అమ్మా నా పని అయిపోయింది ! | youngman misslenious dead | Sakshi
Sakshi News home page

అమ్మా నా పని అయిపోయింది !

Sep 23 2016 12:02 AM | Updated on Sep 4 2017 2:32 PM

అమ్మా నా పని అయిపోయింది !

అమ్మా నా పని అయిపోయింది !

‘అమ్మా.. నా పని అయిపోయింది...’ అని ఓ యువకుడు తన తల్లికి ఫోన్‌లో చెప్పిన కొన్ని నిమిషాల్లోనే కన్నుమూశాడు. తన కుమారుడికి ఏమైందోనని ఆందోళనతో ఆ తల్లి వెదుకుతుండగానే... పత్తి చేనులో మృతదేహం కనిపించింది.

చెరువుకొమ్ముపాలెం(నందిగామ రూరల్‌) :
 ‘అమ్మా.. నా పని అయిపోయింది...’ అని ఓ యువకుడు తన తల్లికి ఫోన్‌లో చెప్పిన కొన్ని నిమిషాల్లోనే కన్నుమూశాడు. తన కుమారుడికి ఏమైందోనని ఆందోళనతో ఆ తల్లి వెదుకుతుండగానే... పత్తి చేనులో మృతదేహం కనిపించింది. దీంతో ఆ తల్లి కుప్పకూలిపోయింది. ఈ హృదయవిదారక ఘటన మండలంలోని చెరువుకొమ్ముపాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు... గ్రామానికి చెందిన నరమట్ల సత్యనారాయణ (24) డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మరోవైపు తమకు ఉన్న ఎకరం పొలాన్ని సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్నాడు. పత్తి కాయ దశలో ఉండటంతో కోతుల బెడద అధికం కావడంతో కాపలా కోసం ఉదయం 10.30 గంటలకు పొలానికి వెళ్లాడు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన తల్లి రమణకు సత్యనారాయణ సెల్‌ఫోన్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేసిన వెంటనే ‘అమ్మా.. నా పని అయిపోయింది..’ అని చెబుతండగానే మాట ఆగిపోయింది. దీంతో ఆమె కంగారుపడి తన రెండో కుమారుడు శ్రీనుతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో సత్యనారాయణ మృతదేహం కనిపించింది. సత్యనారాయణ గొంతు వద్ద బ్లేడ్‌తో కోసిన గాయం ఉంది. కుమారుడి మృతదేహాన్ని చూసి రమణ కన్నీరుమున్నీరుగా విలపించారు. నందిగామ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశలించారు. మృతదేహం పక్కన ఓ బ్లేడ్‌ లభించింది. దీంతో సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడా... లేక ఎవరైనా దుండగులు హత్య చేశారా.. అనే కోణంలో విచారిస్తున్నారు. సత్యనారాయణ సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement