డాలర్‌ డ్రీమ్స్‌పై ట్రంప్‌ పంజా

Editorial On America Visa And Donald Trump - Sakshi

అధ్యక్ష ఎన్నికలు సమీపించినప్పుడల్లా అమెరికాలో వీసాల చుట్టూ ఆంక్షల తీగలు అల్లుకుంటాయి. అధికారంలో రిపబ్లికన్లు వున్నా, డెమొక్రాట్లున్నా ఇది సాగుతూనే వుంటుంది. మునుపటితో పోలిస్తే డోనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ఈ ఆంక్షల జోరు  పెరిగింది. ఈసారి కరోనా వైరస్‌ మహమ్మారి కూడా తోడు కావడంతో అవి మరింత కఠినమయ్యాయి. ఈ ఏడాది ఆఖరు వరకూ అన్ని రకాల వర్క్‌ వీసాలను తాత్కాలికంగా నిలిపివేయబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించి వేలాదిమంది విదేశీ వృత్తినిపుణుల జీవితాల్లో తుపాను రేపారు. మంగళవారం అందుకు సంబం  ధించిన ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇప్పుడేర్పడిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన కోట్లాదిమంది అమెరికన్లను ఆదుకోవడానికే ఈ ఆంక్షలు తీసుకొచ్చినట్టు ట్రంప్‌ ప్రకటిం చారు.

కరోనా మహమ్మారి ప్రతాపం చూపడం మొదలెట్టిన మూడు నెలల తర్వాత తొలిసారి ఓక్లహా మాలో రెండురోజులక్రితం ఆర్భాటంగా ఆయన నిర్వహించిన ర్యాలీకి జనం ముఖం చాటేయడంతో ట్రంప్‌కు ఆందోళన పెరిగింది. మళ్లీ అధికార యోగం అసాధ్యమన్న భయం పట్టుకుంది. అందుకే ఆదరా బాదరాగా ఆయన ఈ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. త్వరలో మరిన్ని ఆంక్షలు రాబోతున్నా  యంటున్నారు. సహజంగానే ఈ ఆంక్షలు అందరికన్నా ఎక్కువగా భారతీయ వృత్తి నిపుణులనే కుంగదీస్తాయి. కరోనా వైరస్‌ విరుచుకుపడ్డాక అమెరికాలో మునుపెన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఏర్పడిందన్నది వాస్తవం. పర్యవసానంగా గత మూడునెలల్లో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మారారు. ట్రంప్‌ గత అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలోనే తాను అధికారంలోకొస్తే వలసలపై ఆంక్షలు విధిస్తానని చెప్పారు.

అధ్యక్షుడయ్యాక అడపా దడపా అటువంటి ఆంక్షలు విధిస్తూనే వున్నారు. కానీ ఆయన చేసిన వాగ్దానాలతో పోలిస్తే విధించిన ఆంక్షలవల్ల ఒరిగింది చాలా తక్కువ. ఆయన లక్ష్యం భారీయెత్తున వలసలను అడ్డుకోవడం. అది నెరవేరడానికి కరోనా వైరస్‌ సాకు ఆయనకు పనికొచ్చింది. వలసల్ని అడ్డుకోవద్దని, వాటివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు లాభమే తప్ప నష్టం ఉండదని వ్యాపారవేత్తలు ఆయనకు చెబుతూనేవున్నారు. అయినా ఆయన వినలేదు. ఇప్పటికే శరణార్థులకు ఆశ్రయమిచ్చేందుకు వీలుకల్పించే నిబంధనల అమలు నిలిపివేశారు. అలాగే గ్రీన్‌ కార్డులపై గత రెండు నెలలుగా నిషేధం సాగుతూనేవుంది. దాన్ని కూడా ఏడాది ఆఖరు వరకూ పొడి గించే అవకాశం కూడా వుంది. ఇప్పటికే చదువులు పూర్తిచేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడదామని ఆత్రంగా ఎదురుచూసే వేలాదిమంది ఆశలకు వీసా ఆంక్షలు గండికొడతాయి.

ఆర్థికంగా ఎదగాలని ఆశించేవారంతా ఉన్నత విద్య కోసం స్తోమత వున్నా లేకున్నా అప్పులు చేసి మరీ అమెరికా బాటపడతారు. పట్టభద్రులైనవారికి ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ) కింద వర్క్‌ పర్మిట్‌ వస్తే వారు ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రత్యేక నైపుణ్యం పొందిన అలాంటివారంతా కొలువు చేస్తూనే హెచ్‌–1బీ వీసా కోసం దరఖాస్తు పెట్టుకుంటారు. దానికోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. అది తగిలిందంటే తమ పంట పండిందనుకుం టారు. ప్రపంచీకరణ అనంతరం ఏటా లక్షలాదిమంది ఇలా డాలర్‌ డ్రీమ్స్‌తో అక్కడికెళ్లడం రివాజుగా మారింది. ట్రంప్‌ హవా వచ్చాక విధించిన ఆంక్షలతో ఇలాంటివారి సంఖ్య కొంతమేర తగ్గింది. తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల పర్యవసానంగా ఐటీ పరిశ్రమ ప్రధానంగా ఆధారపడే హెచ్‌–1 బీ వీసాతోసహా వివిధ రకాల వీసాల కోసం ఎదురుచూసేవారంతా చిక్కుల్లో పడ్డారు.

హెచ్‌–1బీ వీసాలున్నవారి జీవిత భాగస్వాములకు జారీచేసే హెచ్‌–4 వీసాలు కూడా వచ్చే ఆర్నెల్లపాటు నిలిచిపోతాయి. అలాగే వివిధ దేశాల్లోని తమ కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నవారిని ఎల్‌ వీసా కింద రప్పించి పనిచేయించుకుంటున్న బహుళజాతి సంస్థలకు కూడా ఈ నిర్ణయం ఊపిరా డకుండా చేస్తుంది. ఇలాంటి పరిమితులమధ్య లక్ష్యాలు సాధించడం ఎలాగన్నది వాటికి ప్రశ్నార్థ కంగా మారింది. సాంస్కృతిక కార్యక్రమాలు తదితరాలకు జారీ చేసే జే–1 వీసాలు, వ్యవసాయేతర పరిశ్రమల్లో తాత్కాలిక పనికోసం వచ్చేవారికిచ్చే 2–బీ వీసాలు కూడా ఆగిపోతాయి. అయితే ఇప్ప టికే అమెరికాలో వివిధ వీసాలపై వుంటున్న వలసదారులకు, ఆహారోత్పత్తి పరిశ్రమల్లో పనిచేసే తాత్కాలిక ఉద్యోగులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రం ఈ ఆంక్షలు వర్తించవు. 

ఇప్పుడేర్పడిన సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఈ ఆంక్షలు అవసరమని ట్రంప్‌ చెబుతున్నారు. కానీ ప్రత్యేక నైపుణ్యం అవసరమైన రంగాలన్నీ తగిన అనుభవం, ఇతరత్రా అర్హతలు గలవారిని వెదుక్కోవడం కష్టం మాత్రమే కాదు... అసాధ్యం కూడా. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌ (స్టెమ్‌) రంగాలు ఇప్పటికే నిపుణుల కొరతతో అల్లాడుతున్నాయి. ఇక వలసలపై ఆంక్షలు పెడితే చెప్పేదేముంది? అందుకే ట్రంప్‌ జారీ చేసిన ఉత్తర్వులపై గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌తోసహా అనేకులు అసంతృప్తి వెళ్లగక్కారు. తాజా ఆంక్షల కారణంగా 5,25,000 ఉద్యోగాలు అమెరికన్లకు లభించే అవకాశం వచ్చిందని లెక్కలు చెబుతున్నా... అర్హులెక్కడ? పైగా అమెరికన్‌ కంపెనీలన్నీ విదేశీయులకు ప్రేమతో కొలువులివ్వడం లేదు.

వారైతే అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకు పనిచేస్తారని, బాగా కష్టపడతారని, కొత్తగా వచ్చే సాంకేతికతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమను తాము మలుచుకుంటారని భావించే ఉద్యోగాలిస్తాయి. పైగా డిస్నీ మొదలుకొని వందలాది సంస్థలు కొత్తగా వచ్చిపడిన సంక్షోభం నుంచి బయటపడటం కోసం అధిక వేతనాలకు పనిచేసే అమెరికన్లను తొలగించి, వారి స్థానంలో తక్కువ వేతనాలకు పనిచేసే వలసదారుల్ని నియమిం చుకున్నాయి. కనుక ట్రంప్‌ తాజా చర్య వల్ల ఆ సంస్థలు ఎదగడం మాట అటుంచి కుప్పకూలే ప్రమాదం వుంది. అదే జరిగితే తాజా ఉత్తర్వులు ఆయనకే బెడిసికొడతాయి. ట్రంప్‌కు ఇప్పుడున్న అంతంతమాత్రం మద్దతు కూడా ఆవిరి కావడం ఖాయం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top