సరోగసీకి ఇంకా సమస్యలే

Surrogacy Amendment Bill To Select Committee In Rajya Sabha - Sakshi

ఎట్టకేలకు సరోగసీ (అద్దె గర్భం) బిల్లుపై సెలెక్ట్‌ కమిటీ సిఫార్సులు పెద్దల సభ ముందుకొచ్చాయి. బిల్లుకు ఏర్పడిన అవరోధాలు తొలగి అది పార్లమెంటు ఆమోదం పొందాలని సంతాన లేమితో బాధపడుతూ, సరోగసీ కోసం ఎన్నో జంటలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఎప్పుడో 2008లో బిల్లు పని ప్రారంభం కాగా, చట్టాల రూపకల్పనలో రివాజుగా సాగే జాప్యాన్ని దాటడానికి ఇంతకాలం పట్టింది. దీనిపై ఇంకా సభలో చర్చ జరగాల్సివుంది. బిల్లును అధ్యయనం చేసిన సెలెక్ట్‌ కమిటీ 15 సూచనలు చేసింది. ఇందులో అద్దె గర్భానికి అంగీకరించే మహిళ, దంపతులకు సమీప బంధువై ఉండాలన్న నిబంధన తొలగించమని చేసిన సూచన కూడా ఉంది. అలాగే మరో కీలకమైన సూచన కూడా చేసింది. వివాహమైన దగ్గర నుంచి అయిదేళ్లపాటు ఎదురుచూశాకే అద్దె గర్భం ప్రత్యా మ్నాయాన్ని దంపతులు ఎంచుకోవాలన్న నిబంధన కూడా సరికాదని కమిటీ అభిప్రాయపడింది.

సంతానం అవసరమని భావించే దంపతులు సంతానలేమి ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్న నిబంధనను కమిటీ వ్యతిరేకించింది. దీనికి బదులు వైద్యపరంగా వారిని అద్దె గర్భం ద్వారా ‘సంతానం కోరుకునే జంట’గా పరిగణిస్తే సరిపోతుందని తెలిపింది. ‘సంతానం కోరుకునే జంట’ గా ఎవరిని పరిగణించాలన్న విషయమై బిల్లులోని నిబంధనను మార్చాలని కమిటీ సూచించింది. వివాహమైన జంట మాత్రమే సరోగసీకి అర్హులన్న నిబంధన బదులు 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసుగల మహిళలు వారు విడాకులు తీసుకున్నవారైనా, భర్తను కోల్పోయినవారైనా ఎంచుకునేలా మార్పు చేయాలని సూచించింది. అయితే ఒంటరి పురుషులు, ఒంటరి మహిళలు, సహజీవనం చేస్తున్న జంటలు, స్వలింగసంపర్కులకు బిల్లులో ఉన్న అనర్హత కొనసాగాలని పేర్కొంది. ఈ కేటగిరీలోని వారికి ఇప్పటికే దత్తత చట్టాల ప్రకారం ఎవరినైనా దత్తత తీసుకునే అవకాశం ఉంది. అటువంటప్పుడు సరోగసీలో బిడ్డను పొందే హక్కును వారికి నిరాకరించడంలో హేతుబద్ధత కనబడదు.

సరోగసీ సాంకేతికత మొదలయ్యాక మన దేశంలో అది విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. 2000 సంవత్సరంనాటికి మన దేశాన్ని అందరూ ‘క్రాడిల్‌ ఆఫ్‌ ద వరల్డ్‌’(ప్రపంచ ఊయల) అనేవిధంగా అది వ్యాపించింది. పేదరికం ఉన్నచోట ఏమైనా చేయొచ్చునన్న అభిప్రాయం సంపన్నుల్లో ఉండటం దీనికి కారణం. ఈ అంశాన్ని మొదట ప్రభుత్వం గుర్తించలేదు. మహిళా ఉద్యమకారులు, ఆరోగ్య రంగ కార్యకర్తలు గమనించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అయినా మరో ఎనిమిదేళ్లకుగానీ బిల్లు రూపొందించే ప్రక్రియ మొదలుకాలేదు. ఆ తర్వాతైనా ఆ పని చకచకా పూర్తికాలేదు. చివరకు బిల్లు తయారైనా అది కేంద్ర మంత్రివర్గం ముందుకు కూడా పోలేదు. ఈలోగా యూపీఏ పాలన ముగిసి, ఎన్‌డీఏ అధికారంలోకొచ్చింది. అనంతరం 2016లో కేంద్ర మంత్రివర్గం ముందుకు ఈ బిల్లు వచ్చింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా ఈ బిల్లును అధ్యయనం చేసి అనేక సవరణలు సూచించింది. ఆ సవరణల్లో చాలావాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు వస్తున్న తరుణంలోనే అది లోక్‌సభ ముందు కెళ్లింది. తీవ్ర గందరగోళం మధ్య పెద్దగా చర్చ లేకుండానే ఆమోదం పొందింది. బిల్లు సమగ్రంగా లేదని, సరోగసీకి ఇందులో ఎన్నో పరిమితులు విధించారని రాజ్యసభలో విమర్శలు వచ్చిన నేప థ్యంలో దీన్ని సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించారు. రెండేళ్ల అనంతరం ఇప్పుడు ఆ కమిటీ సిఫా ర్సులు రాజ్యసభ ముందుకొచ్చాయి. బిల్లు త్వరగా చట్టంగా మారితే నిరుపేద అమాయక మహిళ లకు ఇప్పుడెదురవుతున్న అనేకానేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే ఈ క్రమంలో అసలు సరోగసీ కోరుకునే జంటలకు చట్టం సమస్యాత్మకంగా మారకూడదు.

ఈ బిల్లుపై మొదటినుంచీ మహిళా సంఘాలనుంచీ, ఆరోగ్యరంగ కార్యకర్తల నుంచి ఎదుర వుతున్న మౌలిక అభ్యంతరాల గురించి సెలెక్ట్‌ కమిటీ సరిగా పట్టించుకోలేదనే చెప్పాలి. ఉదాహ రణకు సరోగసీ అనేది ‘నిస్వార్థమైనది’గా ఉండాలని బిల్లు నిర్దేశిస్తోంది. బిడ్డను కని ఇచ్చే మహిళకు అవసరమైన వైద్య ఖర్చులకూ, బీమా సౌకర్యం కల్పించడానికి సొమ్ము ఇవ్వాలి తప్ప ఇతరత్రా డబ్బిస్తే అది వాణిజ్యపరమైన సరోగసీ అవుతుందని బిల్లు చెబుతోంది. నిజానికి అన్యులైతే చట్టవిరుద్ధంగా డబ్బు ప్రమేయంతో సరోగసీ సాగుతుందని అనుమానించి, సన్నిహిత బంధువులైన మహిళలు మాత్రమే సరోగసీకి అర్హులని బిల్లులో నిబంధన పెట్టారు. సెలెక్ట్‌ కమిటీ దీన్ని తొల గించాలని సూచించడం మంచిదే అయినా... ఎవరికోసమో బిడ్డను కని ఇవ్వడానికి ఒప్పుకుని, అందుకోసం తొమ్మిదినెలలపాటు ఎన్నో సమస్యలు ఎదుర్కొనడానికి సిద్ధపడే మహిళ ఆ పని నిస్వార్థంగా చేయాలన్న నిబంధన సరికాదు. దీన్ని కూడా కమిటీ వ్యతిరేకించి ఉంటే బాగుండేది.

భారత్‌లో సంతానం లేని జంటల కోసం ఎంతో పెద్ద మనసుతో, త్యాగబుద్ధితో సరోగసీకి సిద్ధపడే మహిళలుంటారన్న భుజకీర్తులకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. డబ్బు లావాదేవీలు మాత్రం చట్టం కన్నుగప్పి సాగుతూనే ఉంటాయి. ఇందులో ఉండే సమస్యేమంటే... తొలుత అంతా మాట్లాడుకుని, ఆ తర్వాత మహిళకు సొమ్ము ఎగ్గొట్టిన పక్షంలో ఆ నిస్సహాయురాలికి చట్టం అండ దండలుండవు. పైగా ఫిర్యాదు చేస్తే ఆమె కూడా చట్టప్రకారం నిందితురాలవుతుంది. కనుక మౌనంగా ఉండిపోవాల్సివస్తుంది. అయితే సరోగసీకి సిద్ధపడే మహిళకు వైద్య ఖర్చులు, బీమా సౌకర్యంతోపాటు పౌష్టికాహార అవసరాలు, గర్భిణిగా ధరించాల్సినవి సమకూర్చుకోవడానికయ్యే ఖర్చుల్ని కూడా ఇవ్వాలన్న నిబంధన కూడా పెట్టాలని కమిటీ సూచించింది. బీమా సౌకర్యం ఇప్పుడున్న 16 నెలలనుంచి, 36 నెలలకు పొడిగించాలన్నది. ఏదేమైనా సరోగసీ బిల్లు రూపకల్పనలో మహిళా కార్యకర్తలు, ఆరోగ్య రంగ కార్యకర్తల అభిప్రాయాలకు చోటిచ్చివుంటే బాగుండేది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top