తలయో... తోకయో!

Editorial On Chandrababu Naidu And TDP Over Narendra Modi - Sakshi

లైట్స్‌ ఆన్‌.. కెమెరా... యాక్షన్‌...‘‘మోదీ, నేనూ మంచి స్నేహితులం. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు...’’ కట్‌..., సార్‌ డైలాగ్‌ అతకడం లేదు. మార్చేద్దాం.  కొంచెం స్క్రిప్టును అర్థం చేసుకుని రాయండి. ఓకే, టేక్‌ టూ.. షాట్‌ రెడీ. ‘‘నరేంద్ర మోదీతో నాకెటువంటి విభేదాలు లేవు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే అప్పుడు విభేదించా...’’ కట్‌. ఓకే . థాంక్యూ సర్‌. బాగా వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాలకోసం ఇకముందు కూడా వ్యతిరేకిస్తూనే వుంటా... అని మరో డైలాగ్‌ లింక్‌ చేద్దాం సార్‌... సిచువేషన్‌ బాగా పండుద్ది. స్టోరీ లైన్‌ తెలియకుండా సలహాలివ్వకండి ప్లీజ్‌. ఇక్కడ సీన్‌ కట్‌ చేస్తాం. మరోచోట ఓపెన్‌ చేస్తాం. ఇంకోచోట ఈ డైలాగ్‌కు లింకు కలుపుతాం. అర్థమైంది సార్‌. 

తెలుగుదేశం పార్టీని స్థాపించిన కీర్తిశేషులు ఎన్‌.టి. రామారావు సినిమా రంగంలో ఒక మహానటుడని ఎవరూ పరిచయం చేయవలసిన అవసరం లేదు. మూడు వందల సినిమాల్లో విభిన్న షేడ్స్‌ వున్న వంద లాది పాత్రలను ఆయన పోషించాడు. మనకు తెలిసిన రామాయణ, మహాభారత కథల్లోనే అనేక పాత్రల్లో ఆయన కనువిందు చేశాడు. రామాయణ కథానాయకుడైన రాముడిగానూ, ప్రతినాయకుడు రావణుడిగానూ అద్భుతంగా నటించి, అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాడు. ఇరవై నాలుగు సార్లు శ్రీకృష్ణుని వేషం వేసి, నిజంగా కృష్ణుడే దిగివచ్చినా జనం నమ్మలేని స్థాయిలో జీవించారు. రారాజు సుయోధనుడిగా, రాధేయుడు కర్ణునిగా, భీముడిగా, అర్జునుడిగా చిరకాలం గుర్తుండిపోయేలా నటించాడు. నలభయ్యేళ్లు నిండని వయసులో ఎనభయ్యేళ్లు దాటిన భీష్ముని పాత్రను నభూతో నభవి ష్యతి అన్న రీతిలో పోషించి మెప్పించాడు. కానీ, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఎన్టీఆర్‌ వేషాలు మార్చలేకపోయాడు, స్వభావాన్ని మార్చుకోలేకపోయాడు. సిద్ధాంతాలను ఏమార్చలేకపోయాడు. ప్రజా జీవితంలో ఒకే పాత్రకు పరిమితమయ్యాడు. తెలుగువాడి ఆత్మగౌరవం కోసం పార్టీ పెడుతున్నానని ప్రకటించాడు. పేదవాడి ఆకలి మంటల్లో పుట్టింది నా పార్టీ అన్నాడు. తుదివరకు అదే పంథాలో కొనసాగాడు. అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే తన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసినప్పుడు జరిగిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో కలిసి వచ్చినందుకు కృతజ్ఞతగా కమ్యూనిస్టులతోపాటు బీజేపీకి కూడా కొన్ని సీట్లను ఎన్టీఆర్‌ కేటాయించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం సాను భూతి ప్రభంజనంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండేసీట్లు సాధించింది. అందులో ఒకటి అప్పుడు ఎన్టీఆర్‌ కేటాయించిన హన్మకొండ నియోజకవర్గం. కాంగ్రెస్‌ దిగ్గజం పీవీ నరసింహారావుపై బీజేపీ తరఫున పోటీచేసిన జంగారెడ్డి గెలిచారు. సోషలిస్టు భావజాల ప్రభావంతో పరిపాలన చేసిన ఎన్టీఆర్‌ కమ్యూనిస్టుల మైత్రిని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. తన ప్రధాన శత్రువైన కాంగ్రెస్‌ పార్టీతో ఎప్పుడూ రాజీపడలేదు. 

‘ఉదర పోషణార్థం బహుకృత వేషం’ అన్నారు. వెన్నుపోటుతో ఎన్టీరామారావును తొలగించి అధికారంలోకి వచ్చిన ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు తన వ్యక్తిగత స్వార్థం కోసం, అధికారం కోసం, అధికారంలో నిరంతరం కొనసాగడం కోసం వేసినన్ని వేషాలు, పిల్లిమొగ్గలు ప్రపంచ రాజకీయ చరిత్రలో మరో నాయకుడు వేసి ఉండడు. యూ–టర్న్‌ అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ఒక దశలో చంద్రబాబు బొమ్మ కనిపించేదట. విధానాల విషయంలో, పార్టీలతో పొత్తుల విషయంలో బాబు తీసుకున్న యూ–టర్న్‌లను లెక్కతీసి పంపిస్తే గిన్నీస్‌ రికార్డుల పుస్తకం వాళ్లు కళ్లకు అద్దుకుని అచ్చువేస్తారు. గడిచిన ఐదేళ్లలో ఒక్క ప్రత్యేక హోదాపైనే కనీసం పదిసార్లు మాట మార్చాడు. వ్యవసాయం దండగ అన్న నోటితోనే వ్యవసాయం పండగ అనగలడు. సంపూర్ణ మద్యనిషేధం, రెండు రూపాయలకే కిలో బియ్యం హామీతో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆ రెండు హామీలనూ అటకెక్కించగలడు. రైతులకు రుణమాఫీ చేస్తానని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తర్వాత వ్వెవ్వెవ్వే అని వెక్కిరించగలడు. యువతకు ఉద్యోగాల ఎరవేసి ఏమార్చగలడు. థూనాబొడ్డు వాగ్దానాల్లో చంద్రబాబుకు సాటి రాగల రాజకీయ నేత కాగడా వేసుకుని గాలించినా ఎక్కడా దొరకడు.

కాంగ్రెస్‌ వ్యతిరేక పునాదులపై ఎన్టీఆర్‌ నిర్మించిన తెలుగుదేశం పార్టీని లోపాయికారీగా ఒకసారి, బహిరంగంగా మరోసారి కాంగ్రెస్‌ పెద్దల పాదాల చెంతకు చేర్చిన విడ్డూరాన్ని లోకమంతా చూసింది. డాక్టర్‌ వైఎస్సార్‌ దురదృష్టకర మరణానంతరం భవిష్యత్తులో జగన్‌మోహన్‌రెడ్డితో ముఖాముఖి రాజకీయాల్లో తలపడలేమన్న భయంతోనే, మొగ్గలోనే ఆయనను తుంచేయాలని కాంగ్రెస్‌తో కలిసి చేసిన కుట్ర కేసుల వ్యూహరచన ప్రజలందరికీ తెలిసిన తాజా చరిత్ర. జగన్‌మోహన్‌రెడ్డిపై అమలుచేసిన కక్షసాధింపు చర్యల ద్వారా కాంగ్రెస్‌ పెద్దలతో చంద్రబాబు లోపాయికారి చెలిమి చిగురించి మొగ్గతొడిగింది. మొన్నటి ఎన్నికలకు ముందు, మోదీతో సఖ్యత చెడిన తర్వాత కాంగ్రెస్‌తో బహిరంగ మైత్రికి ఆ చెలిమి ఉపకరించింది. కాంగ్రెస్‌ నాయకులు, బీజేపీ వ్యతిరేక పక్షాలతో అంటకాగి, వేదికలెక్కి చంద్రబాబు చేసిన వీరాలాపాలు ఇంకా జనం చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. మోదీ ఓ చీడపురుగు అన్నాడు. అన్ని శక్తులను ఏకంచేస్తా, మోదీ సర్కార్‌ను పీకేస్తా అని గర్జించాడు. రాహుల్‌గాంధీని పొగిడాడు. భవిష్యత్తు నేతగా ప్రశంసించాడు. కానీ, ఆ ఢిల్లీ పప్పు ఉడకలేదు. మళ్లీ మోదీ గెలిచాడు. భారీ మెజారిటీతో గెలిచాడు. ఇక్కడ మన అమరావతి పప్పూ ఉడకలేదు. కనీవినీ ఎరుగని ఓటమి మూటగట్టుకోవలసి వచ్చింది. ఇప్పుడు కిం కర్తవ్యం? చేసిన దోపిడీ సామాన్యమైనది కాదు. పీడకలలా వెంటాడుతున్నది. విభజన కారణంగా రాజధాని నగరాన్ని కోల్పోయిన రాష్ట్రానికి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని కొందరు పెద్దతరం వాళ్లు భావించిన కారణంగా, మోదీ అనుకూల గాలి కారణంగా వెంట్రుకవాసి తేడాతో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ అధికారం దక్కింది.

ఆ అధికార పీఠాన్ని ఆయన దుర్వినియోగం చేశాడు. ఆయనపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరిగితే లోకం దిగ్భ్రాంతికి గురికాగల విషయాలు బైటకు వస్తాయని పలువురు భావిస్తున్నారు. అసలు రాజధాని స్కీమే ఒక పెద్ద స్కామని చెబుతున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా బినామీల పేర్లతో వేల ఎకరాలు తాను, తన అనుయాయులు సేకరించుకున్న తర్వాతనే రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారని ప్రజలు విశ్వసిస్తున్నారు. నిజంగా రాజధాని అక్కడ ఏర్పడి ఉన్నట్లయితే ఈ నేతలు ఎన్నివేల కోట్లు అప్పనంగా సంపాదించి ఉండేవారో ఊహాశక్తికి వదిలేయాల్సిందే! రాజధాని కథ అక్కడితో ఆగలేదు. రైతుల భూమిలో పైసా ఖర్చు లేకుండా సింగపూర్‌ కంపెనీ చేసే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పాలకుల వాటా కూడా కళ్లు చెదిరేలా ఉంటుందని చెబుతున్నారు. రాజధాని నిర్మాణంలో ప్రతి దశలోనూ కాసులు  పిండుకునే విధంగానే డిజైన్‌ చేశాడు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎమ్‌లా మారిందని సాక్షాత్తూ ప్రధానే ఆరోపించారు. ఇసుక మేటల్లో వాటాలు పిండుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒక మాఫియా నెట్‌వర్క్‌నే ఏర్పాటు చేశారు. స్వయంగా యువరాజుకే వాటాలిస్తున్నామనే ధైర్యంతో ఈ మాఫియా చెలరేగిపోయి వేలకోట్ల ప్రజాధనాన్ని పిండేసింది. కొత్తగా ఏర్పడిన జగన్‌ ప్రభుత్వం ఇసుక సరఫరా నుంచి ఈ మాఫియాను దూరంగా పెట్టి ప్రజలకు చౌకగా అందించడంకోసం కొంత విరామాన్ని పాటించడంతో తెలుగుదేశం నేతలు కొందరు హిస్టీరియా వచ్చినట్టుగా ప్రవర్తించడమే జరిగిన దోపిడీకి రుజువు. ఆవు చేలో మేస్తే, దూడ గట్టున మేయదు కదా! బాస్‌ వ్యవహారశైలిని చూసిన అప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు చెలరేగిపోయారు. వీరి అవినీతిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏకంగా ఒక పుస్తకాన్నే అచ్చేసి పంపిణీ చేసింది. 

ఓట్ల కొనుగోలుతో మళ్లీ అధికారంలోకి రావాలన్న ప్రణాళిక బెడిసికొట్టింది. కేంద్రంలోనూ తమ అంచనాలు తప్పి మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది. వైఎస్‌ జగన్‌ పరిపాలన తీరుతెన్నులు చూసిన తర్వాత భవిష్యత్తులో మళ్లీ తమకు అధికారం దక్కే ఆశలు సన్నగిల్లుతున్నాయి. చేసిన అవినీతి కార్యక్రమాలపై విచారణ జరిగితే ఏమవుతుందోనన్న భయం వెంటాడుతున్నది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి చంద్రబాబు అండ్‌ కోకు వున్న ఒకే మార్గం కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుని మళ్లీ చేరువకావడం. కానీ, ఎన్నికల ముందు బీజేపీనీ, నరేంద మోదీని చంద్రబాబు అండ్‌ కో నానాతిట్లు తిట్టి ఉన్నారు. అవన్నీ మరిచిపోయి ఇప్పుడు మళ్లీ దగ్గర చేరనిస్తారా? ఈ సమస్యకు పరిష్కారం ఎలా?... ఈ సకల చరాచర జగత్తులో ప్రతిదానికీ ఒక వెల వుంటుందని నమ్మేతత్వం చంద్రబాబు అండ్‌ కో ది. ఈ సమస్యకూ ఒక వెలను నిర్ణయించి చెల్లించేందుకు సిద్ధపడిపోయారు. ఆ వెల తెలుగుదేశం పార్టీ ఉనికి! అధినేతతో సహా టోకున టీడీపీ మొత్తాన్ని విలీనం చేసుకునేందుకు బీజేపీ నేతలు సిద్ధంగా లేరు.

తమ పార్టీలోని నాయకులు కార్యకర్తలు ఎవరినైనా ఎంతమందినైనా బీజేపీలో చేర్చుకుని తనతోపాటు మిగిలే అవశేష తెలుగుదేశాన్ని ఏపీలో జూనియర్‌ పార్ట్‌నర్‌గా చేర్చుకోవాలని ఢిల్లీ అధికార సౌధాల్లో విజ్ఞప్తుల కార్యక్రమం దీక్షతో జరుగుతున్నదని అభిజ్ఞవర్గాల భోగట్టా. ఇప్పటికే బీజేపీలో చేరిన మాజీ టీడీపీ నేతలు ఈ బ్రోకరేజీ పనిలో వున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటివర కైతే బీజేపీ నాయకత్వం గుంభనంగానే వ్యవహరిస్తున్నది. కానీ, ఒక నాయకుడు తన స్వీయరక్షణకోసం లక్ష లాది మంది కార్యకర్తల శ్రమతో నిర్మితమైన పార్టీని పణంగా పెట్టాలని చూడటం కచ్చితంగా రాజకీయరంగంలో ఒక హీనదశకు సంకేతం. ఎప్పటిలాగే శవాన్ని భుజాన వేసుకుని నడుస్తున్నాడు విక్రమార్కుడు. శవంలోని బేతాళుడు విక్రమార్కుడితో ఇలా అన్నాడు. త్వరలో తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవం రానున్నది. ఆనాటికి ఆ పార్టీ ‘తల’పార్టీగా కొనసాగుతుందా? లేక తోక పార్టీగా మిగులుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల వేయి ముక్కలవుతుందని అన్నాడు. అసలే అమావాస్య చీకటి. కాంతి లేని చంద్రుడు. దారి కనిపించడం లేదు. చిరాగ్గా వుంది విక్రమార్కుడికి. తనలో తానే ఏదో గొణుక్కుంటూ నడవసాగాడు.


వర్ధెల్లి మురళి
 
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top