంశ కావ్యాన్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. మహాభారతంలోని సంస్కృత అరణ్య పర్వం శేషాన్ని తెలుగులో పూర్తి చేశాడు. సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని మడికి సింగన తెలుగులో రచించాడు. చమత్కార చంద్రిక అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని విశ్వేశ్వర కవి రచించాడు. కుమార గిరిరెడ్డి కొలువులో లకుమాదేవి అనే నాట్యకత్తె ఉండేది. పెదకోమటి తన నాట్యశాస్త్రంలో పారశీక నాట్యానికి మత్తల్లినర్తనం అని పేరుపెట్టి వర్ణించాడు. ఇవికాకుండా ఈ యుగంలో అశ్వ-గజశాస్త్రాలు, రాజనీతి యుద్ధ తంత్రం గురించి గ్రంథాలు కూడా వచ్చాయి. రేచర్ల పద్మనాయక - రెడ్డి రాజుల కాలంలో ద్విపద కావ్యాల్లో రంగనాథ రామాయణం ప్రసిద్ధమైంది. దీన్ని గోన బుద్ధరాజు రచించాడు. ఆంధ్ర కవుల్లో ప్రత్యేక గౌరవ స్థానం పొందినవాడు బమ్మెర పోతన. ఇతడు ఏకశిలా నగరవాసి (ఓరుగల్లు). కొంతకాలం సర్వజ్ఞ సింగభూపాలుడి(వెలమ) ఆస్థానంలో ఉండి, భోగినీ దండకం రచించాడు. పోతన వీరభద్ర విజయం అనే శైవ గ్రంథాన్ని రచించాడు. భక్తి ప్రధానమైన మహాభాగవతాన్ని తెలుగులో రచించాడు. ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన రామాయణ, మహాభారత, భాగవతాలను వెలుగులోకి తెచ్చిన రేచర్ల -రెడ్డిరాజులు, రాయల యుగానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. రెడ్డి రాజ్యం చివరికి కపితేశ్వర గజపతి (ఒరిస్సా) దురాక్రమణతో క్రీ.శ. 1448 నాటికి అస్తమించింది. దాంతో తీరాంధ్రం గజపతుల వశమైంది.