సోమవారం.. చేనేత వారం


ప్రభుత్వ ఉద్యోగులు ధరించేలా ప్రోత్సాహం

కలెక్టరేట్‌లో  ‘టెస్కో’ ఆధ్వర్యాన స్టాల్‌

వచ్చే వారం నర్సంపేట.. ఆపై వర్ధన్నపేట,

పరకాలలో... చేనేత రంగం

పరిరక్షణకు  కలెక్టర్‌ చొరవ




హన్మకొండ : చేతి నిండా పని.. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ బతికిన చేనేత కార్మికులు ఇప్పుడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు నేసిన వస్త్రాన్ని కొనుగోలు చేసే వారు లేక.. మార్కెటింగ్‌ ఎలా చేసుకోవాలో తెలియక.. పని కరువై పొట్ట కూటి కోసం తిప్పలు పడిన నేతన్నకు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చేనేత వస్త్రాలు ధరించడంపై అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్ర మంత్రి మొదలు జిల్లా కలెక్టర్‌ వరకు వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించాలని నిర్ణయించడం.. దీనిపై ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండడంతో వస్త్రాల అమ్మకాలు  పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఇదేకాకుండా వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని శాయంపేటలో నేషనల్‌ హ్యాండ్లూమ్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం కిందమంజూరైన డైయింగ్, హ్యాండ్లూమ్‌ యూనిట్‌ ఏర్పాటుతో చేనేత కార్మికులు నూతన డిజైన్లలో వస్త్రాలను రూపొందించడం ద్వారా మార్కెట్‌ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.



ఆచరణలోనూ చూపించిన కలెక్టర్‌

రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని కోరిన వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. అందరిలో స్ఫూర్తి నింపేలా ఆయన కూడా సోమవారం చేనేత వస్త్రాలు ధరించడమే కాకుండా ఉద్యోగులందరికీ అందుబాటులో చేనేత వస్త్రాలు ఉండేలా ఏకంగా కలెక్టరేట్‌లో ‘టెస్కో’ ఆధ్వర్యాన అమ్మకాల కోసం స్టాల్‌ ఏర్పాటుచేయించడం విశేషం. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ స్టాల్‌ మంగళవారం ముగిసింది. అంతేకాకుండా ప్రతీ వారం జిల్లాలోని ఓ ప్రాంతంలో స్టాల్‌ ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్‌ ఈ సందర్భంగా ప్రకటించారు.



16వేల మంది ఉద్యోగులు

జిల్లాలో ఉన్న 16వేల మంది ఉద్యోగులు ప్రతీ సోమవారం ధరించేందుకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తే కార్మికులకు ఉపాధి చూపించినట్లవుతుందని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ చెబుతున్నారు. అంతేకాకుండా వారంవారం గ్రీవెన్ససెల్‌ జరిగే రోజుల్లో ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా.. వినతిపత్రాలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు చేనేత ఆవశ్యకతను చాటిచెప్పినట్లవుతుందనేది కలెక్టర్‌ భావన. అంతేకాకుండా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకం ప్రకటించారు.



ఈ పథకం ద్వారా ప్రతి ఉద్యోగి నెలకు రూ.వెయ్యి చొప్పున తొమ్మిది నెలల పాటు చేనేత సహకార సంఘంలో చెల్లిస్తే.. తర్వాత వారు రూ.16,500 విలువైన వస్త్రాలు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోరుతున్నారు. అటు కలెక్టర్‌ చొరవ.. ఇటు ప్రభుత్వ పథకాలు అమలైతే చేనేత రంగానికి మంచి రోజులు వచ్చేందుకు ఇంకా ఎన్నో రోజులు పట్టదని చెప్పొచ్చు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top