బీజేపీ, టీడీపీ నేతల బాహాబాహీ | War between BJP,TDP leaders | Sakshi
Sakshi News home page

బీజేపీ, టీడీపీ నేతల బాహాబాహీ

Jul 4 2016 6:33 AM | Updated on Mar 29 2019 9:31 PM

బీజేపీ, టీడీపీ నేతల బాహాబాహీ - Sakshi

బీజేపీ, టీడీపీ నేతల బాహాబాహీ

బీజేపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఒక దశలో ఇరువర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు.

విజయవాడలో ఉద్రిక్తత
- గోశాలలో ఇరుపార్టీల కార్యకర్తల తోపులాట
- బీజేపీ నేతల ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
 
 సాక్షి, విజయవాడ : బీజేపీ, టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. ఒక దశలో ఇరువర్గాలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. పెద్దపెద్దగా కేకలు వేసుకోసాగారు. పరిస్థితి చెయ్యిదాటిపోతోందని గమనించిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేసి అక్కడ్నుంచి పంపివేశారు.  మీ సంగతి తేలుస్తాం. ఇక్కడికి రావడానికి మీరెవరంటూ టీడీపీ నేతలు బహిరంగంగానే హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న నడుమ పెద్ద వాగ్వాదమే నడిచింది. ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న గోశాలలో ఆదివారం జరిగిన సంఘటన ఇది.

 వాగ్వాదం.. తోపులాట..
 విజయవాడ నగరంలో రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన దేవాలయాలను బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, నగర అధ్యక్షుడు డాక్టర్ దాసం ఉమామహేశ్వరరాజు ఆదివారం ఉదయం పరిశీలించారు. చివరగా అర్జున వీధిలోని గోశాల వద్దకు చేరుకుని అక్కడ జరిగిన ధ్వంసాన్ని పరిశీలించి విలేకరులతో మాట్లాడసాగారు. కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడే సమయంలో టీడీపీ నేతలు వచ్చి అడ్డుకున్నారు. గోశాల ఎదురుగానే ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఇళ్లు ఉండడంతో ఆయన తన అనుచరులతో అక్కడికి వచ్చి సోము వీర్రాజు నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్‌ను అడ్డుకుని తన వాదన వినిపించబోయారు.

తమ అభిప్రాయాలు చెప్పేందుకు ప్రెస్‌మీట్ పెట్టుకుంటే దాన్నెలా అడ్డుకుంటారంటూ వీర్రాజు, కన్నా  ప్రశ్నించారు. ఈలోగా  బీజేపీ నేతల వెనుక ఉన్న కార్యకర్తలను వెంకన్న వెంట వచ్చిన కార్యకర్తలు తోసివేశారు. బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. దీంతో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. ప్రెస్‌మీట్ అక్కడ నిర్వహించకూడదంటూ మైక్‌లు లాగేయబోయారు. ఒక దశలో మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్.. బుద్దా వెంకన్న బంధువు, మాజీ కార్పొరేటర్ సంపర రాంబాబుల  మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కార్యకర్తలు నాయకులకు అడ్డుగా నిలబడి ప్రెస్‌మీట్  కొనసాగించాలంటూ పట్టుబట్టారు. దీంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

 బీజేపీ నేతల్ని పంపించి వేసిన పోలీసులు
 గొడవ గురించి తెలుసుకున్న రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు అక్కడకు రాసాగారు.  పరిస్థితి ఉద్రక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెప్పారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ తదితరుల్ని అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కోరారు. వారిని బలవంతంగా కారు ఎక్కించి పంపించేశారు. బీజేపీ నేతలు వెళ్లిపోగానే అదే ప్రదేశంలో వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు.

 ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతాం
 సోము వీర్రాజు మాట్లాడుతూ.. నగరంలో దేవాలయాలు, గోశాలను అడ్డగోలుగా కూల్చివేయడం అమానుషమని, దీన్ని బీజేపీ ఎప్పటికీ సమర్ధించబోదన్నారు. అభివృద్ధికి తాము అడ్డుకాబోమని, అభివృద్ధికి అడ్డువచ్చే దేవాలయాలను వాటి యాజమాన్యాలతో మాట్లాడి  ప్రత్యామ్నాయం చూపించిన తరువాత తొలగించాలని సూచించారు. గోశాలకు సంబంధించి 20 రోజులు క్రితం సీఎం సమక్షంలో చేసుకున్న ఒప్పందాన్ని ప్రక్కన పెట్టి  రోడ్డుకు విస్తరించారనే విషయం సీఎం దృష్టికి తీసుకువెళ్లి గోశాలకు, దేవాలయాలకు న్యాయం చేయాలని కోరతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement