
ఏపీ హిస్టరీ
హరిహరుడి తర్వాత మొదటి బుక్కరాయలు రాజ్యానికి వచ్చాడు. ఇతడు 20 సంవత్సరాలు పాలించాడు. ఇతడి కుమారుడు కంపరాయలు (కుమార కంపన) తమిళనాడులోని మధురను జయించి, విజయనగర రాజ్యంలో విలీనం చేశాడు.
ఫిరంగి దళాన్ని ఉపయోగించిన తొలియుద్ధం?
విజయనగర సామ్రాజ్యం-విశిష్టత
రాజవంశాలు
మొదటి బుక్కరాయలు (క్రీ.శ. 1356-1377):
హరిహరుడి తర్వాత మొదటి బుక్కరాయలు రాజ్యానికి వచ్చాడు. ఇతడు 20 సంవత్సరాలు పాలించాడు. ఇతడి కుమారుడు కంపరాయలు (కుమార కంపన) తమిళనాడులోని మధురను జయించి, విజయనగర రాజ్యంలో విలీనం చేశాడు. క్రీ.శ. 1325లో ఢిల్లీ సామంతులుగా మధురను పాలించిన ముస్లింలు మధుర రాజ్యాన్ని స్థాపించారు. వీరికాలంలో రామేశ్వరం, మధుర, శ్రీరంగం మొదలైన పుణ్యక్షేత్రాల్లో ప్రజలు అనేక బాధలను అనుభవించారు. కుమార కంపన భార్య గంగాంబ (లేదా) గంగాదేవి మధురా విజయం అనే గ్రంథాన్ని క్రీ.శ. 1371లో రచించింది. ఇందులో కంపన దిగ్విజయాన్ని, బుక్కరాయల పాలనా విశేషాలను గంగాదేవి వర్ణించింది. అప్పటికే తిరుపతిలో దాచిన శ్రీరంగనాథుడి విగ్రహాన్ని శ్రీరంగంలో కంపన పునఃప్రతిష్టించాడు. మొదటి బుక్కరాయలు క్రీ.శ. 1374లో చైనా దేశానికి రాయబారిని పంపినట్లు మింగ్ వంశ చరిత్ర ద్వారా తెలుస్తోంది. మొదటి బుక్కరాయలకు, బహమనీ సుల్తాన్ ‘మహ్మద్‌షాకు’ మధ్య జరిగిన ముద్గల్ కోట యుద్ధంలో మొదటిసారిగా ఫిరంగి దళాన్ని ఉపయోగించారు. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన తొలియుద్ధం ఇదే. మొదటి బుక్కరాయలు... రెడ్డిరాజైన అనవోతారెడ్డిని ఓడించి, ఉదయగిరి, వినుకొండ, అహోబిలం దుర్గాలను జయించాడు. క్రీ.శ. 1366లో రేవతీ ద్వీపాన్ని(గోవా) బుక్కరాయల మంత్రి మాధవ మంత్రి ఆక్రమించాడు. శ్రీరంగపట్టణంలో జైనులకు - వైష్ణవులకు మధ్య వివాదాల్ని మొదటి బుక్కరాయలు పరిష్కరించాడు. ఇతడు వైదిక ధర్మాన్ని ప్రోత్సహించాడు. ధర్మపాలనలో బుక్కరాయలు మనువువంటి వాడని గంగాదేవి తన మధురా విజయంలో వర్ణిం చింది. వేద భాష్యకారుడైన శాయణాచార్యుడు, ఉపనిషత్ ప్రవర్తకుడైన మాధవుడు ఇతడి మంత్రులుగా పనిచేశారు. మొదటి బుక్కరాయలకు వైదిక మార్గ ప్రవర్తక, వేదమార్గ ప్రతిష్టాప క అనే బిరుదులు ఉన్నాయి. తెలుగు కవి నాచన సోమనాథుడిని బుక్కరాయలు ఆదరించాడు.
రెండో హరిహర రాయలు (క్రీ.శ. 1377 - 1404):
మొదటి బుక్కరాయల తర్వాత రెండో హరిహర రాయలు విజయనగర రాజ్యాన్ని పాలించాడు. రాజ్యాన్ని ఇతడే ఎక్కువ కాలం పరిపాలించాడు. ఇతడు కొండవీటి రెడ్లు, రేచర్ల పద్మనాయకులతో యుద్ధాలు చేశాడు. పానగల్లును ఆక్రమించాడు. సింహళ దేశంపై దాడిచేసిన మొదటి విజయనగర రాజు రెండో హరిహర బుక్కరాయలే!
రెండో హరిహరుడు తన హయాంలో రాజ్యపాలనలో అనేక మార్పులు చేశాడు. ఇతడి కంటే ముందు రాజ్యపాలనలో దాయాదులు ప్రధాన పాత్ర వహించేవారు. రెండో హరిహరుడు వారిని తొలగించి, తన కుమారులను నియమించాడు. ఉదాహరణకు ఉదయగిరిలో దేవరాయలు, మధురలో విరూపాక్షుడు, ముల్‌భాగల్‌లో యువరాజైన రెండో బుక్కరాయలను నియమించాడు. విధేయులైన వారికే ప్రాధాన్యతనిచ్చి కేంద్రాధికారాన్ని అప్పగిం చాడు. రెండో హరిహరుడికి మహామండలేశ్వర, రాజాధిరాజ, రాజపరమేశ్వర అనే బిరుదులు ఉన్నాయి. ఇతడి కాలంలో వర్షాభావం వల్ల దక్షిణాధిలో తీవ్ర కరవు సంభవించింది. దీంతో మహారాష్ర్ట, తెలంగాణ తీవ్ర నష్టానికి గురయ్యాయి. మహారాష్ర్టలో దీన్ని దుర్గాదేవి కరువు అని వ్యవహరించేవారు. దీని ప్రభావం 12 సంవత్సరాలు (క్రీ.శ. 1391-1403) వరకు ఉందని అప్పటి రచనల్లో పేర్కొన్నారు. బహమనీ సుల్తాన్ రెండో మహ్మద్‌షా కరవు నివారణకు కృషిచేసినట్లు తెలుస్తోంది. రెండో హరిహరుడి మరణానంతరం (1404) విజయనగర చరిత్రలో మొదటిసారిగా వారసత్వ కలహాలు జరిగాయి. యువరాజుగా ఉన్న బుక్కరాయలను కాదని విరూపాక్షుడు సింహాసనాన్ని ఆక్రమించాడు. రెండో బుక్కరాయల్ని తొలగించి, క్రీ.శ. 1406లో మొదటి దేవరాయలు పట్టాభిషేకం జరుపుకున్నాడు.
మొదటి దేవరాయలు (క్రీ.శ. 1406-1422):
మొదటి దేవరాయల కాలం యుద్ధాలతో గడిచిపోయింది. రెండో బుక్కరాయల్ని ఓడించి, క్రీ.శ. 1406లో మొదటి దేవరాయలు రాజ్యానికొచ్చాడు. ఇతడు బహమనీ సుల్తాన్ ఫిరోజ్‌షా చేతిలో ఓడిపోయి, తన కుమార్తెను ఫిరోజ్‌షాకిచ్చి వివాహం చేసినట్లు, బంకపూర్ అనే ప్రాంతాన్ని కట్నంగా ఇచ్చినట్లు ఫెరిష్టా రచనల ద్వారా తెలుస్తోంది. మొదటి దేవరాయలు రాజమహేంద్రవరం యుద్ధంలో పెదకోమటివేమారెడ్డిని ఓడించాడు. విజయనగర ప్రాకారాలను పటిష్టపరచి అనేక బురుజులను నిర్మించాడు. తుంగభద్రానదికి ఆనకట్ట వేయించి, 15 మైళ్ల కొండ ప్రాంతాన్ని తొలిపించి, కాలువల ద్వారా విజయనగరానికి నీటి సౌకర్యం కల్పించాడు. తుంగభద్రా నదికి ఆనకట్ట కట్టించిన తొలి పాలకుడిగా దేవరాయలు పేరు పొందాడు.
ఇతని కాలంలోనే ఇటలీ యాత్రికుడు నికోలో - డి- కాంటే విజయనగర రాజ్య వైభవాన్ని వర్ణించాడు. దేవరాయల తర్వాత అతడి కుమారులైన రామచంద్రరాయలు, విజయరాయలు స్వల్ప కాలం రాజ్యమేలారు.
రెండో దేవరాయలు (క్రీ.శ. 1426-1446):
రెండో దేవరాయలు సంగమ వంశంలో సుప్రసిద్ధుడు. ఇతడిని ప్రౌఢ దేవరాయలు అని కూడా పిలుస్తారు. ఇతడికి గజబేంతకార (ఏనుగుల వేటలో నేర్పరి) అనే బిరుదు ఉంది. ఇతడి కాలంలో విజయ నగర రాజ్యం గొప్పగా విస్తరించింది. క్రీ.శ. 1428 నాటికి తీరాంధ్ర ప్రాంతాలైన కొండవీడు, సింహాచలం వరకు విస్తరించిన రెడ్డిరాజ్యాన్ని జయించి, సామంత రాజ్యంగా చేసుకున్నాడు. ఇతడి కాలంలోనే రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.
రెండో దేవరాయలు తన సైన్యాన్ని పటిష్టం చేసేందుకు మొదటిసారిగా అధిక సంఖ్యలో మహమ్మదీయులను సైన్యంలో చేర్చుకున్నాడు. అహమ్మద్ షా బహమనీ, అతని కుమారుడు రెండో అల్లాఉద్దీన్ బహమనీషాలతో రెండుసార్లు యుద్ధాలు చేశాడు. ఈ యుద్ధాల్లో దేవరాయలు పరాజయం పొంది బహమనీలకు నష్టపరిహారం చెల్లించి సంధి చేసుకున్నాడు.
రెండో దేవరాయలు తన రాజ్యాన్ని ఉత్తరాన గుల్బర్గా నుంచి దక్షిణాన సింహళం వరకు, తూర్పున బెంగాల్ నుంచి పశ్చిమాన మలబార్ వరకు విస్తరించాడు. పారశీక రాయబారి అబ్దుల్ రజాక్ ఇతడి ఆస్థానాన్ని సందర్శించాడు. అబ్దుల్ రజాక్‌ను పారశీక రాజు ఖుస్రూ పంపాడు. రెండో దేవరాయలు శైవమతాభిమాని అయినప్పటికీ, ముస్లింలకు మతస్వేచ్ఛనిచ్చాడు. తురక వాడలు నిర్మించాడు. కన్యాశుల్కాన్ని నిరుత్సాహపర్చి, కన్యాదాన సంప్రదాయాన్ని పాటించాడు. రెండో దేవరాయలు స్వయంగా కవి, పండితుడు. సంస్కృత భాషలో మహానాటక సుధానిధి, భాష్యాలపై వృత్తి అనే వ్యాఖ్యానం రాశాడు. సంస్కృత కవి అరుణగిరినాథ డిండిముడు ఇతడి ఆస్థాన కవిగా ఉన్నాడు. ఇతడినే శ్రీనాథుడు పండిత గోష్టిలో ఓడించి దేవరాయలతో కనకాభిషేకం చేయించుకున్నాడు.
వీరశైవుడైన కన్నడ రచయిత చామరసు.. రెండో దేవరాయల పోషణలో ప్రభులింగలీల అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడి మంత్రి ప్రోలుగంటి తిప్పన.. విఠలస్వామి దేవాలయానికి భోగమండపం నిర్మించాడు. జైనమతస్థులు, దేవరాయల అనుమతితో పాన్‌సుపారీ బజార్‌లో జైనాలయం నిర్మించారు. రెండో దేవరాయలు ముత్యాలశాల పేరుతో సాహిత్య సమావేశాలను నిర్వహించేవాడు.
దేవరాయల తర్వాత అతని కుమారుడు రెండో విజయరాయలు, అతడి కుమారుడు మల్లికార్జునుడు క్రీ.శ. 1447 వరకు పాలించారు. ఈ కాలంలో విజయనగర శత్రురాజులైన బహమనీలు, ఒరిస్సా గజపతులు విజయనగరంపై దాడులు ప్రారంభించారు. చివరకు క్రీ.శ. 1485లో విరూపాక్షరాయల కాలంలో సంగమవంశం అంతమైంది.