నిరసన హక్కుకు ఊపిరి

Ordered Cancelled That Protest Against Jantar Mantar - Sakshi

జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్‌జీటీ) నుంచి ఊహించని రీతిలో భావ ప్రకటనా స్వేచ్ఛకు వచ్చి పడిన ముప్పు తప్పింది. ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద సభలూ, సమావేశాలూ జరపడాన్ని నిలిపేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. తరచు జరిగే సభలూ, సమావేశాల వల్ల ఆ ప్రాంతం కాలుష్యమయం అయిందని, అక్కడ ఆందోళనలకు తావు లేకుండా చర్యలు తీసుకోవటం తక్షణావసరమని నిరుడు అక్టోబర్‌లో ట్రిబ్యునల్‌ ఉత్తర్వులిచ్చింది. సాధారణంగా ట్రిబ్యునల్‌ ఇచ్చే ఉత్తర్వుల అమలులో అలసత్వాన్ని ప్రదర్శించే ప్రభుత్వ యంత్రాంగం హుటాహుటీన వాటిని అమలు చేసి ఆ ప్రాంతంలో నిరసన స్వరం వినబడకుండా జాగ్రత్తపడింది. అయితే సభలూ, సమావేశాల వల్ల సమస్యలుంటే వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి తప్ప అసలు నిరసనలకే చోటీయరాదనుకోవటం అప్రజాస్వా మికమవుతుందని సర్వోన్నత న్యాయస్థానం తాజా తీర్పులో స్పష్టం చేసింది. 

 ఏడాది పొడవునా ఎడతెగకుండా సాగే నిరసనల వల్ల జంతర్‌మంతర్‌ వాసులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వచ్చిన ఫిర్యాదుల్లో అవాస్తవం లేకపోవచ్చు. వివిధ సంస్థలు, పార్టీలు ఏదో ఒక సమస్యపై అక్కడ సభలూ, సమావేశాలూ నిర్వహిస్తాయి. వాటిల్లో పాలుపంచుకోవటానికి వేర్వేరు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజానీకం అక్కడికొస్తుంది. అంతమంది జనం ఒకచోట గుమిగూడి నప్పుడు ట్రాఫిక్‌ సమస్య మొదలుకొని ఎన్నో సమస్యలు వస్తాయి. పారిశుద్ధ్యం కూడా అందులో ఒకటి.  నిరసన తెలపడానికి వచ్చిన వారిని అందుకు నిందించి ప్రయోజనం లేదు. భారీ సంఖ్యలో పౌరులు వచ్చినప్పుడు వారికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది.

ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూడటం, తగినన్ని మరుగుదొడ్లు ఉండేలా చూడటం, నిర్ణీత సమయం తర్వాత మైకులు ఉపయోగించరాదని నిబంధనలు విధించటం వంటివి అమలు చేయటం ద్వారా స్థానికులు ఎదుర్కొంటున్నామని చెబుతున్న ఇబ్బందులను తొల గించడానికి వీలుంది. హరిత ట్రిబ్యునల్‌ ఈ కోణంలో ప్రభుత్వానికి తగిన మార్గదర్శకాలిచ్చినా... కనీసం ప్రభుత్వం తనకు తాను ఈ మాదిరి చర్యలు తీసుకున్నా బాగుండేది. కానీ ట్రిబ్యునల్‌ ఆదే శాలివ్వటమే తరవాయి అన్నట్టు జంతర్‌మంతర్‌లో నిరసనలను నిషేధించింది. ట్రిబ్యునల్‌ ఆ ఉత్తర్వులిచ్చే సమయానికి ‘ఒకే ర్యాంకు–ఒకే పెన్షన్‌’ కోరుతూ మాజీ సైనికులు జంతర్‌మంతర్‌లో నిరసన ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

పోలీసులు ఆ మాజీ సైనికులు వేసుకున్న టెంట్లు కూలగొట్టి, అక్కడినుంచి వెళ్లగొట్టారు. వీరంతా సైన్యంలో ఉన్నతస్థాయి అధికారులుగా, సాధారణ జవాన్లుగా పనిచేసి రిటైరైనవారు. రణరంగంలో శత్రువుతో తలపడి దేశ రక్షణకు నిలబడిన యోధుల గోడు పట్టించుకోకపోవడమే అన్యాయమనుకుంటే...దాన్ని బలంగా వినిపించటం కోసం నిరసన ప్రదర్శ నలు నిర్వహిస్తుంటే అందుకు సైతం అవకాశమీయలేదు. అదేమంటే ట్రిబ్యునల్‌ ఆదేశాలు పాటిస్తు న్నామని జవాబు! అసలు ట్రిబ్యునల్‌ ప్రధాన వ్యాపకం పర్యావరణ పరిరక్షణ. గాలి, నీరు కాలుష్య మయం చేసే చర్యలను అరికట్టడం, అడవులు అంతరించిపోకుండా, ఎడాపెడా మైనింగ్‌ కార్యకలా పాలు సాగకుండా చూడటం దాని బాధ్యతలు. నిరసనలవల్ల కాలుష్యం ఏర్పడుతుందని, దాన్ని నియంత్రించడం కూడా తన కర్తవ్యమేనని ట్రిబ్యునల్‌కు ఎందుకు అనిపించిందో!

 
తాము వేయికళ్లతో సుభిక్షంగా పాలిస్తున్నామని, సమాజంలో ఏ వర్గానికీ అన్యాయం జరిగే అవకాశం లేదని పాలకులు తమకు తాముగా నిర్ణయించుకుంటే చెల్లదు. అసహాయులను గొంతె త్తనీయాలి. జరుగుతున్న అన్యాయాలేమిటో చాటడానికి అవకాశమీయాలి. అప్పుడే పొరపాట్లు సరిదిద్దుకోవటానికి అవకాశముంటుంది. అదే ప్రజాస్వామ్యమనిపించుకుంటుంది. ఏం జరిగినా తమకు విన్నపాలు చేసుకుని నోర్మూసుకోవాలని, వినతిపత్రాలిచ్చి సరిపెట్టుకోవాలని భావిస్తే కుదరదు. ఢిల్లీ వీధుల్లో కదులుతున్న బస్సులో ఆరేళ్లక్రితం ఒక యువతిపై అత్యాచారం జరిపి, ఆమెనూ, ఆమెతో ఉన్న మరో యువకుణ్ణి చావుబతుకుల మధ్య నడిరోడ్డుపై విసిరేసినప్పుడు జంత ర్‌మంతర్‌లో జనాగ్రహం కట్టలు తెంచుకుంది.

ఎన్నివిధాలుగా ఉద్యమాన్ని అణచాలనుకున్నా అది ఉవ్వెత్తున ఎగసింది. ఫలితంగా అత్యాచారాలను అరికట్టడానికి నిర్భయ చట్టం అమల్లోకొచ్చింది. ఆ చట్టం ఆచరణలో ఎలా విఫలమవుతున్నదన్న అంశం పక్కనబెడితే సమస్య తీవ్రత అర్ధం కావ టానికి, అది తక్షణం పరిష్కరించాల్సి ఉన్నదని సర్కారు గ్రహించటానికి జంతర్‌మంతర్‌ నిరసన ఎంతగానో తోడ్పడింది. సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం, భూసేకరణ చట్టం, అట్టడుగు వర్గాలవారికి అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు గాల్లోంచి ఊడిపడలేదు. పాలకులకు ఏ బోధివృక్షం నీడనో జ్ఞానోదయం కావడం వల్ల రూపొందలేదు. ధర్నాలు, నిరసనలు, ఉద్యమాలు పోటెత్తడం వల్లే... తమకు కావాల్సిందేమిటో ప్రజలు ఎలుగెత్తి చాటడం వల్లే ప్రభుత్వాల్లో కదలిక వచ్చింది.

నల్లజెండాలు కనబడకపోతే, నినాదాలు వినబడకపోతే, మా డిమాండ్ల సంగతేమిటని ఎవరూ నిలదీయకపోతే పాలకులకు బాగానే ఉంటుంది. అలాగే ఎటు చూసినా భజన బృందాల సందడి కనిపిస్తే సంతోషంగానే అనిపిస్తుంది. కానీ అది గల్ఫ్‌ దేశాల్లోనో, ఉత్తరకొరియాలోనో, చైనాలోనో సాధ్యం కావచ్చుగానీ ఇక్కడ కుదరదు. దురదృష్టకరమైన సంగతేమంటే... ఈమధ్యకాలంలో అన్ని ప్రభుత్వాలూ నిరసనల విషయంలో ఒకేలా ప్రవర్తిస్తున్నాయి. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ ఉండొద్దని తెలంగాణ సర్కారు, అమరావతిలో ప్రశ్నిస్తే పాపమని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వమూ నిరసనల నోరు నొక్కుతున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జంతర్‌మంతర్‌ నిరసనల విషయంలో వెలువరించిన తీర్పు వెనకున్న స్ఫూర్తిని గ్రహించి అయినా అన్ని ప్రభుత్వాలూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. ప్రజాస్వామిక హక్కులను గౌరవించాలి.
 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top