సరైన నేతకు ‘నోబెల్‌ శాంతి’

Nobel Peace Prize 2019 For Ethiopia PM Ahmed Ali - Sakshi

శాంతి అంటే యుద్ధం లేకపోవడం ఒక్కటే కాదు... సమాజంలో అందరూ గౌరవంగా బతికే స్థితి కల్పించడం, సమానత్వం సాధించడం. ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్‌ను ఈ ఏడాది నోబెల్‌ శాంతి పురస్కారానికి ఎంపిక చేస్తూ... పొరుగు దేశమైన ఎరిట్రియాతో రెండు దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధానికి స్వస్తి పలికి, ఆ దేశంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని నోబెల్‌ ఎంపిక కమిటీ శుక్రవారం ప్రకటించింది. అబీ సాధించిన ఇతరేతర విజ యాలు ఆ కమిటీ పరిశీలనలోకి రాకపోయి ఉండొచ్చు. లేదా వారు నిర్దేశించుకున్న నిబంధనల చట్రంలో అవి ఒదిగి ఉండకపోవచ్చు. కానీ ఆ విజయాల్లో అనేకం అత్యుత్తమమైనవి. చాలా దేశాల్లో పాలకులు అమలు మాట అటుంచి... కనీసం ఆలోచించడానికి కూడా సాహసించనివి. ఇథియో పియాలో అబీ అహ్మద్‌ అధికార పగ్గాలు చేపట్టి ఏడాదైంది. ఇంత తక్కువ వ్యవధిలోనే ఆయన అనూ హ్యమైన విజయాలు సాధించారు. ఆయన అనుసరించిన విధానాలు ఇథియోపియా సమాజంలో అన్ని వర్గాలు గౌరవంగా బతికే స్థితిని కల్పించాయి. దశాబ్దాలుగా ఇథియోపియాలో తెగల మధ్య సాగుతున్న ఘర్షణలను ఆయన చాలావరకూ నియంత్రించగలిగారు. లింగ వివక్షను అంతమొం దించే దిశగా అవసరమైన చర్యలు తీసుకున్నారు. తమ పొరుగున ఉన్న సుడాన్‌లో సైనిక పాలకు లకూ, నిరసనోద్యమ నేతలకూ మధ్య ఎడతెగకుండా సాగుతున్న పోరును ఆపి వారి మధ్య సామర స్యాన్ని నెలకొల్పారు. దేశంలో గత పాలకులు జైళ్లల్లో కుక్కిన వేలాదిమంది రాజకీయ ఖైదీలకు విముక్తి కల్పించారు. వారిని చిత్రహింసలపాలు చేసిన గత ప్రభుత్వ తీరుకు క్షమాపణ చెప్పి వారం దరికీ సాంత్వన చేకూర్చారు.

ఉగ్రవాదులుగా ముద్రపడి వేరే దేశాలకు వలసపోయిన వేలాదిమంది తిరిగొచ్చేందుకు దోహదపడ్డారు. పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరించారు. గత ఏడాది నుంచి ఇంతవరకూ పాత్రికేయులను కటకటాల్లోకి నెట్టని ఏకైక దేశం ప్రపంచంలో ఇథియోపియా ఒక్కటే అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ప్రకటించిందంటే అబీ గొప్పతనమేమిటో తెలుసుకోవచ్చు. అంతక్రితం వరకూ మీడియాపై అమల్లో ఉన్న ఆంక్షలన్నిటినీ తొలగించారు. భావప్రకటనా స్వేచ్ఛకు వీలు కల్పించారు. దేశంలోని అమ్హారా ప్రాంతంలో మొన్న జూన్‌లో సైనిక తిరుగుబాటు తలెత్తిన ప్పుడు మాత్రం కొన్ని రోజులపాటు తాత్కాలికంగా ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత క్షమా పణ చెప్పి పునరుద్ధరించారు. అధికారంలోకొచ్చి అయిదారు నెలలు గడవకముందే జనాభాలో సగ భాగంగా ఉన్న మహిళలకు అన్ని స్థాయిల్లోనూ సమానావకాశాలు దక్కేందుకు అబీ చర్యలు ప్రారం భించారు. తన కేబినెట్‌లో 50 శాతం స్థానాలను వారికి కేటాయించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో మాట్లాడి ఏకాభిప్రాయం సాధించి దేశాధ్యక్ష పదవికి తొలిసారి మహిళ ఎన్నికయ్యేలా చూశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను ఎంపిక చేశారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసి, అవినీతికి ఆస్కారం లేకుండా చేయడం అబీ సాధించిన విజయాల్లో ప్రధా నమైనది. వచ్చే ఏడాది దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా స్వేచ్ఛాయుత ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన వాగ్దానం చేశారు.

ఆఫ్రికా అంటే ప్రపంచంలోని ఇతరచోట్ల చిన్న చూపు ఉంటుంది. మీడియాలో ఆ ప్రపంచం గురించిన వార్తలు పెద్దగా ఉండవు. ఆఫ్రికా దేశాల మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడో, ఉగ్రవాద దాడుల్లో భారీ సంఖ్యలో జనం మరణించినప్పుడో ఆ దేశాల ప్రస్తావన కనబడుతుంది. ఆ సమయాల్లో మాత్రమే ఆఫ్రికా ఖండం గుర్తొస్తుంది.  కనుక అక్కడి నేతల గురించి, వారు సాధిస్తున్న విజయాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. అబీ కూడా తన సంస్కరణ విష యంలో హంగూ ఆర్భాటం ప్రదర్శించలేదు. తాను అమలు చేస్తున్న నిర్ణయాల వల్ల కలిగే ఫలితా లేమిటన్న అంశంపైనే అధికంగా  దృష్టి సారించారు. అవన్నీ ఇప్పుడు కళ్లముందు కనబడుతు న్నాయి. వీటిల్లో పాశ్చాత్య ప్రపంచాన్ని అబీ అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం వగైరాలు ఆకర్షించి ఉండొచ్చు. ఎర్ర సముద్రానికి ఆవల ఉన్న ఇథియో పియాలో జరుగుతున్నదేమిటో... వాటివల్ల ఎలాంటి సత్ఫలితాలు వస్తున్నాయో యెమెన్, ఇతర గల్ఫ్‌ దేశాలు గుర్తించాయి. పొరుగునున్న ఉన్న సోమాలియా, జిబౌతి, సుడాన్, దక్షిణ సుడాన్‌ దేశాలు సైతం అబీని స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

పదికోట్లమంది జనాభా ఉన్న ఇథియోపియాలో ప్రధానంగా ఉన్న నాలుగైదు తెగల మధ్య నిత్యం సాగే ఘర్షణలు, పొరుగునున్న ఎరిట్రియాతో యుద్ధం ఆ దేశాన్ని కుంగదీశాయి. ఆ యుద్ధం వల్ల 80,000మంది మరణించడం మాత్రమే కాదు...లక్షలమంది వలసలు పోయారు. ఈ నిరర్ధక యుద్ధంవల్ల అసలే పేద దేశాలుగా ఉన్న ఎరిట్రియా, ఇథియోపియా ఆర్థికంగా మరింత కుంగి పోయాయి. దీన్నంతటినీ అబీ చాలావరకూ చక్కదిద్దగలిగారు. ఈసారి ఆయనతో నోబెల్‌ శాంతి బహుమతికి పోటీపడినవారిలో స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి పదహారేళ్ల గ్రేటా థన్‌బర్గ్‌ ఉంది. సాధారణంగా నోబెల్‌ శాంతి బహుమతి చుట్టూ ఎప్పుడూ వివాదాలు అల్లుకుంటాయి. రేసులో చాలా ముందున్నారని భావించినవారి పేరు ఒక్కోసారి పరిశీలనకే రాదు. అలాగే శాంతి బహుమతి ప్రకటించిన వెంటనే ఎంపికైనవారి అనర్హతలపై ఎక్కువ చర్చ ఉంటుంది. కానీ ఈ ఏడాది అబీ విష యంలో దాదాపుగా అలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదంటే అందుకు ఆయన వ్యక్తిత్వం, ఆయన వరసపెట్టి తీసుకుంటున్న చర్యలు కారణం. ప్రపంచంలో నాగరిక దేశాలుగా చలామణి అవుతు న్నవి, అలా చలామణి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నవి అబీ తీసుకుంటున్న చర్యలనూ, ఇథియోపి యాను ప్రజాస్వామిక దేశంగా, శాంతికాముక దేశంగా తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న ప్రయత్నా లనూ గమనించాల్సి ఉంది. ఇప్పుడు ప్రకటించిన నోబెల్‌ శాంతి అందుకు దోహదపడితే మంచిదే. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top