
వరంగల్ జిల్లాకు బయల్దేరిన వైఎస్ షర్మిల
మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరారు.
హైదరాబాద్ : మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పరామర్శ యాత్రకు బయల్దేరారు. సోమవారం ఉదయం ఆమె హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి వరంగల్ జిల్లా పర్యటనకు పయనం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్...తన సోదరిని దగ్గరుండి యాత్రకు సాగనంపారు. వరంగల్ జిల్లాలో ఆమె అయిదు రోజుల పాటు పర్యటిస్తారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతిని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. ఇందులో భాగంగా ఆమె వరంగల్ జిల్లాలో ఇవాళ్టి నుంచి జిల్లాలో తొలి విడత పరామర్శ యాత్రలో 32 మంది కుటుంబాలను పరామర్శిస్తారు. తొలి రోజు ఏడు కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. చేర్యాల నుంచి ఆమె యాత్ర మొదలవుతుంది.
కాగా జనగామ, స్టేషన్ ఘన్‌పూర్, వర్థన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిగా, పరకాల, పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాక్షికంగా వైఎస్ షర్మిల పర్యటన జరగనుంది. ఇందుకు సంబంధించి పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.