ప్రైౖ వేట్ కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
ఎల్లారెడ్డిలోని నలంద జూనియర్ కళాశాలలో గురువారం విజిలెన్స్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్ శాఖ డీఎస్పీ ప్రతాప్ నేతృత్వంలో అధికారుల బృందం కళాశాల రికార్డులను తనిఖీ చేశారు.
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డిలోని నలంద జూనియర్ కళాశాలలో గురువారం విజిలెన్స్ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. విజిలెన్స్ శాఖ డీఎస్పీ ప్రతాప్ నేతృత్వంలో అధికారుల బృందం కళాశాల రికార్డులను తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కళాశాలల్లో మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలు, బాలికలకు ప్రత్యేక టాయిలెట్లు, బాత్‌రూంలు, ఆటస్థలాలు, అధ్యాపకుల అర్హతలు, విద్యా సంస్థల ధ్రువపత్రాలు, అనుమతులను తనిఖీ చేస్తున్నామని విజిలెన్స్ డీఎస్పీ తెలిపారు. ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకు ఉపకారవేతనాలు అందాయా లేదా.. అన్న విషయాన్ని కూడా తనిఖీ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న 300 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించామని, ఇంకా 50 కళాశాలల్లో తనిఖీలు చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రైవేటు కళాశాలల్లో అగ్నిమాపక, సానిటరీ ధ్రువపత్రాలు లేకపోవడం తమ పరిశీలనలో గుర్తించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ శాఖ ఏఈఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ శాఖ ఏఈ సతీశ్‌రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.