అరకొర ఆసరా!

Coronavirus No Integrity Seen In Centre Economic Package - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీలో ఏమేం ఉండబోతున్నాయన్న ఉత్కంఠకు కొంతవరకూ తెరపడింది. ఆ ప్రకటనకు కొనసాగింపుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలకూ, రియల్‌ఎస్టేట్, నాన్‌ ఫైనాన్సింగ్, గృహ నిర్మాణం తదితర రంగాలకూ చేకూర్చే లబ్ధి గురించి బుధవారం వెల్లడించారు.  ఇతర రంగాలకు ప్రభుత్వం వైపుగా ఏమేం వెసులుబాట్లు లభిస్తాయో దశలవారీగా ఆమె రాగల రోజుల్లో ప్రకటిస్తారు. 

కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడిన పర్యవసానంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. లాక్‌డౌన్‌ విధింపులు తప్పనిసరి కావడంతో అన్నీ స్తంభించిపోయాయి. వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది. ఉపాధి కోల్పోవడం వల్ల చాలామందికి పూట గడవటం ప్రశ్నార్థకంగా మారింది. కనుక వినిమయం దారుణంగా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధికి ఊతం ఇవ్వడమే ధ్యేయంగా, స్వావలంబన సాధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని తన ప్రకటనకు ముందు నిర్మలా సీతారామన్‌ చెప్పారు. కనుక ఆమె ప్రకటించిన తొలి విడత చర్యలు ఈ దిశగా వుంటాయని సహజంగానే ఆశిస్తారు. 
(చదవండి: చిన్న సంస్థలకు.. పెద్ద ఊరట!)

అయితే ఎంఎస్‌ఎంఈలకు అవసరమైన ఊతం ఇవ్వడానికి ఇప్పుడు ప్రకటించిన చర్యలు సరి పోవన్నదే ఆ రంగానికి చెందినవారి ప్రధాన విమర్శ. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రంగాల్లో ఎంఎస్‌ఎంఈ ఒకటి. మన దేశం నుంచి జరిగే ఎగుమతుల్లో ఈ రంగం వాటా 45 శాతం. ఇందులో 12 కోట్లమందికిపైగా ఉపాధి పొందుతున్నారు. ఇంతటి ప్రాధాన్యత వున్న రంగానికి తొలి దశ ప్యాకేజీలో స్థానం ఇవ్వడం మంచిదే. కానీ ఇచ్చింది ఎంతో, అందులో ఉపయోగపడేదెంతో చూస్తే నిరాశ కలుగుతుంది. 

దేశంలో దాదాపు 70 లక్షల ఎంఎస్‌ఎంఈలున్నాయి. ఇందులో వంద కోట్ల టర్నోవర్‌ దాటిన యూనిట్లు 45 లక్షల వరకూ వుంటాయి. వీటికి ఏ హామీ చూపకుండా నేరుగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే సౌలభ్యం కలిగించారు. ఇందుకోసం రూ. 3 లక్షల కోట్లు కేటాయించారు. అలాగే ఎంఎస్‌ఎంఈల పరిధిలోకి రావడానికి ఉన్న పరిమితుల్ని కూడా పెంచింది. ఈ చర్య వల్ల దేశంలోని అనేక సంస్థలు లబ్ధిపొందుతాయని సర్కారు అంచనా. 

ఈ రుణాన్ని నాలుగేళ్ల వ్యవధిలో చెల్లించేందుకు, తొలి ఏడాది అసలు, వడ్డీ చెల్లింపులపై మినహా యింపు ఇచ్చేట్టు వెసులుబాటు ఇచ్చారు. ఈ ఆసరాతో వ్యాపార కార్యకలాపాలు పెరగడంతోపాటు లక్షలాదిమందికి ఉపాధి భద్రత ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. తన వంతుగా ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వ రంగ సంస్థలనుంచి రావాల్సిన అన్ని రకాల బకాయిలను చెల్లిస్తామని ప్రకటించింది. బ్యాంకుల నుంచి రుణ సౌకర్యం కల్పించడం తప్ప కేంద్రం ఇందులో తనకు తాను ఇస్తున్నదేమీ లేదు.

అయితే మన బ్యాంకులు అచ్చం ప్రభుత్వం ఆశించినట్టే చేయవు. కొన్నిసార్లు రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పినా వినవు.  రిజర్వ్‌బ్యాంక్‌ 3 నెలలపాటు ఈఎంఐల చెల్లింపుపై మారటోరియం విధిస్తే అది ఆచరణకొచ్చేసరికి ఏమైందో అందరికీ అనుభవమైంది. ఎంఎస్‌ఎంఈల విషయంలోనూ అంతకంటే మెరుగ్గా ఏమీ వుండదు. ఎలాంటి హామీ లేకుండా రుణాలిస్తే తాము ఇరుక్కుంటామన్న భయం బ్యాంకులకు ఉంటుంది. వాటికి ఆర్‌బీఐ నిబంధనలు గుర్తొస్తాయి. చివరకు ఎంఎస్‌ఎంఈ యజమానులకు ప్రయాస తప్ప ఫలితం కనబడదు. 

దానికి బదులు ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా కేంద్రమే నేరుగా రుణ వితరణ చేయడం లేదా రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయంతో దీన్ని అమలు చేయడం వంటి ఆలోచనలు చేస్తే బాగుండేది. ఎంఎస్‌ఎంఈల్లో అత్యధికం తీసుకున్న రుణాలను తీర్చడానికి ప్రయత్నిస్తుంటాయి. తమకు అవసరమైన పెట్టుబడి మరోవిధంగా వచ్చే అవకాశం లేదు గనుక ఈ విషయంలో వాటి యజమానులు జాగ్రత్తగా వుంటారు. కేవలం బడా పారిశ్రామికవేత్తలకూ, బడా వ్యాపారులకూ మాత్రమే ఎగ్గొట్టే ఉద్దేశంతో రుణాలు తీసుకునే సంస్కృతి వుంది. కనుక ఎంఎస్‌ఎంఈలకు నేరుగా రుణ సదుపాయం కల్పించడంలో జంకవలసిన పనిలేదు.
(చదవండి: 9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు)

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు కొనియాడదగ్గవి. ఎంఎస్‌ఎంఈలకు బాబు హయాంలో బకాయిపడ్డ ప్రోత్సాహకాలు రూ. 905 కోట్లనూ చెల్లించడమేగాక... ఆ యూనిట్లు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన విద్యుత్‌(డిమాండ్‌) చార్జీలు రూ. 188 కోట్లను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆ రంగంలోని యూనిట్లకు నిర్వహణ మూలధనం కింద గరిష్టంగా రూ. 10 లక్షలమేర రుణం అందజేసే సదుపాయం కల్పించింది. 

లాక్‌డౌన్‌ కారణంగా దెబ్బతినివున్న ఎంఎస్‌ఎంఈలకు లిక్విడిటీ పరంగా వూతం అందించడమే ఈ చర్యలన్నిటి ఉద్దేశం. ఈ దిశగా కేంద్రం కూడా ఆలోచన చేసివుంటే బాగుండేది. రైల్వేలు, రోడ్డు రవాణా, జాతీయ రహదారులు తదితర సంస్థల్లోని కాంట్రాక్టర్లు పనులు పూర్తిచేయాల్సిన పరిమితిని ఆర్నెల్లు పొడిగించారు. ఇందువల్ల వారికి పెనాల్టీ బెడద వుండదు. ఈ సదుపాయం రాష్ట్ర ప్రభుత్వాలకు పనిచేసే కాంట్రాక్టర్లకు వర్తింపజేయాలన్న స్పృహ లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఇక ఐటీ చెల్లింపుదారులకు ప్రభుత్వం వెనక్కి తిరిగివ్వాల్సిన మొత్తం రూ. 18,000 కోట్లనూ ప్యాకేజీలో భాగంగా చూపడం లౌక్యం తప్ప మరేమీ కాదు. ఉద్యోగులకు ఈపీఎఫ్‌ మొత్తం నుంచి మూడునెలల కాలానికి రుణ సదుపాయం కల్పించడం కూడా ఇటువంటిదే. ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్ని అధిగమించాలంటే చిత్తశుద్ధితో ప్రయత్నం చేయడం తప్ప వేరే మార్గం లేదు. తాజా ప్యాకేజీలో అది పెద్దగా కనబడదు. అందుకు భిన్నంగా భారీ అంకెలు చూపడానికి అన్నిటినీ గుదిగుచ్చిన వైనం కళ్లకు కడుతోంది. మున్ముందు ప్రకటించే ప్యాకేజీలైనా మెరుగ్గా రూపొందిస్తే ఈ పెను విపత్తునుంచి అందరూ క్షేమంగా బయటపడేందుకు వీలవుతుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top