ఏపీ హిస్టరీ | Ap History | Sakshi
Sakshi News home page

ఏపీ హిస్టరీ

Nov 3 2013 10:29 PM | Updated on Mar 28 2019 5:32 PM

ఏపీ హిస్టరీ - Sakshi

ఏపీ హిస్టరీ

రెడ్డిరాజుల కాలంలో వ్యవసాయం ముఖ్యవృత్తి. భూమిశిస్తు ప్రధాన ఆధారం. పండిన పంటలో ఆరోవంతు భాగాన్ని శిస్తుగా వసూలు చేసేవారు.

రేచర్ల పద్మనాయక -రెడ్డి రాజుల కాలం నాటి విశేషాలు
 ఆర్థిక పరిస్థితులు - వ్యవసాయం:
 రెడ్డిరాజుల కాలంలో వ్యవసాయం ముఖ్యవృత్తి. భూమిశిస్తు ప్రధాన ఆధారం. పండిన పంటలో ఆరోవంతు భాగాన్ని శిస్తుగా వసూలు చేసేవారు. పంట పొలాలు మూడు రకాలు. అవి.. వెలిపొలం, నీరు నేల, తోటభూమి. భూమిని గడలతో కొలిచేవారు. ఈ సాధనాన్ని ‘కేసరపాటిగడ’ అని పిలిచేవారు. ‘వృత్తికట్నాలు’ పేరుతో పన్నులు చెల్లించేవారు. ఎగుమతి, దిగుమతులపై సుంకాలుండేవి. పెద్ద చెరువులు తవ్వించి, మోట, ఏతాముల ద్వారా నీటిని అందించేవారు. చెరువులు, బావులు నీటి పారుదల సౌకర్యాలు. రెడ్డిరాజులు సంతాన సాగరం అనే చెరువు, జగనొబ్బగండ కాలువలు నిర్మించారు. రేచర్ల పద్మనాయకులు... అనపోతు సముద్రం, రాయసముద్రం, నాగసముద్రం వంటి తటాకాలను నిర్మించారు. కాకతీయులు, పద్మ-రెడ్డిరాజుల కాలంలోని పెద్ద చెరువులను శాసనాల్లో సముద్రాలని పేర్కొన్నారు. కొబ్బరి, పనస, పోక పంటలు పండించేవారు. రెడ్డిరాజుల కాలంలో కోనసీమ, అంగరసీమ, కొఠాంసీమలు పంటలకు ప్రసిద్ధి.
 తూముడు, పుట్టెడు పొలం అంటూ ఉండేవారు. భూమిని మూర లు, బారలు, గడలు, కుంటలుగా కూడా కొలిచేవారు. పల్నాడు, వినుకొండ సీమలు, కామవరం, సూరవరం సన్నని వస్త్రాలకు ప్రసిద్ధి. కరకంచు, బొమ్మంచు పేర్లతో చీరలు నేసేవారు. నీలి, మంజిష్ట, లక్క, పసుపు, చిలక పచ్చరంగులు వాడేవారు. ఈ సీమల్లో పత్తిపంట అధికం. ప్రతి ఇంటిలో రాట్నం ఉండేది. ‘కదురాడిన కవ్వమాడిన’ ఇంటికి దారిద్య్రం అనేది ఉండదని పెద్దలనేవారు. పల్నాడులో ‘రంభైయెున ఏకులు వడకున్’ అని శ్రీనాథుని చాటువు. పెనుగొండ, కొండవీడు, ద్రాక్షారామం, నెల్లూరు, రాజమండ్రి ఆనాటి వర్తక కేంద్రాలు. గాడిదలు, గుర్రాలు, ఒంటెలు, దున్నపోతులను సరుకు రవాణాలో వినియోగించేవారు. వాగులు, వంకలు, నదులు దాటడానికి పుట్టీలు (పడవలు) వినియోగించేవారు.
 ఆనాటి సాహిత్యంలో అనేక పరిశ్రమల ప్రసక్తి కనిపిస్తుంది. గ్రామాల్లో దీప స్తంభాలు, జేగంటలు, జయస్తంభాలను పంచలోహాలతో తయారు చేసేవారు. పెంబర్తి ఇత్తడి వస్తువు లకు, నిర్మల్ ఉక్కు కత్తులు, పల్నాడు వస్త్ర ఉత్పత్తులకు దేశ విదేశాల్లో గిరాకీ ఉండేది.
 కుమారగిరిరెడ్డి రాజు కొలువులో అవచితిప్పయశెట్టి ‘సుగంధ భాండారికుడుగా’ పనిచేస్తూ పంజారా నుంచి కర్పూరం, సింహళం నుంచి సుగంధ ద్రవ్యాలు, చైనా నుంచి పట్టువస్త్రాలు, భూటాన్ నుంచి కస్తూరి, హర్ముంజ్ (పారశీకదేశం) నుంచి బానిన స్త్రీలను దిగుమతి చేసేవాడు.
 ఆనాటి విదేశీ-దేశీయ వర్తకుల సంరక్షణార్థం క్రీ.శ.1358లో అనవోతారెడ్డి మోటుపల్లిరేవు అభయ శాసనాన్ని సంస్కరించాడు. వ్యాపారంలో కోమట్లు, బలిజలు ప్రధాన పాత్ర వహించారు. ఆ కాలంలో ప్రత్యేక నూనె సంతలు ఉండేవి. నిరంతరం యుద్ధాలు జరగడం వల్ల విస్తారంగా ఆయుధ పరిశ్రమ వర్థిల్లింది. నిర్మల్ ప్రాంతంలో తయారయ్యే ఉక్కు కత్తులు.. డెమాస్కస్ నగరానికి ఎగుమతి అయ్యేవి.
 నాణేలు:
 రేచర్ల పద్మనాయకులు-రెడ్డిరాజుల కాలం ఆర్థికంగా అభివృద్ధి సాధించింది. దేశ-విదేశాలతో వర్తక వ్యాపారాలు నడిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ కాలం నాటి నాణేలు లభించినట్లు ఆధారాలు లేవు. పద్మనాయకుల కాలంలోని కొన్ని పద్మటంకాలనే నాణేలు (బంగారం) లభించినా, రెడ్డిరాజుల కాలం నాటివి ఎక్కడా లభించలేదు. కాబట్టి వ్యాపారం అంతా వస్తుమార్పిడి ద్వారానే జరిగినట్లు విశదమవుతోంది.
 
 విద్యలు - సారస్వతం:
 రేచర్ల పద్మనాయకులు- రెడ్డిరాజులు పాండిత్యం, సాహిత్య పోషణలో పోటీపడ్డారు. వేదాంగాలు, పురాణేతిహాసాలు, కావ్యనాటకాలంకార శాస్త్రాలు, రాజనీతి-ధర్మ శాస్త్రాలు, అశ్వశాస్త్రం, సంగీత-కామశాస్త్రాలను ప్రభువులు అభ్యసించినట్లు తెలుస్తోంది. రేచర్ల సింగభూపాలుడు, పెదకోమటి వేమారెడ్డిలు ‘సర్వజ్ఞ’ అనే బిరుదులను పొందారు. ‘విలసతామ్ర శాసనం’ ప్రకారం బ్రాహ్మణులు, జ్యోతిష్యం, షడ్దర్శనాలు, శబ్ద మీమాంస శాస్త్రాలు, సంగీత నాట్య సాహిత్యాలు, ఆయుర్వేదం, ధర్మశాస్త్రాలు మొదలైన విద్యల్లో నిష్ణాతులని తెలుస్తోంది. ఆనాటి రాజ భాష సంస్కృతం. తెలుగు భాష కూడా అభివృద్ధి చెందింది. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా పనిచేసినట్లు ‘ఫిరంగిపురం’ శాసనం తెలుపుతోంది. శ్రీనాథుడు వెలమ-రెడ్డి రాజ్యాల మధ్య దౌత్యం జరిపాడు. రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుడి మర్యాదలందుకున్నాడు. విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ‘గౌడడిండిమ భట్టు’ గొప్ప సంస్కృత పండితుడిని ఓడించి ‘కవి సార్వభౌమ’ బిరుదు పొందాడు. అనవోతారెడ్డి ఆస్థానంలో బాలసరస్వతి, అనవేమారెడ్డి ఆస్థానంలో త్రిలోచనాచార్యుడు ఆస్థాన కవులుగా ఉండేవారు. శ్రీనాథుడు ‘మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, పండితారాధ్య చరిత్ర, భీమేశ్వర పురాణం, కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్యం, ధనుంజయ విలాసం, పల్నాటి వీరచరిత్ర’ వంటి గ్రంథాలను తెలుగు-సంస్కృత భాషలో రచించాడు.
 కుమార గిరిరెడ్డి సంస్కృతంలో వసంతరాజీయమనే నాట్యశాస్త్రాన్ని రచించాడు. కాళిదాసు రచించిన మూడు సంస్కృత నాటకాలకు ‘కుమారగిరి రాజీయం’ పేరుతో కాటయ వేమారెడ్డి సంస్కృతంలో వ్యాఖ్యానం రాశాడు. పెదకోమటి వేమారెడ్డి సాహిత్య చింతామణి, సంగీత చింతామణి అనే గ్రంథాలు సంస్కృతంలో రచించాడు. ఇతడి ఆస్థాన కవి వామన భట్టభాణుడు. ఇతడు వేమ భూపాల చరితం (వీరనారాయణ చరితం) అనే చారిత్రక గ్రంథాన్ని, శృంగార భూషణ బాణం అనే నాటక గ్రంథాన్ని, నలాభ్యుదయం, రఘునాథాభ్యుదయం అనే సంస్కృత కావ్యాలను, శబ్దరత్నాకరం, శబ్దచంద్రిక అనే నిఘంటువులను రాశాడు. ఈయనకు సాహిత్య చూడామణి, సాహిత్య- సామ్రాజ్య దురంధర, కవిసార్వభౌమ అనే బిరుదులుండేవి. ఇతడు పద్య, గద్య, నాటక రచనల్లో ప్రావీణ్యుడు. కనకలేఖా కల్యాణం, ఉషా పరిణయం, పార్వతీ పరిణయం అనే నాటకాలు రచించాడు.
 కవిత్రయంలో చివరివాడైన ఎర్రాప్రెగడ తెలుగులో నృసింహ పురాణం, హరివంశాలను రచించాడు. ఇతడికి ‘శంభుదాసుడు, ప్రపంచ పరమేశ్వరుడు’ అనే బిరుదులున్నాయి. ఇతడు తన ఉత్తర హరివంశ కావ్యాన్ని ప్రోలయ వేమారెడ్డికి అంకితమిచ్చాడు. మహాభారతంలోని సంస్కృత అరణ్య పర్వం శేషాన్ని తెలుగులో పూర్తి చేశాడు.
 సకల నీతి సమ్మతం అనే గ్రంథాన్ని మడికి సింగన తెలుగులో రచించాడు. చమత్కార చంద్రిక అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని విశ్వేశ్వర కవి రచించాడు. కుమార గిరిరెడ్డి కొలువులో లకుమాదేవి అనే నాట్యకత్తె ఉండేది.
 పెదకోమటి తన నాట్యశాస్త్రంలో పారశీక నాట్యానికి మత్తల్లినర్తనం అని పేరుపెట్టి వర్ణించాడు. ఇవికాకుండా ఈ యుగంలో అశ్వ-గజశాస్త్రాలు, రాజనీతి యుద్ధ తంత్రం గురించి గ్రంథాలు కూడా వచ్చాయి.
 రేచర్ల పద్మనాయక - రెడ్డి రాజుల కాలంలో ద్విపద కావ్యాల్లో రంగనాథ రామాయణం ప్రసిద్ధమైంది. దీన్ని గోన బుద్ధరాజు రచించాడు. ఆంధ్ర కవుల్లో ప్రత్యేక గౌరవ స్థానం పొందినవాడు బమ్మెర పోతన. ఇతడు ఏకశిలా నగరవాసి (ఓరుగల్లు). కొంతకాలం సర్వజ్ఞ సింగభూపాలుడి(వెలమ) ఆస్థానంలో ఉండి, భోగినీ దండకం రచించాడు. పోతన వీరభద్ర విజయం అనే శైవ గ్రంథాన్ని రచించాడు. భక్తి ప్రధానమైన మహాభాగవతాన్ని తెలుగులో రచించాడు.
 ఆంధ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైన రామాయణ, మహాభారత, భాగవతాలను వెలుగులోకి తెచ్చిన రేచర్ల -రెడ్డిరాజులు, రాయల యుగానికి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. రెడ్డి రాజ్యం చివరికి కపితేశ్వర గజపతి (ఒరిస్సా) దురాక్రమణతో క్రీ.శ. 1448 నాటికి అస్తమించింది. దాంతో తీరాంధ్రం గజపతుల వశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement