నగర పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కేసులు బనాయిస్తూ, రౌడీషీట్లు కూడా తెరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విజయవాడ : నగర పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో కేసులు బనాయిస్తూ, రౌడీషీట్లు కూడా తెరుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాసమస్యలపై ప్రశ్నించిన కార్పొరేటర్ రవికుమార్‌పై తెరిచిన రౌడీషీట్ ఇందుకు ఉదాహరణ అని పలువురు పేర్కొంటున్నారు. రవికుమార్‌పై రౌడీషీట్ తెరవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల తరఫున హైవే అధికారులను ప్రశ్నిం చడం, ప్రయాణికులపై చార్జీల మోత మోగిస్తే నిరసన తెలపడం నేరమెలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాల్‌మనీ వ్యవహారంలో ఫిర్యాదుచేసిన మహిళతో పోలీస్ స్టేషన్ ఆవరణలోనే మాట్లాడిన 14 రోజుల తరువాత ఆమె నుంచి బెదిరించినట్లు ఫిర్యాదు తీసుకోవడం, ఈ ఆలస్యానికి కారణాన్ని పోలీసులు చెప్పకపోవడం అనుమానాలకు తావి స్తోంది. తనను ఎవ్వరూ బెదిరించలేదని ఆ మహిళ కోర్టుకు లేఖ ఇస్తే ఆమెను పిలిపించుకుని తనను బెదిరించి లేఖతీసుకున్నారని పోలీసులు కోర్టులో చెప్పించడంపైనా ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యలపై మాట్లాడేందుకు కార్పొరేటర్ రవికుమార్ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు డి సెంబర్ 16న వెళ్లారు. అదే సమయంలో కాల్‌మనీ నిందితుడైన మాధవశెట్టి శివకుమార్‌పై ఫిర్యాదుచేసిన ముక్తి కుమారి అక్కడ కని పించడంతో పలకరించారు.
ఆమెతో రవి మాట్లాడినప్పుడు చూసిన కొందరు టీడీపీ కార్యకర్తలు అధికార పార్టీ నేతలకు వారం రోజుల తరువాత చేరవేశారు. అటువైపు నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు కుమారిని పోలీసులు పిలిపించి డిసెంబరు 29న కంప్లైంట్ తీసుకున్నారు.. 31న రవికుమార్‌ను అరెస్ట్ చేశారు.
రౌడీషీట్ తెరిచేందుకు ఇవీ కారణాలు..
2014 నవంబర్‌లో జాతీయ రహదారి పక్కన కృష్టలంకలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఆక్రమణలంటూ అధికారులు తొలగించారు. స్థానిక ప్రజాప్రతినిధిగా వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీ కార్పొరేటర్ పల్లెం రవి పేదలకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లు తొలగించవద్దని అధికారులను కోరారు. అక్కడే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డివిజన్ కార్యాలయాన్ని కూడా కూల్చివేసిన జాతీయ రహదారి ఉద్యోగులు తమ విధులకు ఆటంకం కలిగించాడని కార్పొరేటర్‌పై ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదైంది.
ఆర్టీసీ పెంచిన బస్సు చార్జీలను ఉపసంహరించాలని వైఎస్సార్‌ీ సపీ ఇచ్చిన పిలుపు మేరకు అక్టోబర్ నెలాఖరులో విజయవాడ బస్‌స్టేషన్ వద్ద జరిగిన ధర్నాలో కార్పొరేటర్ రవి పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఆర్టీసీ ఉద్యోగుల విధులకు ఆటంకం కల్పించారని అతనిపై కేసు నమోదైంది.
కాల్‌మనీ కేసులో నిందితుడైన మాజీ రౌడీషీటర్ మాధవశెట్టి శివకుమార్‌పై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కు తీసుకోవాలని రాణీగారితోటకు చెందిన ముక్తి కుమారిని పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే బెదిరించారని డిసెంబర్ 29న రవిపై కేసు నమోదైంది. ఈ కేసులో డిసెంబర్ 31న కార్పొరేటర్ రవిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. మరోసారి కుమారిని రవి అనుచరులు బెదిరించి ఆమె వద్ద బలవంతంగా లేఖ రాయించుకున్నారని జనవరి 5న పోలీసులు రెండో కేసు నమోదు చేశారు.