జన సంక్షేమమే లక్ష్యంగా...

Sakshi Editorial On YS Jagan Governance

ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ 341 రోజుల సుదీర్ఘకాలం ప్రజాసంకల్పయాత్రలో జన జీవితాలను నిశితంగా గమనించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దాని ప్రభావం ఎంత ఉన్నదో చెప్పడానికి అధికారం స్వీకరించింది మొదలు గత పక్షం రోజులుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు, తీసుకుంటున్న నిర్ణయాలే తార్కాణం. సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గం తొలి సమావేశంలో చేసిన తీర్మానాలన్నీ దానికి కొనసాగింపు మాత్రమే. ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేయగానే నవరత్నాల్లో ఒకటైన అవ్వాతాతల పింఛన్‌ పెంపు హామీపై ఆయన తొలి సంతకం చేశారు. ఆ ప్రమాణస్వీకారోత్సవ సభలోనే తన ప్రాధమ్యాలేమిటో, రానున్న అయిదేళ్ల కాలంలో తన అడుగులు ఎటువైపో స్పష్టంగా తెలియజేశారు. అనంతరం గత గురువారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన తొలి అధికార సమీక్షలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై దృష్టి సారించి రైతు సంక్షేమానికి చేయవలసిందేమిటో అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ప్రతి రైతు కుటుంబానికీ రూ. 12,500 పెట్టుబడి సహాయంగా అందించడానికి ఉద్దేశించిన వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని అనుకున్న దానికంటే ముందే... అంటే రబీ నుంచే అమలు చేయాలని నిశ్చయించుకున్నట్టు ప్రకటించారు. దీని వెంబడే వివిధ వర్గాలవారి సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న అనేక ఇతర నిర్ణయాలు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా చేశాయి. 

తొలి కేబినెట్‌ భేటీలోనే అవినీతి రహితమైన పారదర్శక పాలన లక్ష్యంగా పని చేయాలని మంత్రివర్గ సహచరులకు జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేయడం... అవినీతి మరక అంటి, ఆరోపణలు రుజువైన పక్షంలో ఎవరినైనా మంత్రివర్గం నుంచి తొలగించడానికి వెనకాడబోనని చెప్పడం హర్షించదగ్గది. అయిదేళ్ల తెలుగుదేశం పాలనా కాలం ఎంతగా అవినీతిలో కూరు కుపోయిందో, అధికార యంత్రాంగం ఎంత నిస్సహాయంగా ఉండిపోయిందో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ఇసుక మొదలుకొని బడా ప్రాజెక్టుల వరకూ అన్నిటిలోనూ అవినీతి వరదలై పారడం అందరినీ విస్మయ పరిచింది. మంత్రుల్ని డమ్మీలుగా మార్చి చంద్రబాబు, ఆయన అంతేవాసులు నలుగురైదుగురు పాలన మొత్తాన్ని చెరబట్టిన వైనం వల్ల రాష్ట్రం గత అయిదేళ్లలో నీరసించింది. వ్యవస్థలన్నీ పడకేశాయి. తన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా దీని ఫలితాలను ప్రత్యక్షంగా చూడటం వల్లే మంత్రివర్గ సమావేశాన్ని జగన్‌ అత్యంత ప్రజాస్వామికంగా నిర్వహించారు. ఇందులో చర్చిస్తున్న అంశాలపై సూచనలు, సలహాలు, అభ్యంతరాలుంటే నిస్సంకోచంగా చెప్పవచ్చునని ఆయన సమావేశ ప్రారంభంలోనే మంత్రులకు సూచించారు. కనుకనే గ్రామ, పట్టణ వలంటీర్ల నియామకాలకు ఎలాంటి విద్యార్హతలుండాలనే అంశంలోనైనా, గిరిజన ప్రాంతాల్లో ఉండే వైద్య వలంటీర్ల జీతాల విషయంలోనైనా క్షేత్ర స్థాయి వాస్తవాలకు అనుగుణమైన నిర్ణయాలు వెలువడ్డాయి. సమావేశ ఎజెండాలో లేని వైద్య వలంటీర్ల జీతాల అంశంపై నిర్ణయం తీసుకోవడం కూడా దీనివల్లనే సాధ్యపడింది. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఇచ్చే జీతాలను రూ. 18,000 పెంచాలన్న ప్రతిపాదనపై చర్చ జరిగిన సందర్భంగా ఇది ఆర్థిక భారం అవుతుందేమోనని కొందరు సందేహం వ్యక్తం చేసినప్పుడు ‘వారు చేస్తున్న పనికి ఎంత జీతం ఇచ్చినా సరిపోద’ంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన మంత్రివర్గ సహచరుల ఆలోచనా దృక్పథాన్ని పదునుదేరుస్తాయి. పాలనలో నిరంతరం మానవీయ స్పర్శ ఉండాలన్న స్పృహను కలిగిస్తాయి. వివిధ శాఖలకు సంబంధించి తన ముందు కొచ్చే ఏ ప్రతిపాదన అయినా మంత్రులతో చర్చించి వారి ప్రమే యంతోనే రూపొందాలని అధికారులకు ఆయన స్పష్టం చేసిన తీరు కూడా ప్రశంసించదగ్గది. అన్ని శాఖల్లోనూ సంబంధిత మంత్రుల క్రియాశీల పాత్ర కీలకమని చెప్పడం ద్వారా వారి ఆలోచన లకూ, అభిప్రాయాలకూ అత్యంత ప్రాధాన్యత ఉంటుందని తెలియజేసినట్టయింది. ఇందువల్ల విధానాల రూపకల్పనలో యాంత్రికత స్థానంలో సృజనాత్మకత పెరుగుతుంది.   

ఈ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు అందించిన ఆధిక్యత అసాధారణమైనది. దీనికి దీటుగా ఒక సమర్ధవంతమైన, క్రియాశీలమైన పాలనను అందించి వారి ఆకాంక్షలను నూరు శాతం నెరవేర్చాలన్న పట్టుదలతో జగన్‌మోహన్‌ రెడ్డి ఉన్నారు. మంత్రివర్గం కూర్పులోనే ఆయన దీన్ని ప్రస్ఫుటం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండే నాయకుడు తన విధివిధానాలను ఖరారు చేసుకుని, దానికి అనుగుణమైన ఎజెండాను రూపొందించుకుని రంగంలోకి దిగుతాడు. ఆ దిశగా పరిపాలనా శకటాన్ని ముందుకు నడపాలంటే ముందుగా చేయాల్సింది మంత్రివర్గ నిర్మాణం. ఆ కసరత్తు అత్యంత సంక్లిష్టమైనది. నాయకుడి దీక్షాదక్షతలు, చాకచక్యమూ, ముందుచూపూ వెల్లడయ్యేది ఆ కసరత్తులోనే. అన్ని వర్గాలనూ, ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అటు సామాజిక న్యాయానికి, ఇటు ప్రాంతాల ఆకాంక్షలకు మధ్య సమతూకం చూడాలి. అనుభవాన్ని గుర్తించాలి. దిగ్గజాలనదగ్గవారిని ఎక్కడెక్కడ వినియోగిం చుకోవాలో లెక్కేసుకోవాలి. అదే సమయంలో కొత్తగా ఎదిగివస్తున్నవారిలో ఎవరెవరికి ఏఏ రంగాలపై లోతైన అవగాహన ఉన్నదో అంచనా వేసుకోవాలి. ఇన్నిటిని బేరీజు వేసుకుంటూ జగన్‌ రూపొందించిన కేబినెట్‌లో దాదాపు 60 శాతం మంత్రి పదవులు, అత్యంత కీలక శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లభించాయి. అంతేకాదు... స్పీకర్‌ పదవిని కూడా బీసీ వర్గానికే ఇవ్వడం, ఎస్సీ మహిళకు హోంమంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగించడం, ముగ్గురు మహిళలకు కేబినెట్‌లో స్థానం కల్పించడం జగన్‌ విలక్షణ శైలికి అద్దం పడుతుంది. ఇప్పుడు కేబినెట్‌ తొలి సమావేశంలో జరిగిన చర్చలైనా, తీసుకున్న నిర్ణయాలైనా ప్రజానీకం ఆశలకూ, ఆకాంక్షలకూ అను గుణంగా ఉన్నాయి. ఇలాంటి పాలన చిరకాలం వర్థిల్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top