కదలిన అస్సాం తేనెతుట్టె

Sakshi Editorial On Assam NRC List

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధానాల పర్యవసానంగా తమ భవితవ్యం ఏమవుతుందోనని అక్కడ స్థిరపడిన మన వృత్తి నిపుణులు ఆందోళన పడుతున్న తరుణంలో ఈశాన్య భారతంలోని అస్సాం జనాభాలో ఈ దేశ పౌరులెందరు, ‘ఇతరులు’ ఎందరని ఆరా తీసే ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం విడుదల చేసిన జాతీయ పౌర గుర్తింపు(ఎన్‌ఆర్‌సీ) తుది ముసాయిదా ప్రకారం ఆ రాష్ట్రంలోని 2 కోట్ల 89 లక్షల83 వేల 677మంది ఈ దేశ పౌరులని, మిగిలిన 40.07 లక్షలమంది విదేశీయులని నిర్ధారణ చేశారు. ఇది తుది ముసాయిదాయే తప్ప తుది జాబితా కాదని భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ శైలేష్‌తోపాటు అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌ కూడా ప్రక టించారు. అయితే ఇలాంటి ప్రకటనలు ‘దేనికీ చెందని’ లక్షలాదిమందిని కుదుటపరచలేవు. వారు ఈ జాబితాలో చోటు సంపాదించుకోవటం కోసం కొత్తగా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. అడిగిన ఆధారాలన్నిటినీ జత చేయాలి. తమ పూర్వీకులు ఈ దేశ పౌరులేనని చెప్పడానికి 1951 లేదా 1971నాటి గుర్తింపు పత్రాలను అందజేయాలి. ఎందుకంటే... ఆ రాష్ట్రంలో 1951లో తొలి ఎన్‌ఆర్‌సీ రూపొందగా 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీకి, అస్సాం ప్రభుత్వానికి, ఉద్యమ నాయకులకు మధ్య కుదిరిన ఒప్పందంలో రెండో ఎన్‌ఆర్‌సీకి 1971 మార్చి 24ను ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణ యించారు. అయితే తాము అవసరమైన పత్రాలన్నీ జత చేసినా పేర్లు గల్లంతయ్యాయని చెబుతున్న వారున్నారు. తమ కుటుంబంలో కొందరి పేర్లు జాబితాలో ఉన్నా మరికొందరివి లేవని ఆందోళన పడుతున్నవారున్నారు. 40.07 లక్షలమందిలో అత్యధికులు ముస్లింలు అయి ఉండొచ్చుగానీ, కొందరు హిందువులకూ జాబితాలో అన్యాయం జరిగిందని ఆరోపణలొస్తున్నాయి. అంతర్జాతీయ ఒడంబడికలు ఏం చెబుతున్నా మన దేశంలో పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత ప్రజానీకానిదే.
 
తాతముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్న పొలం నీది కాదంటే ఎవరికైనా కాళ్ల కింది భూమి కదిలిపోతుంది. కుటుంబం మొత్తం అల్లకల్లోలమవుతుంది. అలాంటిది దశాబ్దాలకిందట అస్సాం కొచ్చి స్థిరపడినా, తరాలు గడిచిపోయినా ‘మీరు విదేశీయుల’ంటూ ముద్ర వేస్తే వారు ఏమైపోతారో సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. పైగా ఆ రాష్ట్రం జాతి సమస్యతో అట్టుడికిన చరిత్రగల అత్యంత సున్నితమైన ప్రాంతం. 1979–85 మధ్య ఆ రాష్ట్రంలో మహోధృతంగా సాగిన ఉద్యమానికి ప్రధాన కారణం వలసలే. విదేశీయులను గుర్తించి వారిని తక్షణం పంపేయాలన్నది ఆ ఉద్యమం ప్రధాన డిమాండు. ఆ తర్వాతే అక్రమ వలసదారుల గుర్తింపు కోసం పౌరసత్వ గణన చేయాలన్న నిర్ణయం జరిగింది. అయితే ఉద్యమనాయకులే అనంతరకాలంలో అధికారంలోకొచ్చినా అస్సాంలో ఎన్‌ఆర్‌సీ  పని మొదలుపెట్టలేకపోయారు. అటు తర్వాత వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలదీ ఇదే వరస. 2010 వరకూ నత్తనడకన సాగిన పని కాస్తా ఆ తర్వాత ఆగిపోయింది. చివరకు 2014లో దాఖలైన పిటి షన్‌తో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని గడువు నిర్ణయించింది. ఇన్నాళ్లకు ఎన్‌ఆర్‌సీ తుది ముసాయిదా సిద్ధమైంది. ఈ ముసాయిదాలో పేర్లు లేని 40 లక్షలమందీ సెప్టెంబర్‌ ఆఖరుకల్లా విదేశీయులేనని నిర్ధారణ అయితే వారు ‘రాజ్యం లేని పౌరులు’గా మారతారు. అలా ముద్రపడినవారి విషయంలో ఏం చేస్తారన్న స్పష్టత ఇప్పటికైతే లేదు. వారిని స్వీకరించమని బంగ్లాదేశ్‌ను కోరతారా, ప్రత్యేక శిబి రాలు పెట్టి తరలిస్తారా అన్నది చూడాల్సి ఉంది. పౌరసత్వాన్ని నిరూపించుకోలేనివారు బంగ్లాదేశీ యులేనని ప్రభుత్వం భావిస్తున్నా, వారిని వెనక్కి తీసుకోవాలని ఇంతవరకూ కేంద్రం అధికారికంగా బంగ్లాదేశ్‌ను కోరలేదు. తమ పౌరులెవరూ భారత్‌లో లేరని ఇప్పటికే బంగ్లా ప్రకటించింది. నలభై లక్షలమంది జనాభా అంటే మాటలు కాదు. ఈ స్థాయి జనాభా కలిగిన దేశాలు ప్రపంచంలో వంద వరకూ ఉన్నాయి. అస్సాంలో 60, 70 దశకాల్లో ‘బొంగాల్‌ ఖేదా’(బెంగాలీలను బహిష్కరించండి) నినాదంతో సాగిన ఉద్యమం పర్యవసానంగా ఏళ్ల తరబడి ఉంటున్న వేలాదిమంది బెంగాలీలు ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు వదులుకుని ప్రాణభయంతో పశ్చిమబెంగాల్‌కి వెళ్లాల్సి వచ్చింది. అస్సాం ఉద్యమం సమయంలో 1983లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించి నప్పుడు నౌగాన్‌ జిల్లాలోని దాదాపు 14 గ్రామాలపై అల్లరి మూక విరుచుకుపడి వేలాదిమందిని ఊచకోత కోసింది. ఈ ఊచకోతలో ప్రాణాలు కోల్పోయినవారికి సంబంధించి నేటికి కూడా అధి కారిక లెక్కలు వెల్లడి కాలేదు. పదివేలమంది మరణించి ఉంటారని అనధికార అంచనా.  

ఎన్ని దశాబ్దాలు, ఎన్ని శతాబ్దాలు అన్న తేడా తప్ప వలసల ప్రమేయం లేకుండా ఏర్పడిన దేశాలు ఈ ఆధునిక ప్రపంచంలో ఎక్కడా ఉండవు. అయితే ఎక్కడినుంచో కొత్తగా వచ్చి స్థిరపడిన వారి సంఖ్య క్రమేపీ పెరుగుతూ పోతుంటే, వనరులపై వారి ఆధిపత్యం పెరుగుతుంటే స్థానికుల్లో ఆందోళన రాజుకోవటం సహజం. ఈ వైరుధ్యాన్ని సకాలంలో గుర్తించి పరిష్కరించకపోతే అది క్రమేపీ ఉగ్రరూపం దాలుస్తుంది. ఉపేక్షిస్తే అది పరస్పర హననానికి, ఇతర వైపరీత్యాలకు దారి తీస్తుంది. అస్సాంలో టీ ప్లాంటేషన్‌లలో పనిచేయించడానికి 19వ శతాబ్దంలో బ్రిటిష్‌ పాలకులు తెలుగునాట ఏజెన్సీ ప్రాంతాలతో మొదలుపెట్టి బిహార్, బెంగాల్‌ వగైరా రాష్ట్రాల నుంచి వేలా దిమందిని తరలించారు. అలా వెళ్లినవారిలో బెంగాలీ హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. అహోం, కలిత, చౌతియా తదితర జాతులవారు అస్సామీలుకాగా, కూలీలుగా వెళ్లి తరతరాలుగా స్థిరపడ్డవారు ఈనాటికీ అస్సామేతరులన్న ముద్రతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పుడు అస్సాంతో అయిపోలేదు. తమ రాష్ట్రాల్లోనూ ఎన్‌ఆర్‌సీ గణన ప్రారంభించాలని మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో డిమాండ్లు బయల్దేరాయి. కనుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత జాగురూకతతో వ్యవహ రించాలి.  మయన్మార్‌లో రోహింగ్యాలు చవిచూస్తున్న దుర్భర పరిస్థితులు ఇక్కడ ‘విదేశీయులు’గా ముద్రపడినవారికి ఎదురుకాకుండా చూడాలి. మన దేశానికి అప్రదిష్ట కలగకుండా సామరస్యపూర్వ కంగా పరిష్కరించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top