శబరిమలపై విస్తృత ధర్మాసనం

Sakshi Editorial On Supreme Court Verdict On Sabarimala

చట్టం ప్రధానమా, విశ్వాసం ప్రధానమా అనే అంశంపై అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు  రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఇచ్చిన తీర్పులో అందరూ ఆశించినట్టు స్పష్టత లభించలేదు. శబరిమలలో మహిళ ప్రవేశంపై ఉన్న విధినిషేధాలనూ, వాటితోపాటు ఇతర మతాల్లోని వివక్షను కూడా పరిశీలించి తేల్చడానికి ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనమే సరైందని 3–2 మెజారిటీతో ధర్మాసనం అభిప్రాయపడింది. కనుక ఈ వివాదం దీర్ఘకాలం కొనసాగక తప్ప దు. ఆ ఆలయంలో 10–50 సంవత్సరాల మధ్య వయసున్న ఆడవాళ్ల ప్రవేశంపై అమలవుతున్న ఆంక్షలు చెల్లబోవని, అవి రాజ్యాంగ విరుద్ధమని నిరుడు సెప్టెంబర్‌లో ఇచ్చిన మెజారిటీ తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడు దానిపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వలేదు గనుక ఆలయ ప్రవేశం కోసం సహజంగానే మహిళలు శబరిమలకు వెళ్లే అవకాశం ఉంటుంది.

ఈ నెల 17న శబరిమల ఆలయం తలుపులు మళ్లీ తెరుచుకోబోతున్నాయి. నిరుడంతా జరిగిన ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచు కుని శాంతిభద్రతల పరిరక్షణపై కేరళ ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుంది. నిరుడు తీర్పు వెలువ రించిన ధర్మాసనంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, న్యాయమూ ర్తులు జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా,  జస్టిస్‌ ఖాన్విల్కర్, జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌లున్నారు. వీరిలో మిగిలిన నలుగురూ ఆం క్షలు చెల్లబోవని తీర్పునివ్వగా, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా మెజారిటీ సభ్యులతో విభేదించి అసమ్మతి తీర్పు వెలువరించారు. ఏది అవసరమైన మతా చారమో, ఏది కాదో నిర్ణయించుకోవాల్సింది మత మే తప్ప న్యాయస్థానం కాదని ఆమె అభిప్రాయ పడ్డారు.  ఇప్పుడు ఆ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లనే సుప్రీంకోర్టు విచారించి తాజా తీర్పుని చ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఏ ఎం ఖాన్విల్కర్, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలు శబరిమల వివాదంతోపాటు ఇతర మతా ల్లోని వివక్షను కూడా విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తేల్చాలని అభిప్రాయపడగా...జస్టిస్‌ ఆర్‌ ఎఫ్‌ నారిమన్, జస్టిస్‌ డీ వై చంద్రచూడ్‌లు కేవలం శబరిమల వివాదాన్ని మాత్రమే విస్తృత ధర్మా సనా నికి నివేదించాలని భావించారు.

దేశంలో బహురూపాల్లో అమలవుతున్న లింగ వివక్షపై మహిళా సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు పోరాడుతుంటాయి. అయితే వివిధ మతాల్లో స్త్రీల పట్ల ఆచారాలు, సంప్రదాయాల పేరిట అమలవుతున్న ఆంక్షల గురించి ఎప్పుడూ ఎవరూ పట్టించుకోలేదు. మతం వెలుపలి వ్యక్తు లను పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం, మసీదుల్లోకి మహిళలను అనుమతించకపోవడం వగైరాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారున్నట్టే...మహారాష్ట్రలోని శని సింగణాపూర్‌లోనూ, శబరిమలలోనూ మహిళలకు ప్రవేశం లేకపోవడం తదితరాలపై కూడా కొందరు ఉద్యమించారు. శనిశింగణాపూర్‌ వివాదం పరిష్కారమైంది. ఆ ఉద్యమ ధాటికి దశాబ్దాల నాటి వివక్షను అక్కడి ఆలయ నిర్వాహకులు రద్దుచేశారు.  ఒక మతానికి తప్పనిసరిగా పాటించాల్సిన ఆచారాలేమిటో, తప్పనిసరికానివేమిటో తేల్చి...వివాదం తలెత్తిన అంశం ఏ జాబితాలోనికొస్తుందో నిర్ధారించడం, దాని ఆధారంగా ఆ ఆచా రాన్ని అంగీ కరించడమో లేదా తోసిపుచ్చడమో విస్తృత ధర్మాసనం తేల్చవలసి ఉంది. 1954లో తన ముందుకొచ్చిన శిరూర్‌మuŠ‡ కేసులో సుప్రీంకోర్టు ఈ గీటురాయిని రూపొందించింది. దాని ఆధారంగానే  అంటరానితనం, దళితులకు ఆలయ ప్రవేశ నిరాకరణ వంటివి హిందూ మతంలో తప్పనిసరి ఆచారాలు కాదని...ఆ మతానికి చెందిన శాస్త్రాలేవీ వాటిని సమర్థించడంలేదని సుప్రీం కోర్టు నిర్ధారించి అవి పాటించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. అలాగే మసీదులో నమాజ్‌ చేయడం ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని 1994లో రాజ్యాంగ ధర్మాసనం తేల్చింది. ముస్లింలు ఎక్కడైనా నమాజ్‌ జరుపుకుంటారు గనుక దీన్ని తప్పనిసరి ఆచారంగా పరిగణించలేమని తేల్చింది. అయితే ఈ గీటురాయితో రాజ్యాంగ నిపుణుల్లో చాలామంది ఏకీ భవించరు. తన ముందుకొచ్చే అంశం రాజ్యాంగపరంగా సమ్మతమా కాదా అన్నది చూడాలి తప్ప...మతపరమైన లోతుపాతుల్లోకి పోవడం సమంజసం కాదని వారంటారు. 

‘తప్పనిసరి ఆచారాల’ గీటురాయిని బట్టి చూస్తే శబరిమలలో మహిళల ప్రవేశం నిరాకరణకు న్యాయపరమైన మద్దతు ఎంతవరకూ మద్దతు లభిస్తుందో చూడాలి. ఎందుకంటే దేశంలో 20 లక్షలకు పైగా ఆలయాలుంటే వాటిల్లో కొన్నిచోట్ల మాత్రమే ఇలాంటి విధినిషేధాలు అమలవు తున్నాయి. మతాచారమే అయినపక్షంలో అది అన్నిచోట్లా సమంగా అమలయ్యేది. అయితే శబ రిమలలో మహిళలను సైతం అనుమతించాల్సిందేనని ఉద్యమించినవారు అయ్యప్పస్వామి భక్తులే తప్ప హేతువాదులు కాదు. ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఈ వివాదాన్ని పరిష్క రించడానికి ఎంత వ్యవధి తీసుకుంటుందో చెప్పలేం. ఎందుకంటే అది ఏడు అంశాలను తేల్చవలసి ఉంది. పైగా అవన్నీ మూడు మతాలకు చెందిన వివాదాస్పద అంశాలు. మత స్వేచ్ఛకు వీలు కల్పి స్తున్న రాజ్యాంగంలోని 25వ అధికరణ చెబుతున్న సహేతుకమైన పరిమితులేమిటో అది ప్రధానంగా నిర్ధారించవలసి ఉంది. అయితే జస్టిస్‌ నారిమన్, జస్టిస్‌ చంద్రచూడ్‌లిచ్చిన మైనారిటీ తీర్పులోని అంశాలు కీలకమైనవి. రివ్యూ పిటిషన్లను విచారించే ధర్మాసనం కేవలం అందులోని అంశాలను మాత్రమే విస్తృత ధర్మాసనానికి అప్పగించాలి తప్ప, ఆ పిటిషన్లలో ప్రస్తావనకు రాని ఇతర అంశాల జోలికి పోరాదని వారిద్దరూ అభిప్రాయపడ్డారు. ఇస్లాం, పార్సీ మతాల్లోని వివక్ష ఈ ధర్మాసనం పరిశీలనలో లేనప్పుడు దాన్ని అప్పగించే అధికారం ఉండబోదని చెప్పారు. మొత్తానికి ఎంతో ఉత్కం ఠను, ఉద్రిక్తతలను రేకెత్తించగల శబరిమల వివాదం పరిష్కారానికి దీర్ఘకాలమే పడుతుంది. వివాదం కట్టుదాటకుండా, శాంతిభద్రతలకు ముప్పు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదీ, ప్రజా నీకానిది కూడా.  

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top