వెనక్కి తగ్గిన ట్రంప్‌!

Editorial On Donald Trump Statements In G7 Summit - Sakshi

వెనకా ముందూ చూడకుండా తోచినట్టు మాట్లాడటం...ఆ తర్వాత సర్దుకోవడం అలవాటైపోయిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీర్‌ విషయంలో ఎట్టకేలకు వెనక్కి తగ్గారని తాజాగా ఆయన వ్యాఖ్యలు చెబుతున్నాయి. ఫ్రాన్స్‌లోని బియరిట్జ్‌లో జరుగుతున్న జీ–7 దేశాల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ కలుస్తున్నప్పుడు కశ్మీర్‌ విషయంలో ట్రంప్‌ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తారోనని భావించినవారిని ఈ వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచి ఉంటాయి. పైగా నేతలిద్దరి చర్చల్లో అసలు కశ్మీర్‌ అంశం ప్రస్తావనకే రాలేదని మన విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే చెబుతున్నారు. 

ఈ నెల 5న 370 అధికరణను రద్దు చేస్తూ, జమ్మూ–కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక, అంతకుముందూ కూడా భారత్‌–పాకిస్తాన్‌ల మధ్య కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం నెరపడానికి సిద్ధమేనని ట్రంప్‌ ఒకటికి రెండుసార్లు చెప్పారు. ఆయన అలా చెప్పిన ప్రతిసారీ మన దేశం దాన్ని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో నేరుగా ఇద్దరు అధినేతలూ కలిసినప్పుడు ఏం జరుగుతుందన్న ఆసక్తి అందరిలో ఏర్పడింది. కానీ ఇద్దరూ 40 నిమిషాలు చర్చించుకున్న తర్వాత సంయుక్తంగా జరిపిన మీడియా సమావేశం దృశ్యాలు వీక్షించాక అంతా సవ్యంగా గడిచిందన్న భావన కలిగింది.  

కశ్మీర్, ఇతర ద్వైపాక్షిక అంశాలను తామూ, పాకిస్తాన్‌ పరిష్కరించుకుంటామని ట్రంప్‌ సమక్షంలో మోదీ చెప్పగా, రెండు దేశాలూ తమంతట తామే ఈ సమస్యను పరిష్కరించుకుంటాయన్న విశ్వాసం ఉందని ట్రంప్‌ ముక్తాయించారు. కశ్మీర్‌ విషయంలో తాను ట్రంప్‌ను బాగానే ఒప్పించగలిగానన్న విశ్వాసంతో ఉన్న పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బహుశా ఈ పరిణామంతో నీరసించి ఉంటారు. వాస్తవానికి ఈ నేతలిద్దరి సమావేశాన్ని ప్రభావితం చేయడానికి కావొచ్చు...పాక్‌ ప్రజలనుద్దేశించి ఇమ్రాన్‌ అదేరోజు మాట్లాడారు. కశ్మీర్‌ కోసం ఎంతదూరమైనా వెళ్తామని, అణుయుద్ధానికైనా సిద్ధమేనని బెదిరింపులకు దిగారు.  

జపాన్‌ లోని ఒసాకాలో జూన్‌ నెలాఖరులో జరిగిన జీ–20 దేశాల శిఖరాగ్ర సదస్సు తర్వాత ట్రంప్‌ ఏమన్నారో గుర్తుంచుకుంటే కశ్మీర్‌పై అమెరికా నుంచి ఎన్ని రకాల స్వరాలు వినబడ్డాయో అర్ధమవుతుంది. కశ్మీర్‌ వివాదంలో మధ్యవర్తిగా ఉండమని ఆ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కలిసినప్పుడు మోదీ తనను కోరారంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. వెనువెంటనే మన దేశం దాన్ని ఖండించింది. అటు అమెరికా ప్రతినిధి జోక్యం చేసుకుని వివాదం మరింత ముదరకుండా సర్ది చెప్పారు.

ఈ వ్యవహారం అక్కడితో ఆగలేదు. ఆ తదుపరి సైతం ట్రంప్‌ మధ్యవర్తిత్వం ఉబలాటాన్ని వదలకుండా ప్రదర్శిస్తూనే ఉన్నారు. అంతక్రితం మాట్లాడినదానికి భిన్నంగా ఇప్పుడు బియారిట్జ్‌లో ‘రెండు దేశాలూ సొంతంగానే పరి ష్కరించుకుంటాయన్న విశ్వాసం ఉంద’ని చెప్పిన ట్రంప్‌ కనీసం తన పాత వ్యాఖ్యలకు వివరణనిచ్చే ప్రయత్నమైనా చేయలేదు. ఫలానా కారణాల వల్ల తన ఆలోచన మారిందని సంజాయిషీ ఇవ్వలేదు. అసలు గతంలో దీన్ని ప్రస్తావించిన సంగతే గుర్తులేనట్టు ప్రవర్తించారు. నిజానికి ఈ కారణం వల్లనే ట్రంప్‌ను విశ్వసించలేం. ఈ తాజా అభిప్రాయం కూడా ఎన్నాళ్లుంటుందో, ఎప్పుడు మారుతుందో చెప్పలేం.

పూర్వాశ్రమంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తలమునకలై ఉండటం వల్లకావొచ్చు...కశ్మీర్‌ పేచీని ఆయన కేవలం రెండు దేశాల స్థల వివాదంగా చూస్తున్నట్టు కనబడుతోంది. లేదా  రెండు అణ్వస్త్ర దేశాల మధ్య తగాదా నివారించానన్న ఖ్యాతిని గడించి నోబెల్‌ శాంతి బహుమతిని సంపాదించాలన్న లక్ష్యం ఆయనకేమైనా ఉందేమో! ట్రంప్‌ ఉద్దేశాలేమైనా నరేంద్ర మోదీ ఆయన సమక్షంలోనే ‘అది ద్వైపాక్షిక సమస్య. రెండు దేశాలూ పరిష్కరించుకుంటాయి’ అని నిర్మొహమాటంగా చెప్పడం బాగుంది.

అయితే ఈ విషయంలో ట్రంప్‌కు మాత్రమే కాదు...చాలా దేశాలకు ఆసక్తి ఉంది. నిరుడు జూలైలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ మన దేశంలో పర్యటించినప్పుడు కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం నెరపడానికి తాము సిద్ధమేనని ప్రకటించడం గుర్తుంచుకోవాలి. చైనా సరేసరి. అది పాక్‌ వైఖరికి మొదటినుంచీ వంతపాడుతూనే ఉంది. అలాంటి దేశాలు మరికొన్ని ఉన్నాయి. సహజంగానే పాకిస్తాన్‌ మరిన్ని దేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. ఇన్ని దశాబ్దాలుగా జమ్మూ–కశ్మీర్‌పై ప్రపంచ దేశాలకు ఉన్న అవగాహన వేరు.

అది భారత్‌–పాక్‌ల మధ్య విభ జనకాలంలో ఏర్పడిన వివాదంగా అందరూ భావిస్తున్నారు. దానిపై పాకిస్తాన్‌తో సంప్రదింపులకు సిద్ధమేనని సిమ్లా ఒప్పందం మొదలుకొని ఆగ్రా డిక్లరేషన్‌ వరకూ మన దేశం చెబుతూ వస్తోంది. కానీ 370 అధికరణ రద్దు చేయడం ద్వారా, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం ద్వారా దాని రూపురేఖల్ని మోదీ మార్చేశారు. అదిప్పుడు పూర్తిగా ఆంతరంగిక సమస్య అయింది. 

మారిన ఈ కొత్త పరిస్థితుల విషయమై ప్రపంచ దేశాలను ఒప్పించడానికి ఎంతో ఓపిక అవసరం. ట్రంప్‌కు దేనిపైనా నిలకడ ఉండదు కనుక ఆయన ఏ అభిప్రాయాన్నయినా ఇట్టే మార్చుకున్నట్టు కనబడతారు. తిరిగి పాత అభిప్రాయానికి ఎప్పుడు వెళ్తారో చెప్పలేం. కానీ వేరే దేశాల అధినేతలకు అవగాహన కలిగించడానికి చాలా సమయమే పట్టవచ్చు. అయితే ఈలోగా మన దేశం కశ్మీర్‌లో చేయాల్సింది చాలా ఉంది. అక్కడి ప్రజానీకాన్ని విశ్వాసంలోకి తీసుకుని వారి మనసులను గెల్చుకునే ప్రయత్నం చేయాలి. కొత్త విధానాల పర్యవసానంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లవచ్చునన్న ఉద్దేశంతో కశ్మీర్‌లో ఆంక్షలు విధించామని కేంద్రం చెబుతోంది. కానీ అవి సుదీర్ఘకాలం కొనసాగడం తప్పుడు సంకేతాలు పంపుతుంది. కనుక సాధ్యమైనంత త్వరగా అక్కడ ప్రాథమిక హక్కులను పునరుద్ధరించి, సాధారణ పరిస్థితులు ఏర్పర్చగలిగితే... ఆ ప్రాంత ఆర్థికాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటే సత్ఫలితాలొస్తాయి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top